తనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని యాంకర్ ఆర్ణబ్ గోస్వామి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి విధులు ముగించుకొని భార్యతో కలసి ఇంటికి వస్తుండగా కారు అద్దాలు బద్దలు కొట్టడానికి ఇద్దరు ప్రయత్నించారని, ఏదో ద్రావకం సీసా విసిరారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. గత వారం మహారాష్ట్రలో జరిగిన మూకహత్యల విషయంలో సోనియాగాంధీపై గోస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణుల ఫిర్యాదుతో గోస్వామిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో.. బుధవారం ‘దాడి’ విషయంలో కూడా సోనియాపై ఆరోపణలు చేశారు గోస్వామి.
2020-04-23ఇండియాలో ‘కరోనా’ వైరస్ సోకినవారి సంఖ్య తాజాగా 20 వేలు దాటింది. రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటికి 20,800 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 645 మంది మరణించారు. ‘కరోనా’ కేసులు 5 వేల నుంచి 10 వేలకు పెరగడానికి 6 రోజులు పడితే, మరో 8 రోజుల్లో 20 వేలు దాటాయి. కేసుల సంఖ్యలో ఇండియా గత మూడు రోజుల్లో నాలుగు దేశాలను దాటి 17వ స్థానానికి చేరింది. అగ్ర రాజ్యాలతో పోలిస్తే ఇప్పటికీ మెరుగ్గానే కనిపిస్తున్నా.. పరీక్షల సంఖ్య పెరిగినకొద్దీ కేసులు పెరుగుతుండటం, వ్యాధి లక్షణాలు కనిపించని కేసులు టెస్టుల్లో బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
2020-04-22ప్రపంచమంతా ‘కరోనా’ భయంతో వణుకుతున్న వేళ భారత మార్కెట్లలో ఓ మెగా పెట్టుబడి ఒప్పందం సంచలనం సృష్టించింది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో వేదికల్లో కేవలం 9.99 శాతం వాటాకు రూ. 43,574 కోట్లు చెల్లించడానికి ‘ఫేస్ బుక్’ అంగీకరించింది. ఈ ఒప్పందంతో రిలయన్స్ జియో వేదికల మొత్తం విలువ అనూహ్యంగా రూ. 4.62 లక్షల కోట్లుగా తేలింది. మైనర్ వాటాకోసం ఇండియాకి వచ్చిన అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్.డి.ఐ) ఇదే అవుతుంది. ‘ఫేస్ బుక్’కు స్వాగతం పలుకుతూ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు.
2020-04-22 Read Moreకేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని (డి.ఎ.ని) 4% మేరకు పెంచాలన్న నిర్ణయాన్ని ఈ కేలండర్ ఏడాది అమలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ప్రభుత్వ ఆదాయంపై ‘కరోనా’ తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో.. బుధవారం భేటీ కానున్న కేంద్ర కేబినెట్ వాయిదా నిర్ణయం తీసుకోనున్నట్టు చెబుతున్నారు. ఈ నిర్ణయం 49.26 లక్షల ఉద్యోగులు, 61.17 లక్షల పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. 17% డి.ఎ.ని 21%కి పెంచాలని గత నెలలో కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆ పెంపుదలను ఈ ఏడాదికి నిలిపివేసి.. వచ్చే ఏడాది బకాయిల రూపంలో చెల్లించాలని ప్రభత్వం యోచిస్తోంది.
2020-04-21ప్రపంచవ్యాప్తంగా ‘కరోనా’ మహమ్మారి బారిన పడ్డ ప్రజల సంఖ్య తాజాగా 25 లక్షలు దాటింది. మంగళవారం నాటికి 25,01,156 మందికి వైరస్ సోకగా 1,71,810 మంది మరణించారు. మరణాల రేటు 6.87 శాతానికి పెరిగింది. వైరస్ తొలుత రిపోర్టయిన చైనాలో ఇప్పటిదాకా 83,853 కేసులు నమోదు కాగా, అమెరికాలో ఏకంగా 7,88,110 మందికి వైరస్ సోకింది. స్పెయిన్లో ‘కరోనా’ కేసులు 2 లక్షలు దాటాయి (2,04,178). టర్కీ, ఇరాన్ సహా 8 దేశాలు బాధితుల సంఖ్యలో చైనాను మించిపోయాయి. అమెరికాలో 42,458 మంది, ఇటలీలో 24,114 మంది, స్పెయిన్ లో 21,282 మంది మృత్యువాత పడ్డారు.
2020-04-21‘కరోనా’ నిర్ధారణ కోసం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను రెండు రోజులపాటు వినియోగించవద్దని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ‘ర్యాపిడ్’ పరీక్షల్లో కచ్చితత్వంపై సందేహాలు నెలకొనడంతో.. వాటిని నిలిపివేయాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఐసిఎంఆర్ ఎపిడెమియాలజీ చీఫ్ రామన్ గంగాఖేద్కర్ మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ అంశంపై మాట్లాడారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తాము పరిశీలించి రెండు రోజుల్లో మార్గదర్శకాలను జారీ చేస్తామని ఆయన చెప్పారు.
2020-04-21మత జాతీయవాద ప్రచారకర్త, ‘రిపబ్లిక్ టీవీ’ వ్యవస్థాపకుడు ఆర్ణబ్ గోస్వామి ‘ఎడిటర్స్ గిల్డ్’కు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని లైవ్ లోనే ప్రకటించారు. మహారాష్ట్ర లోని ‘పాల్ఘార్’లో ముగ్గురు ‘హిందువులు’ మూక హత్యకు గురైతే ఎడిటర్స్ గిల్డ్ మౌనం వహించిందన్నది ఆర్ణబ్ అభియోగం. గిల్డ్ అధ్యక్షుడు శేఖర్ గుప్తా లక్ష్యంగా ఆర్ణబ్ కామెంట్లు చేశారు. మైనారిటీలు హత్యకు గురైతే మౌనంగా ఉండేవారా? అంటూ సినీ ప్రముఖులనూ ప్రశ్నించారు. విడ్డూరమేమంటే.. అపరిచితులను దొంగలుగా పొరబడి స్థానికులు (ముస్లిం మూక కాదు) దాడికి దిగినట్టు అధికారులు స్పష్టం చేశాక కూడా ఆర్డబ్ తప్పుడు వాదన కొనసాగడం.
2020-04-21‘‘మమ్మల్ని నమ్మండి. ఇంకా దారుణమైన పరిస్థితి మన ముందుంది’’.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ చేసిన తాజా హెచ్చరిక ఇది. ‘కరోనా’ వైరస్ సోకినవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 25 లక్షలకు చేరువైన తరుణంలో మంగళవారం ఆయన ఓ ప్రకటన చేశారు. ‘కరోనా’ను ఇప్పటికీ చాలా మంది అర్దం చేసుకోలేదని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన లేదా ధనిక దేశాలను కూడా ఈ వైరస్ ఆశ్చర్యానికి గురి చేస్తుందని తాము చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మరిన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలను, మరింత విషాదాన్ని నిలువరిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
2020-04-21ప్రభుత్వాలను కూల్చి కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం అన్న రాజకీయ ప్రక్రియ ‘కరోనా’ కాలంలోనూ ఆగలేదు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కమలనాథ్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్, గత నెలరోజులుగా ‘ఏక వ్యక్తి ప్రభుత్వం’ నడుపుతున్నారు. మంగళవారమే ఐదుగురితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఇద్దరు కమలనాథ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ రెబల్స్. మార్చిలో కమలనాథ్ ప్రభుత్వం నుంచి తప్పుకొన్న తుల్సీ సిలావత్, గోవింద్ సింగ్ రాజ్ పుత్ ఈ మధ్యాహ్నం సివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
2020-04-21అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదృశ్య శత్రువు నుంచి దాడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. అమెరికా పౌరుల ఉద్యోగాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ట్రంప్ ట్విట్టర్లో పేర్కొన్నారు. వలసల నిలిపివేతపై ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విడుదల కానుంది. ‘కరోనా’ వైరస్ ప్రపంచమంతా విస్తరించి అమెరికాను గడగడలాడిస్తోంది. ఇప్పటిదాకా 24,78,948 మందికి వైరస్ సోకగా 1,70,399 మంది మరణించారు. అమెరికాలో 7,87,901 మందికి సోకితే 42,364 మంది చనిపోయారు. అమెరికా ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది.
2020-04-21