గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జి.హెచ్.ఎం.సి) ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 150 సీట్లున్న కార్పొరేషన్లో ఏ పార్టీ మెజారిటీకి దగ్గరగా రాలేకపోయింది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం టిఆర్ఎస్ కు 56 సీట్లు, బిజెపికి 46, ఎంఐఎంకు 43 సీట్లు దక్కాయి. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఘోరంగా 2 సీట్లకు పరిమితమైంది. 2016 ఎన్నికల్లో 99 సీట్లు సాధించిన టిఆర్ఎస్ బాగా దెబ్బ తిన్నట్టు స్పష్టమవుతోంది. మతపరమైన హై ఓల్టేజ్ ప్రచారంతో బిజెపి 4 సీట్ల నుంచి ఏకంగా 46కు పెరిగింది.

2020-12-04

‘‘చైనా ఎదిగింది. తన గురించి ప్రపంచం ఏమనుకుంటుందో పట్టించుకోదు. లక్ష్యం దిశగా వెళ్తోంది’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ‘‘ప్రాపంచిక దృక్పథంలో భారతదేశ పాత్ర’’ అనే అంశంపై ఆదివారం జరిగిన సదస్సులో భగవత్ మాట్లాడిన విషయాలు ఆలస్యంగా రిపోర్టయ్యాయి. తన సిద్ధాంతం సోషలిజమని, విస్తరణ వాదం కాదని చైనా చెబుతున్నా.. అది గత కాలపు చక్రవర్తుల విస్తరణ ఆదర్శాలను పుణికిపుచ్చుకున్నదని భగవత్ అభిప్రాయపడ్డారు. అమెరికా ఎంత ప్రయత్నిస్తున్నా, బహుళ పక్ష ప్రపంచం ఆవిర్భవించిందని పేర్కొన్నారు.

2020-12-03

ఆత్మహత్య చేసుకునే రైతులు పిరికివాళ్లని కర్నాటక వ్యవసాయ శాఖ మంత్రి బిసి పాటిల్ వ్యాఖ్యానించారు. గురువారం కొడగు జిల్లా పొన్నంపేటలో రైతులను ఉద్ధేశించి మాట్లాడుతూ, ‘‘ఆత్మహత్య చేసుకునే రైతులు పిరికివారు. కేవలం ఒక పిరికివాడు మాత్రమే తన భార్య, పిల్లలను సంరక్షించలేక ఆత్మహత్య చేసుకుంటాడు. మనం (నీళ్లలో) పడిపోతే, ఈదాలి.. గెలవాలి’’ అని పాటిల్ ఉద్ఘాటించారు. వ్యవసాయ వ్యాపారం ఎంత లాభదాయకమో వెదురు రైతులకు వివరించిన మంత్రి, కొంతమంది ఇది అర్ధం చేసుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.

2020-12-03

‘‘తమిళనాడు రాతను మార్చే సమయం వచ్చింది. రాజకీయ మార్పు అనివార్యం. ఇప్పుడు అత్యంత అవసరం కూడా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ రాదు’’- తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ డైలాగ్ ఇది. గురువారం చెన్నైలోని పోయస్ గార్డెన్ నివాసంలో ఆయన తన రాజకీయ రంగప్రవేశంపై ఓ ప్రకటన చేశారు. పార్టీ పని ఇప్పటికే ప్రారంభమైందనన్న రజినీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ‘‘నా జీవితాన్ని తమిళ ప్రజలకు అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.. నేను రాజకీయాల్లోకి వచ్చాక గెలిచినా ఓడినా అదంతా ప్రజలకే చెందుతుంది.’’ అని ఉద్ఘాటించారు.

2020-12-03

డిసెంబర్ 31న పార్టీని ప్రకటించి, జనవరిలో ప్రారంభించనున్నట్టు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురువారం వెల్లడించారు. ఈ ప్రకటనతో సంవత్సరాల గుంజాటనకు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టినట్టే. తన రాజకీయ రంగ ప్రవేశంపై 2017 నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటన చేసిన రజినీకాంత్, అప్పటి నుంచి ముందుకీ వెనక్కీ ఊగిసలాడుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించారు. ఇప్పుడు సరిగ్గా 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని ప్రకటించబోతున్నారు.

2020-12-03

రెండోసారి అధికారంలో కొనసాగలేకపోతే 2024లో మళ్ళీ వస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మంగళవారం (అమెరికా కాలమానం) స్వేతసౌధంలో నిర్వహించిన క్రిస్మస్ పార్టీలో అతిధులను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్ ‘‘ఈ నాలుగు సంవత్సరాలు అద్భుతమైన కాలం. మేము మరో నాలుగు సంవత్సరాలు పనిచేయడానికి ప్రయత్నిస్తున్నాం. కుదరకపోతే, మరో నాలుగు సంవత్సరాలలో మిమ్మల్ని చూస్తాను’’ అని చెప్పారు. ఎన్నికల్లో ఓడినా దిగిపోవడానికి ససేమిరా అంటున్న ట్రంప్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

2020-12-02

ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న భారత రైతుల శాంతియుత ఉద్యమానికి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ సంఘీభావం తెలిపారు. రైతు ఉద్యమ సందర్భంగా నెలకొన్న పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నిరసనపై ఇండియా నుంచి వస్తున్న వార్తలను గుర్తించకపోతే తాను నిర్లక్ష్యంగా ఉన్నట్టేనని ట్రూడూ వ్యాఖ్యానించారు. గురునానక్ 551వ జయంతి సందర్భంగా కెనడా భారతీయులను ఉద్దేశించి జస్టిన్ ఒక వీడియోను విడుదల చేశారు. శాంతియుత ప్రదర్శనకారుల హక్కుల పరిరక్షణ కోసం కెనడా నిలబడుతుందని ఆయన ఉద్ఘాటించారు.

2020-12-01

పంటల బీమా ప్రీమియం చెల్లించలేదంటూ నిన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు విరుచుకుపడిన నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం హడావుడిగా నిధులు విడుదల జీవోను జారీ చేసింది. రైతుల వాటా ప్రీమియంలో ఇచ్చే సబ్సిడీతో కలిపి రూ. 590 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (జీవో ఆర్.టి. నెం. 820) సోమవారం అర్ధరాత్రి దాటాక జారీ అయింది. బీమాపై చర్చ సందర్భంగా నిన్న చంద్రబాబు స్పీకర్ పోడియం ఎదుట బైఠాయించి సభ నుంచి సస్పెండ్ అయ్యారు. జగన్ ఒక ఫేక్ సిఎం అని, ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

2020-12-01

రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ డైలాగులతో, గత కొద్ది సంవత్సరాలుగా పార్టీ సన్నాహక సమావేశాలతో ఊరిస్తున్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఇంకా ముహూర్తం కుదరలేదు. సోమవారం తన ‘మక్కళ్ మండ్రం’ జిల్లా కార్యదర్శులతో సమావేశం సందర్భంగానైనా ఏదో ఒకటి చెబుతారని ఆశించినవారికి నిరాశే ఎదురైంది. రాజకీయ ప్రవేశంపై నిర్ణయం వీలైనంత త్వరగా చెబుతానంటూ మరోసారి వాయిదా వేశారు. కాగా, జనవరిలో పార్టీ ప్రకటన చేయాలనుకుంటున్నట్టు సమావేశానికి వచ్చినవారితో రజినీ కాంత్ చెప్పారని ప్రచారం జరుగుతోంది.

2020-11-30

పోలవరం విషయంలో కేంద్రం అన్యాయం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడగడం లేదని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. అన్యాయం జరుగుతుంటే అడగకపోతే ఇక ప్రభుత్వం ఎందుకు? అని ఆయన సిఎం జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. ‘‘టీడీపీ చెబుతున్నట్టుగా సీబీఐ కేసులకు దీనికీ ఏమైనా లింకు ఉందా? ఆ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు?’’ అని ఆయన ప్రశ్నించారు. పోలవరానికి ఇకపై ఇచ్చేది ఏడు వేల కోట్లేనని రాష్ట్రానికి అవమానకరమైన రీతిలో కేంద్రం లేఖ రాసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

2020-11-28
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page