అమెరికాలోని న్యూమెక్సికో రాష్ట్రంలో శాంటా ఫే నగరంలో ఓ భారతీయ రెస్టారెంట్ ను శ్వేతజాతి దురహంకారులు ధ్వంసం చేశారు. పాకశాలలోని గోడలపైన ‘వైట్ పవర్’, ‘ట్రంప్ 2020’, ‘గో హోం’ అనే నినాదాలు రాశారు. తలుపులు, కౌంటర్లు, గోడలన్నింటా వికృతమైన రాతలున్నాయని రెస్టారెంట్ యజమాని బల్జీత్ సింగ్ చెప్పారు. ఈ సిక్కు రెస్టారెంట్ కు జరిగిన నష్టం లక్ష డాలర్లు ఉంటుందని స్థానిక శాంటాఫే మీడియా ప్రతినిధి చెప్పారు. ఇలాంటి విద్వేషం, విధ్వంసంపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఖ్ అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (సల్దేఫ్) ఇ.డి. కిరణ్ కౌర్ గిల్ డిమాండ్ చేశారు.
2020-06-24బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ (60) ‘కరోనా’ తీవ్రతతో మరణించారు. ఘోష్ వైరస్ బారిన పడినట్టు గత నెలలో నిర్ధారణ అయింది. ముందే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఆయన కోలుకోలేకపోయారు. దక్షిణ 24 పరగణాల జిల్లా ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘోష్ మూడుసార్లు ఎన్నికయ్యారు. 1998 నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు తమిళనాట డిఎంకె నేత అన్బజగన్ కూడా ‘కరోనా’తో మరణించిన సంగతి తెలిసిందే.
2020-06-24ఇండియాలో ‘కరోనా’ విస్తరణ రోజురోజుకూ తీవ్రమవుతోంది. నిన్న ఒకే రోజు 15,968 కొత్త కేసులు నమోదయ్యాయి. 465 మంది వైరస్ తీవ్రతతో మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,56,183కు, మృతుల సంఖ్య 14,476కు పెరిగాయి. కొత్త కేసులు ఢిల్లీలో అత్యధికంగా 3,947 నమోదయ్యాయి. మొత్తం కేసులు మహారాష్ట్రలో 1,39,010కి, ఢిల్లీలో 66,602కి, తమిళనాడులో 64,603కి పెరిగాయి. మరణాలు మహారాష్ట్రలో 6531కి, ఢిల్లీలో 2301కి, గుజరాత్ రాష్ట్రంలో 1710కి పెరిగాయి. దేశవ్యాప్తంగా 2,58,685 మంది కోలుకోగా 1,83,022 మంది ఇంకా వైరస్ తో బాధపడుతున్నారు.
2020-06-24ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయంలో సిబ్బందిని 50 శాతం తగ్గించాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. అదే సమయంలో ఇస్లామాబాద్ లోని భారత మిషన్ నుంచి కూడా అంతే సంఖ్యలో సిబ్బందిని ఉపసంహరించాలని నిర్ణయించింది. 7 రోజుల్లోగా ఈ తగ్గింపును పూర్తి చేయనున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఇటీవల గూఢచర్యానికి పాల్పడ్డారని ఇద్దరు పాకిస్తాన్ దౌత్యాధికారులను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నందుకు ప్రతిగా ఇస్లామాబాద్ లో ఇద్దరు భారత దౌత్య సిబ్బందిని కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
2020-06-23‘కరోనా’ కాలంలో చాలా మంది పిల్లలు టీవీలకు, వీడియో క్రీడలకు పరిమితం కాగా... ఢిల్లీలో ఓ పదో తరగతి విద్యార్ధి 10 మందికీ పనికొచ్చే ఆలోచన చేశాడు. 3డి ప్రింటర్ ఉపయోగించి ముఖ కవచాలు (ఫేస్ మాస్కులు) రూపొందించాడు. జరేబ్ వర్ధన్ అనే విద్యార్ధి తను చదువుకునే గదినే ఉత్పత్తి కేంద్రంగా మలచుకొని మాస్కులు రూపొందించాడు. 100 మాస్కులను మొన్న ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవకు అందజేశాడు. ‘‘సాధకులు కష్టసమయాల్లోనే పుడతారు. కంఫర్ట్ జోన్లలో కాదు’’ అని పోలీసు కమిషనర్ తన ప్రశంసాపత్రంలో పేర్కొన్నారు. తన పాకెట్ మనీతో 3డి మిషన్ కొనుగోలు చేసినట్టు జరేబ్ చెప్పాడు.
2020-06-24మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం 200వ మైలు రాయిని చేరుకున్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కడ పర్యటించారు. గోడపై సంతకం చేశారు. వలసలకు వ్యతిరేకంగా మరో సంకేతాన్ని అమెరికన్లకు ఇచ్చారు. నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా.. ఇండియా, మెక్సికో వంటి దేశాలపై అధిక ప్రభావం చూపేలా హెచ్-1బి, హెచ్-2బి, ఎల్-1 తదితర వీసాల జారీపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే.. 2016 ఎన్నికలకు ముందు, తర్వాత కూడా ట్రంప్ ప్రచారం చేసిన సరిహద్దు గోడ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 1954 మైళ్ళలో ఇప్పటికి కేవలం 200 మైళ్ళు పాత కంచెను తొలగించి కొత్తది నిర్మించారు.
2020-06-243 నుంచి 7 రోజుల్లో ‘కరోనా’ను 100 శాతం నయం చేస్తుందంటూ రాందేవ్ కంపెనీ ‘పతంజలి’ విడుదల చేసిన ‘కరోనిల్’, ‘స్వసరి’పై కేంద్ర ఆయుష్ శాఖ దృష్టి సారించింది. రాందేవ్ ‘మందు’ విడుదలైన కొద్ది గంటల్లోనే దాన్ని ప్రచారం చేయడం మానాలని కేంద్రం ఆదేశించింది. పరిశోధన జరిగిన ప్రదేశాలు, ఆసుపత్రులు, ఇనిస్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ క్లియరెన్స్, క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ- ఇండియా (సిటిఆర్ఐ) రిజిస్ట్రేషన్, అధ్యయనం ఫలితాలు తదితర వివరాలు సమర్పించాలని ‘పతంజలి’కి సూచించింది. ఉత్పత్తి ఆమోదానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అధారిటీని కూడా ఆయుష్ శాఖ కోరింది.
2020-06-23మెక్సికో దక్షిణ తీరంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.4గా నమోదైంది. భారీగా భవనాలు కూలిపోయాయి. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 11.30కి భూకంపం సంభవించింది. భూ ఉపరితలానికి 26 కి.మీ. లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. పొరుగు దేశాలైన గ్వాటెమాల, హోండురాస్, ఎల్ సాల్వెడార్ లలో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంపం కారణంగా స్వల్ప స్థాయిలో సునామీ కూడా సంభవించింది. అకాపుల్కోలో 0.68 మీటర్లు, సలినక్రులో 0.71 మీటర్ల ఎత్తున ఎగసి పడ్డాయి.
2020-06-24ఏపీ ‘ఎన్నికల కమిషనర్’ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనను కలవడంలో రహస్యమేమీ లేదని ఎంపీ సుజనా చౌదరి వివరణ ఇచ్చారు. ‘కరోనా’ కారణంగా లాక్ డౌన్ ప్రకటించాక తాను పార్క్ హయత్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నానని, అక్కడే అనేక మందిని కలుస్తున్నానని పేర్కొన్నారు. ఈ నెల 13న తమ పార్టీ నేత కామినేని శ్రీనివాస్ అపాయింట్ మెంట్ సమయంలో వచ్చి కొద్దిసేపు మాట్లాడి వెళ్ళారని, అది సాధారణంగా జరిగే కలయికేనని సుజనా స్పష్టం చేశారు. రమేష్ కుమార్ తో భేటీ మర్యాదపూర్వకమని, తమకు కుటుంబ సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. రెండు సంబంధం లేని సమావేశాలను ఒకటిగా చూపుతున్నారని ఆక్షేపించారు.
2020-06-23ఏపీ ‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్’ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యసభ సభ్యుడు (బిజెపి) సుజనా చౌదరిని కలవడం రాజకీయ వివాదంగా మారింది. ఈ నెల 13న హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో సుజనా చౌదరి, రాష్ట్ర మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ లతో ‘రహస్య సమావేశం’ జరిపారంటూ నిమ్మగడ్డపై వీడియో అస్త్రాన్ని ప్రయోగించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హోటల్ సీసీ టీవీ ఫుటేజీని ఇందుకు సాక్ష్యంగా చూపింది. నిమ్మగడ్డ వెనుక చంద్రబాబు ఉన్నారన్న గత ఆరోపణలను పునరుద్ఘాటించింది. స్థానిక ఎన్నికలను వాయిదా వేయడంపై మండిపడ్డ జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డను తొలగించడం, ఆ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేయడం తెలిసిందే.
2020-06-23