మహిళలపై అత్యాచారం వంటి క్రూరమైన నేరాలకు పాల్పడినవారికి ఉరిశిక్ష విధించే ప్రొవిజన్లతో కొత్త చట్టం తేవాలన్న ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ‘‘ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) బిల్లు 2019 (ఏపీ దిశ చట్టం)‘‘కు ఆమోదం తెలిపిన కేబినెట్, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకోసం ‘‘ఏపీ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగనెస్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ యాక్ట్ 2019’’కు కూడా పచ్చ జెండా ఊపింది. అత్యాచార నేరాల విచారణకు ఇప్పుడున్న 4 నెలల సమయాన్ని ‘‘దిశ చట్టం’’ 21 రోజులకు తగ్గిస్తుంది.
2019-12-11పౌరసత్వ (సవరణ) బిల్లు... పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లలో పీడితులైన మైనారిటీలకు ఉద్ధేశించినది కావడంవల్లనే ముస్లింలను అందులో చేర్చలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. బిల్లుపై బుధవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా హోంమంత్రి మాట్లాడారు. ప్రస్తుత చట్టాల్లో బాధితులైన ముస్లింలకు కూడా పౌరసత్వం కల్పించే ప్రొవిజన్ ఉందని, దాని ప్రకారం 566 మంది ముస్లింలకు భారత పౌరసత్వం లభించిందని షా చెప్పారు. గతంలో శ్రీలంక తమిళుల సమస్యలపై చట్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా షా గుర్తు చేశారు.
2019-12-11చంద్రబాబు సొంత కొడుకును గెలిపించుకోలేకపోయారన్న వైసీపీ నేతల వ్యంగ్యాస్త్రాలకు నారా లోకేష్ బుధవారం స్పందించారు. ‘‘నేను చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే రకం కాదు. నాన్న ఎక్కడ గెలిచారో అక్కడే గెలిచి కాలర్ ఎగరేసే బ్యాచ్ కాదు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలవలేదో..అక్కడే నిల్చొని గెలవాలనేది లక్ష్యం. 1985 తర్వాత మంగళగిరిలో టీడీపీ జెండా ఎప్పుడూ ఎగరలేదు. ఆ చరిత్రను తిరగరాయాలనే అక్కడికి వెళ్లాను. ఓడిపోయాను. అది టీడీపీ కంచుకోట కాదు.. పులివెందులా కాదు’’ అని లోకేష్ వ్యాఖ్యానించారు.
2019-12-11రాయలసీమకు ద్రోహం చేసింది రాజశేఖరరెడ్డేనని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను చేపట్టింది తెలుగుదేశం ప్రభుత్వాలేనని స్పష్టం చేశారు. రాజశేఖరరెడ్డి సిఎంగా ఉండగా...కృష్ణా మిగులు జలాలపై హక్కును వదులుకుంటున్నట్టు ట్రిబ్యునల్ కు తెలిపారని, ఈ విషయాన్ని అప్పుడే తాము అసెంబ్లీలో ఎండగట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల తర్వాత చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు.
2019-12-112009-14 కాంగ్రెస్ పాలనతో పోలిస్తే నరేంద్ర మోదీ పాలనలో ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ కు రైల్వే బడ్జెట్ భారీగా పెరిగింది. గుజరాత్ రైల్వే ప్రాజెక్టులకు 2009-14 కాలంలో సగటున రూ. 589 కోట్లు కేటాయించగా, 2014-19 కాలంలో సగటున ఏడాదికి రూ. 3,327 కోట్లు కేటాయించారు. ఆ ఐదేళ్లతో పోలిస్తే ఈ మొత్తం 565 శాతం. 2019-20లో కేటాయింపులు రూ. 4,803 కోట్లు. 2009-14 సగటుకి ఇది ఏకంగా 816 శాతం. మోదీ హయాంలో పశ్చిమ బెంగాల్ ప్రాజెక్టులకు సగటున రూ. 4,612 కోట్లు (105 శాతం) కేటాయించారు.
2019-12-11లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ సీట్లలో షెడ్యూల్డు కులాలు, తెగల సభ్యులకు రిజర్వేషన్లను మరో 10 సంవత్సరాలు పొడిగిస్తూ ప్రతిపాదించిన 126వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్ సభ మంగళవారం ఆమోదం తెలిపింది. రాజ్యాంగంలోని 334వ అధికరణంలో నిర్దేశించిన 70 సంవత్సరాల కాలపరిమితి వచ్చే నెలలో ముగుస్తుండటంతో, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రిజర్వేషన్ల బిల్లును ఆమోదించడం తప్పనిసరి అయింది. తాజా సవరణతో రిజర్వేషన్లు 2030 జనవరి 20వరకు కొనసాగుతాయి.
2019-12-10విభజిత రాష్ట్రాలు రెంటిలోనూ వెనుకబడిన జిల్లాలకు ఏడాదికి రూ. 50 కోట్ల చొప్పున నిధులు ఇస్తామని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సమయంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాజధానిని, దాంతో పాటే ఆదాయాన్ని కోల్పోయిన... అప్పుల్లో ఎక్కువ వాటాను మూటగట్టుకున్న బాధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలో 7 జిల్లాల అభివృద్ధికోసం ఏటా రూ. 350 కోట్ల చొప్పున మూడేళ్లు మాత్రమే కేంద్రం నిధులు విడుదల చేసింది. అదే సమయంలో తెలంగాణలో 9 జిల్లాలకు ఏటా రూ. 450 కోట్ల చొప్పున నాలుగేళ్లపాటు నిధులు ఇచ్చింది.
2019-12-10‘‘ఉల్లిపాయలు అధ్యక్షా.. నిత్యావసర వస్తువు కాదు’’ ఈ మాట ఎక్కడ వినిపించి ఉంటుందో ‘అధ్యక్షా’ అన్న సంబోధనను బట్టి అర్ధం చేసుకోవచ్చు. అన్నది ఎవరో కూడా కచ్చితంగా తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మంగళవారం సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పిన సత్యమిది. ఉల్లి ధరలపై చర్చ జరుగుతున్నప్పుడు కన్నబాబు ‘‘ఉల్లిపాయలు మనం తినే.. నిరంతరం వాడుకునే వస్తువే తప్ప నిత్యావసర వస్తువు కాదు’’ అని స్పష్టం చేశారు.
2019-12-10నవంబర్ మాసంలో ఆటోమొబైల్ అమ్మకాలు (టోకున) 12 శాతం పడిపోయాయి. పాసెంజర్ కార్లు, స్కూటర్లు, మోటార్ బైకుల సెగ్మెంట్లలో పతనం రేటు రెండంకెల్లో ఉంది. అయితే, కియా మోటార్స్ ‘సెల్టోస్’, మారుతి సుజుకి ‘విటారా బ్రెజ్జా’, ‘ఎర్టిగా’, హుండాయ్ మోటార్స్ ‘వెన్యూ’ వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు పెరిగాయి. తయారీదారుల సంఘం ‘సియామ్’ తాజా సమాచారం ప్రకారం ఈ నవంబరులో అన్ని కేటగిరిలలో కలిపి 17,92,415 వాహనాలు అమ్ముడయ్యాయి. 2018 నవంబరులో 20,38,007 వాహనాలు అమ్ముడయ్యాయి.
2019-12-10చిలీ దేశపు మిలిటరీ విమానం సి-130 హెర్క్యులస్ ఒకటి అదృశ్యమైంది. అందులో 17 మంది సిబ్బంది, 21 మంది ప్రయాణీకులు ఉన్నట్టు చిలీ ఎయిర్ ఫోర్స్ మంగళవారం వెల్లడించింది. ప్రయాణీకులలో ముగ్గురు సాధారణ పౌరులు. దేశ దక్షిణ భాగంలోని పుంటా అరేనాస్ నగరం నుంచి అంటార్కిటికాలోని స్థావరానికి వెళ్లడానికి సోమవారం సాయంత్రం విమానం టేకాఫ్ అయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే రేడియో సంకేతాలు తెగిపోయాయి.
2019-12-10 Read More