గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనుకకు తీసుకురావడం ఇప్పుడు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం కేరళ హైకోర్టుకు నివేదించింది. ఈ అంశంపై దాఖలైన మూడు పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణకు చేపట్టింది. మలయాళీలను సొంత ప్రాంతాలకు రప్పించి ‘క్వారంటైన్’లో ఉంచడానికి కేరళ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున.. ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలని పిటిషనర్లు కోరారు. అయితే, ‘కరోనా’ ప్రభావం ఉన్న దేశాలనుంచి భారతీయులను వెనుకకు తీసుకురావద్దని కేంద్రం నిర్ణయించిందని, కేరళకు మాత్రం మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వ కౌన్సిల్ సువిన్ మీనన్ కోర్టులో స్పష్టం చేశారు.
2020-04-17కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,007 ‘కరోనా’ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 23 మంది చనిపోయారు. ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 13,387కు పెరిగినట్టు ఆరోగ్య శాఖ చెబుతుండగా.. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ డేటా ప్రకారం ఆ సంఖ్య 13,835. శుక్రవారం ఉదయానికే 452 మరణాలు నమోదయ్యాయి. ‘కరోనా’ కేసులు ‘లాక్ డౌన్’కు ముందు 3 రోజులకు ఓసారి రెట్టింపు అయ్యాయని, ఇప్పుడు అందుకు 6.2 రోజులు పడుతోందని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు.
2020-04-17‘మహా’ మురికివాడ ధారావిలో ‘కరోనా’ కేసుల సంఖ్య 101కి పెరిగింది. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ మురికివాడలో ఇప్పటికి 10 మంది చనిపోయారు. ఈ ప్రాంతంలో మరణాల రేటు (9.9 శాతం) మహారాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. శుక్రవారమే 15 కొత్త కేసులు నమోదు కాగా 62 సంవత్సరాల పేషెంట్ ఒకరు చనిపోయారు. జనసాంద్రత అతి ఎక్కువగా ఉండే ధారావిలో గుడిసెలు, ఇరుకిరుకి ఇళ్ళలో సుమారు 8 లక్షల మంది నివశిస్తున్నారు. ఈ ప్రాంతం మొత్తాన్ని ‘హాట్ స్పాట్’గా గుర్తించిన ప్రభుత్వం, గత వారమే 9 ప్రదేశాలను ‘నియంత్రిత జోన్’లుగా ప్రకటించింది.
2020-04-17‘కరోనా’ తొలిగా వ్యాప్తి చెందిన చైనాలోని ‘వుహాన్’లో మరణాల సంఖ్య హఠాత్తుగా 50 శాతం పెరిగింది. కొన్ని మరణాలను ఆలస్యంగా రిపోర్టు చేయడం, ఇంతకు ముందు ‘కరోనా’ మరణాల జాబితా నుంచి తొలగించినవి మళ్లీ కలపడం ఇందుకు కారణంగా అధికారులు చెప్పారు. 1290 మరణాలను తాజాగా జోడించడంతో మొత్తం మృతుల సంఖ్య 3,869కి పెరిగింది. ‘కరోనా’ సోకిన వ్యక్తుల సంఖ్య కూడా 325 పెరిగి 50,333కు చేరింది. వుహాన్ సముద్ర ఉత్పత్తుల మార్కెట్ ద్వారా వ్యాపించిందని భావిస్తున్న ‘కరోనా’, ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 21 లక్షల మందికి పైగా వ్యాపించి 1.45 లక్షల మందిని బలి తీసుకుంది.
2020-04-17కరోనా వైరస్ కేంద్ర స్థానమైన చైనాలో 2020 తొలి త్రైమాసికంలో జీడీపీ తిరోగమించింది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో స్థూల ఉత్పత్తి మైనస్ 6.8 శాతంగా నమోదైంది. కరోనా ప్రభావం తీవ్రంగా పడింది ఈ త్రైమాసికంలోనే. జనవరి-మార్చి కాలంలో చైనా స్థూల దేశీయోత్పత్తి 20.65 ట్రిలియన్ యువాన్లు (2.91 ట్రిలియన్ యుఎస్ డాలర్లు)గా తేలింది. భారతీయ కరెన్సీలో ఇది రూ. 224 లక్షల కోట్లకు సమానం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంటే జీడీపీ 6.8 శాతం తగ్గిందని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ శుక్రవారం వెల్లడించింది. 1976 తర్వాత చైనా జీడీపీ కుంచించుకుపోవడం ఇదే తొలిసారి.
2020-04-17ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘కరోనా’తో ఇప్పటిదాకా 14 మంది మరణించగా.. వారిలో 13 మంది పురుషులు. వీరిలో ఇద్దరు డాక్టర్లు. నెల్లూరుకు చెందిన డాక్టర్ విదేశాలకు వెళ్లి వచ్చాక అనారోగ్యానికి గురయ్యారు. ఆ విషయాన్ని దాచిపెట్టి ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమాన్నీ చేపట్టారు. స్థానికంగా చికిత్సతో జబ్బు నయం కాకపోవడంతో చివరి రోజుల్లో చెన్నైలో చేరి అక్కడే చనిపోయారు. కర్నూలుకు చెందిన డాక్టర్ (78)కు.. ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చినవారి వల్ల ‘కరోనా’ సోకినట్టు సమాచారం. మొత్తం మృతుల్లో 12 మంది 50 సంవత్సరాలు దాటినవారు.
2020-04-17దేశంలో గురువారం నాటికి ‘కరోనా’ కేసులు 13,339కి పెరిగాయి. 452 మంది మరణించారు. అదే సమయంలో విదేశాల్లో ఉన్న భారతీయుల్లో 3,336 మందికి వైరస్ సోకగా 25 మంది చనిపోయినట్టు కేంద్ర ప్రభుత్వ సమాచారం. 53 దేశాల నుంచి భారతీయులకు ‘కరోనా’ సోకినట్టు సమాచారం రాగా.. బాధితుల్లో ఎక్కువ మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. ఫ్రాన్స్, అమెరికాలలో కూడా చాలామంది భారతీయులు ‘కరోనా’ బారిన పడినట్టు తెలుస్తోంది. ‘కరోనా’ను అరికట్టాలంటే ఇప్పుడు తరలింపు చేపట్టకూడదన్న ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాది మంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. గల్ఫ్ దేశాల్లోనే సుమారు 80 లక్షల మంది భారతీయులు ఉన్నారు.
2020-04-17ఆమె పేరు రంగోలి చండేల్. బాలీవుడ్ నటీమణి కంగనా రనౌత్ సోదరి, మేనేజర్ కూడా! ముల్లాలను, సెక్యులర్ మీడియాను వరుసగా నిలబెట్టి కాల్చేయాలని ట్విట్టర్లో పిలుపునిచ్చింది. తమను నాజీలని పిలిచినా లెక్కలేదని పేర్కొంది. ఈ చండాలంపై నెటిజన్లు మండిపడ్డారు. చాలా మంది ఆమె ట్వీట్లపై ట్విట్టర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ‘విద్వేష’ ప్రచారం చేస్తున్నందున ఆమె అకౌంట్ ను సస్పెండ్ చేయాలని కోరారు. ఫలితంగా గురువారం చండేల్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయింది. చండేల్ దేశంలో నిరంకుశత్వానికి మద్ధతు పలుకుతూ.. 2024 లోక్ సభ ఎన్నికలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేసింది.
2020-04-16‘కరోనా’ గ్రాఫ్ తెలంగాణలో మళ్లీ పైకి లేచింది. నిన్న కేవలం 6 కొత్త కేసులు నమోదు కాగా గురువారం 51 పెరిగాయి. వాటిలో 90 శాతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జి.హెచ్.ఎం.సి) పరిధిలోనే నమోదయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 700 మందికి ‘కరోనా’ నిర్ధారణ అయితే.. అందులో 645 మందికి ‘మర్కజ్’ ద్వారానే వ్యాపించిందని ఈటల పేర్కొన్నారు. వ్యాధి నుంచి కోలుకున్న మరో 68 మందికి రెండోసారి పరీక్షల్లో కూడా ‘నెగెటివ్’ వచ్చిందని, అందువల్ల వారిని డిశ్చార్జి చేస్తున్నామని మంత్రి చెప్పారు.
2020-04-16రాష్ట్రంలో 32,700 మంది ‘కరోనా వైరస్ డిసీజ్’ లక్షణాలు చూపిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. వచ్చే వారం రోజుల్లో వారందరికీ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన గురువారం చెప్పారు. తక్కువ పరీక్షలు చేస్తే వ్యాధి వ్యాపిస్తూనే ఉంటుందని జవహర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 10 రోజుల క్రితం 10 లక్షల జనాభాకు కేవలం 78 పరీక్షలు జరిగాయని, ఇప్పుడా సంఖ్య 331కి పెరిగిందని, మరో వారంలో రోజుకు 15 వేల పరీక్షలు చేసే స్థాయికి సామర్ధ్యం పెరుగుతుందని వివరించారు. పరీక్షలు పెరిగేకొద్దీ కేసులు ఎక్కువ బయటపడతాయని ఆయన స్పష్టం చేశారు.
2020-04-16