ఉగాదికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్న ప్రభుత్వం, ‘కరోనా వైరస్’ కారణంగా ఆ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14కు వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం వెల్లడించింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టాలు పంపిణీ చేస్తామని తాజాగా తెలిపింది. పట్టాల పంపిణీకి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వాయిదా వేయడం వ్యూహాత్మకం. రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనకు వ్యతిరేకంగా.. దళిత సంఘాల నాయకత్వలో అధికార పార్టీ ఓ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. రాజధాని భూముల్లో ఇళ్ళ పట్టాల పంపిణీకి ‘అంబేద్కర్ జయంతి’ మంచి సందర్భంగా అధికార పార్టీ భావిస్తోంది.
2020-03-20ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ పచ్చ జెండా ఊపింది. ‘నవరత్నాలు-పేదల దరికి ఇళ్ళు’ పేరిట అమలు చేయనున్న ఈ పథకానికి అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖకు ఎన్నికల కమిషన్ నిన్న రాత్రి బదులిచ్చింది. ఈ పథకం కింద వివిధ కార్యకలాపాలను కొనసాగించడానికి అభ్యంతరం లేదని ఎస్ఈసీ తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళపట్టాల కార్యక్రమానికి ఎన్నికల కమిషన్ అనుమతిని కోరింది.
2020-03-20మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్షకు ముందే సిఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత కమలనాథ్ ప్రకటించారు. 15 నెలలు పదవిలో ఉన్న కమలనాథ్, పార్టీ యువనేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో మెజారిటీ కోల్పోయారు. శుక్రవారం సాయంత్రం లోపు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని నిన్న సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. శుక్రవారం సి.ఎల్.పి. సమావేశం తర్వాత మీడియా సమావేశంలో కమలనాథ్ రాజీనామా ప్రకటన చేశారు.
2020-03-20‘నిర్భయ’ తల్లిదండ్రులు ఆశించినట్టు దేశంలోని మహిళలు ఇక భద్రత ఫీలవుతారా? రోజుకు సగటున 100 మానభంగాలు జరుగుతున్నప్పుడు అది సాధ్యమా? 2018లో దేశంలో 33,356 మానభంగం కేసులు నమోదయ్యాయి. అత్యాచారం లేదా సామూహిక అత్యాచారంతోపాటు బాధితురాలిని చంపిన కేసులు 294 నమోదయ్యాయి. 2017లో 223 కేసులు నమోదైతే మరుసటి ఏడాది 32 శాతం పెరిగాయి. ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు లేదా వారి అండగల వాళ్ళు ‘నిర్భయం’గా హీనమైన నేరాలకు పాల్పడుతున్నారు. బాధితులకు అండగా ఉన్న కుటుంబాలనే నిర్మూలిస్తున్న సమాజంలో ‘భద్రత’ అత్యాశే అవుతుందేమో?!
2020-03-20తమ కుమార్తె కేసులో దోషులు పిటిషన్లు వేసిన తీరు చూస్తే మన చట్టాల్లో లొసుగులు కనిపిస్తున్నాయని 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలి తల్లి ఆశాదేవి వ్యాఖ్యానించారు. ఆ లొసుగులను సరిదిద్దాలని బాధితురాలి తండ్రి విన్నవించారు. 8 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, చివరికి న్యాయం దక్కిందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ కుమార్తె తిరిగి రాకపోయినా.. దేశంలోని అందరు కుమార్తెలకోసం పోరాడామని వారు చెప్పారు. అమ్మాయిలు ఇక సురక్షితంగా భావిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
2020-03-20ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో దోషులు ఉరిశిక్షను ఎలాగైనా తప్పించుకోవాలని, ప్రాణాలు నిలబెట్టుకోవాలని మరణానికి రెండు గంటల ముందు వరకు ప్రయత్నించారు. ఢిల్లీ హైకోర్టులో రివిజన్ పిటిషన్, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఢిల్లీ హైకోర్టు రాత్రి 12 గంటలకు జస్టిస్ మన్మోహన్ నివాసంలో విచారణ జరిపి దోషుల విన్నపాన్ని తిరస్కరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా క్షమాబిక్ష పిటిషన్ ను తిరస్కరించడాన్ని సవాలు చేశారు. జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎఎస్ బోపన్న వేకువజామున 2.45కు విచారణ ప్రారంభించి 3.45కి పిటిషన్ ను కొట్టివేశారు.
2020-03-202012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో దోషులు నలుగురినీ శుక్రవారం ఉదయం తీహార్ జైలులో ఉరి తీశారు. అక్షయ్ ఠాకూర్ (31), వినయ్ శర్మ (26), పవన్ గుప్తా (25), ముఖేష్ సింగ్ (32) లను కోర్టు నిర్దేశించిన ప్రకారం ఉదయం 5.30 గంటలకు ఉరి తీసినట్టు జైలు డైరెక్టర్ సందీప్ గోయల్ నిర్ధారించారు. 23 ఏళ్ల యువతిపై సామూహికంగా అత్యాచారం చేయడమే కాకుండా క్రూరంగా హింసించిన మృగాలు వీళ్ళు. 2015 తర్వాత ఇండియాలో ఉరిశిక్ష అమలు కావడం ఇదే తొలిసారి. ఒకే నేరంపై నలుగురిని ఒకేసారి ఉరి తీయడం తీహార్ జైలులో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు.
2020-03-20‘కరోనా వైరస్’ ఇటలీలో కరాళ నృత్యం చేస్తోంది. గురువారంనాటికి ఇటలీలో మరణాల సంఖ్య చైనాను మించిపోయింది. చైనాలో డిసెంబరు 31 నుంచి మార్చి 18 అర్ధరాత్రి వరకు 3,245 మంది ‘కరోనా’తో మృత్యువాత పడగా.. ఇటలీలో కొద్ది రోజుల్లోనే అంతకు మించి (3,405 మంది) పేషెంట్లు చనిపోయారు. ఇటలీలో బుధవారం 475, గురువారం మరో 427 మరణాలు నమోదయ్యాయి. చైనాలో 82 వేలకు పైగా ‘కరోనా’ కేసుల్లో మరణాల రేటు 3.95 శాతం ఉంటే ఇటలీలో నమోదైన 41,035 కేసుల్లో మరణాల రేటు 8.3 శాతంగా ఉంది.
2020-03-20‘కరోనా’ కాలంలో ప్రజల తక్షణ అవసరాలను తీర్చడం, కొనుగోలు శక్తి పడిపోకుండా చూడటం అన్న జమిలి లక్ష్యాలతో కేరళ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ. 14,000 కోట్లను ఏప్రిల్ లోగా విడుదల చేయనుంది. కుదుంబశ్రీ పథకం కింద రూ. 2000 కోట్ల రుణాలు, ఉపాధి హామీకి రూ. 2000 కోట్లు కేటాయించింది. ఆరోగ్య సాయంకోసం రూ. 500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ప్రజలు చెల్లించాల్సిన విద్యుత్, నీటి బిల్లుల గడువును సడలించడం, ప్రయాణీకుల వాహనాలకు పన్ను రాయితీ వంటి చర్యలను ప్రకటించింది.
2020-03-19‘కరోనా’ మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఇళ్ళకు పరిమితమయ్యే ప్రజలను ఆదుకోవడానికి కేరళ ప్రభుత్వం రూ. 20,000 కోట్ల విలువైన ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. సామాజిక పింఛన్లు రాని కుటుంబాలకు నెలకు రూ. 1000 చొప్పున ఇచ్చేందుకు రూ. 1320 కోట్లను కేటాయించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం ప్రకటించారు. పెన్షన్లు వచ్చేవారికి 2 నెలల కిస్తీలను ఈ నెలలోనే చెల్లిస్తామని ఆయన చెప్పారు. ధనిక-పేద తేడా లేకుండా అందరికీ ఉచిత బియ్యం, 1000 సబ్సిడీ భోజనశాలలను ఏప్రిల్ లోగా ప్రారంభించడం వంటి అనేక చర్యలను సిఎం ప్రకటించారు.
2020-03-19