‘కరోనా’ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజధానిని విశాఖపట్నానికి తరలించే అంశంపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. జూలైలో ‘కరోనా’ వ్యాప్తి పతాక స్థాయికి చేరుతుందని అంచనాలు ఉన్నాయన్న మంత్రి, వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టాక తరలింపు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. రాజధానిని విశాఖకు తరలిస్తామని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న విషయాన్ని ఆయన ఆదివారం గుర్తు చేశారు.
2020-06-21‘నరేంద్ర మోడీ నిజానికి సరెండర్ మోడీ’’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రం విసిరారు. గాల్వన్ లోయలో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిన తర్వాత.. ‘ఎవరూ చొరబడలేద’ని ప్రధాని ప్రకటించడంపై రాహుల్ గత మూడు రోజులుగా విరుచుకుపడుతున్నారు. ఇండియా- చైనా తాజా పరిణామాలపై ‘జపాన్ టైమ్స్’ వ్యాఖ్యానాన్ని రాహుల్ గాంధీ ఆదివారం ట్విట్టర్లో షేర్ చేశారు. 2014 నుంచీ మోడీ చైనాను బుజ్జగించే విధానాలను అవలంభించారని జపాన్ టైమ్స్ సోదాహరణంగా విమర్శించింది.
2020-06-21కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ లతో సమావేశమయ్యారు. ‘కరోనా’ వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో.. షా ఢిల్లీ సిఎంతో సమావేశం కావడం వారంలో ఇది మూడోసారి. గత గురువారం దేశ రాజధాని ప్రాంతం (ఎన్.సి.టి)లో ‘కరోనా’ వ్యాప్తిపై షా సమీక్ష నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, హర్యానాలలోని కొన్ని ప్రాంతాలు కూడా ఎన్.సి.టి.లో భాగం. అందువల్ల ఒక ఉమ్మడి వ్యూహం అవసరమని షా ఉద్ఘాటించారు. ఢిల్లీలో ‘కరోనా’ కేసులు ఇప్పటికే 55 వేలు దాటగా.. ఈ నెలాఖరుకు లక్షకు, వచ్చే నెలాఖరుకు 5.5 లక్షలకు చేరతాయని అంచనా.
2020-06-21‘కరోనా’ వ్యాప్తి ఎప్పుడు మందగిస్తుందో దేవుడికి మాత్రమే తెలుసని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ‘కరోనా’ కేసులను సున్నాకు తెస్తామని చెప్పిన రెండు నెలల తర్వాత పళనిస్వామి ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం. ‘లాక్ డౌన్’ ఓ ‘స్పీడ్ బ్రేకర్’లా పని చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో బయటపడిన ‘కరోనా’ కేసుల్లో 80 శాతం మందికి ఆ లక్షణాలేమీ కనిపించలేదని, కేవలం 20 శాతానికే పైకి కనిపించాయని చెప్పారు. రాష్ట్రంలో రికవరీ రేటు 54 శాతంగా ఉన్నట్టు పళనిస్వామి తెలిపారు.
2020-06-20ఆంధ్రప్రదేశ్ లోనూ ‘కరోనా’ వ్యాప్తి తీవ్రతరమవుతోంది. ఆదివారం ఉదయం 9 గంటల రిపోర్టు ప్రకారం గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 477 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8929కి చేరింది. అందులో 1540 మంది ఇతర రాష్ట్రాల నుంచి, 330 మంది ఇతర దేశాలనుంచి వచ్చినవారు. కృష్ణా జిల్లాలో కేసుల సంఖ్య వెయ్యి దాటింది (1048). కర్నూలు (1294), అనంతపురం (800) వరుసగా 1,3 స్థానాల్లో ఉన్నాయి. తర్వాత గుంటూరు (768 కేసులు), చిత్తూరు (562), తూర్పు గోదావరి (555), పశ్చిమ గోదావరి (550) ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అతి తక్కువ (59) కేసులు నమోదు కాగా ఆ తర్వాత విజయనగరంలో 84 ఉన్నాయి.
2020-06-21చైనా సరిహద్దుల్లో ఆక్రమణల నిరోధానికి కఠినంగా వ్యవహరించేలా భద్రతా దళాలకు ‘పూర్తి స్వేచ్ఛ’ కల్పించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ సమావేశం తర్వాత ఈ సమాచారం బయటకు వచ్చింది. గాల్వన్ లోయను చైనా సైన్యం ఆక్రమించడం, వారి టెంట్లను తొలగించడానికి వెళ్లిన భారత సైనికులను చంపడం వంటి పరిణామాల నేపథ్యంలో ‘‘మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేద’’ని ప్రధాని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చైనా సరిహద్దుల్లో భారీగా ఆర్మీని, వాయుసేనను మోహరించింది.
2020-06-21ఆయుధాలతో కూడిన పాకిస్తాన్ డ్రోన్ ఒకటి జమ్మూ కాశ్మీర్ లోకి చొరబడగా.. భారత సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) కూల్చివేసింది. కతువా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 8 అడుగుల వెడల్పు ఉన్న ఈ పాకిస్తాన్ డ్రోన్ లోపల అమెరికా తయారీ అధునాతన ఎం4 రైఫిల్, రెండు మ్యాగజైన్లు, 7 గ్రనేడ్లు ఉన్నాయి. ఈ ఆయుధాలను అలీభాయ్ అనే ఉగ్రవాదికి చేరవేసేందుకు (అతని పేరుతోనే) డ్రోన్ ను ఉపయోగించారు. బిఎస్ఎఫ్ పోస్టుకు ఎదురుగా పాకిస్తాన్ భూభాగంలో ఉన్న పికెట్ నుంచి ఈ డ్రోన్ ను నియంత్రించినట్టు భావిస్తున్నారు.
2020-06-20BRI (బ్రెజిల్, రష్యా, ఇండియా) దేశాలు ఇప్పుడు ‘కరోనా’ కేంద్ర బిందువులుగా మారాయి. వైరస్ కేసుల సంఖ్యలో బ్రెజిల్ (10,38,568), రష్యా (5,69,063), ఇండియా (3,95,048) వరుసగా 2,3,4 స్థానాల్లో ఉన్నాయి. బ్రెజిల్ దేశంలో అసాధారణ స్థాయిలో నిన్న ఒక్క రోజే 50 వేల కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇండియా శనివారానికి 4 లక్షల మార్కు దాటింది. కొత్త కేసుల సంఖ్యలో రష్యాకంటే ముందున్న ఇండియా అతి త్వరలో మొత్తం కేసుల్లోనూ మూడో స్థానానికి చేరనుంది. అగ్ర స్థానంలో ఉన్న అమెరికా దిశగా బ్రెజిల్, తర్వాత ఇండియా వేగంగా పయనిస్తున్నాయి.
2020-06-20ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత భూభాగాన్ని చైనాకు అప్పగించేశారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ‘‘ఆ భూభాగం చైనాదే అయితే.. 1. మన సైనికులు ఎందుకు చంపబడ్డారు? 2. వారు ఎక్కడ చంపబడ్డారు?’’ అని రాహుల్ శనివారం ట్విట్టర్లో ప్రశ్నించారు. మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేదంటూ నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత ప్రధాని మోడీ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముందస్తు పథకం ప్రకారం చైనా దాడి చేస్తే భారత ప్రభుత్వం నిద్రపోయిందని, సమస్యను ఒప్పుకోవడానికి నిరాకరిస్తోందని రాహుల్ నిన్న ధ్వజమెత్తారు.
2020-06-20‘మన సరిహద్దులోకి ఎవరూ చొరబడలేదు. ఏ పోస్టునూ ఆక్రమించలేదు’ అని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. లడఖ్ లో జరిగిన ఘర్షణలపై శుక్రవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో మోడీ ఈ మాట చెప్పారు. మన జవాన్లు 20 మంది అమరులయ్యారని, చొరబాటుకు ధైర్యం చేసినవారికి గుణపాఠం చెప్పారని ప్రధాని వ్యాఖ్యానించారు. గత నెలలో లడఖ్ లోని గాల్వన్ లోయ, పాంగాంగ్ ట్సో ప్రాంతాల్లోకి చైనా సైన్యం చొచ్చుకొచ్చిందని ఆధారసహితంగా వార్తలు వచ్చాయి. దాదాపు నెల రోజుల తర్వాత కేంద్ర రాజ్ నాథ్ సింగ్ ఈ విషయాన్ని అంగీకరించారు. ప్రధాని తాజా ప్రకటన అందుకు భిన్నంగా ఉంది.
2020-06-19