కొత్త వ్యవసాయ చట్టాలు అమలైతే కనీస మద్ధతు ధర (ఎం.ఎస్.పి) రద్దవుతుందన్న మాట కంటే పెద్ద అబద్ధం మరేదీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కొత్త చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతు మహోద్యమం జరుగుతున్న నేపథ్యంలో.. తమ విధానాలను మోదీ మరోసారి సమర్ధించుకున్నారు. ఈ చట్టాలు రాత్రికి రాత్రే రాలేదని, 20-30 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణలపై సవివరంగా చర్చించాకే చట్టాలు తెచ్చామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జరుగుతున్న ఆందోళన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని మరోసారి ఆరోపించారు.

2020-12-18

పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న రాజస్థాన్ అధికార కాంగ్రెస్, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంజుకుంది. పన్నెండు జిల్లాల్లోని 50 పట్టణాల్లో 1,775 వార్డులకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 619, బిజెపి 548 గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్ధుల (596) కంటే బిజెపికి తక్కువ వార్డులు వచ్చాయి. ఇటీవల పంచాయతీరాజ్ ఎన్నికల్లో 12 జిల్లా ప్రముఖ్ స్థానాలను బిజెపి గెలవగా, కాంగ్రెస్ 5కి పరిమితమైంది. తాజా ఫలితాల తర్వాత మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్, బిజెపి పట్టణ ఓటర్లకు దూరమవుతోందని విశ్లేషించారు.

2020-12-14

కరోనా మహమ్మారి కారణంగా జీవనోపాధి కోల్పోయి సంగం భారత దేశం ఆకలితో అలమటిస్తున్న తరుణంలో రూ. 1000 కోట్ల ఖర్చుతో నూతన పార్లమెంటు భవనం నిర్మించడం అవసరమా? ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వేసిన ప్రశ్న ఇది. చైనా మహాకుడ్యాన్ని నిర్మించడానికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని, అయితే చైనా పాలకులు మాత్రం ప్రజలను కాపాడటానికే ఆ గోడను నిర్మించినట్టు చెప్పారని కమల్ వ్యాఖ్యానించారు.

2020-12-13

ఎల్.ఎ.సి. వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు పూర్తి బాధ్యత ఇండియాదేనని చైనా గురువారం వ్యాఖ్యానించింది. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించి చైనా భారీగా సేనలను మోహరించిందని నిన్న భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఆరోపించిన నేపథ్యంలో, ఈ రోజు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ స్పందించారు. రెండు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందాలను చైనా కచ్చితంగా ఆచరిస్తోందని, ప్రాంతీయ శాంతి- సుస్థిరతలను కాపాడటానికి.. సరిహద్దు సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్న విధానానికి కట్టుబడి ఉన్నామని ఆమె చెప్పారు.

2020-12-10

బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వాహన శ్రేణిపై దాడి ఘటనలో నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ గవర్నరు జగదీప్ ధంఖర్ ను కోరారు. దాడిని ‘‘ప్రాయోజిత హింస’’గా అమిత్ షా అభివర్ణించారు. దాడి తృణమూల్ పనేనని బిజెపి ఆరోపించగా, అది బిజెపి ‘‘ఉద్దేశపూర్వక కవ్వింపు’’ అని తృణమూల్ ఎదురుదాడికి దిగింది. బెంగాల్ లో ఈ గూండా రాజ్యం అంతం కావాలని నడ్డా వ్యాఖ్యానించగా.. ఇదంతా నాటకమని, హిట్లర్ కూడా ఇలాగే ఎదిగాడని బెంగాల్ సిఎం మమతా బెనర్జీ మండిపడ్డారు.

2020-12-10

బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా వాహన శ్రేణిపై కోల్‌కతాకు దగ్గర్లో కొందరు దుండగులు ఇటుకలు, రాళ్ళతో దాడి చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఉన్నందువల్ల నడ్డాకు ఏమీ కాలేదు. మరో వాహనంలోని పార్టీ నేతలు గాయపడినట్టు ఆయన చెప్పారు. వారంతా గురువారం మధ్యాహ్నం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బరుకు వెళ్తూ తృణముల్ నేతల నిరసన కార్యక్రమం మధ్య నుంచి ప్రయాణించారు. ఆసమయంలోనే కొందరు కాన్వాయ్ వెంటపడ్డారు. డైమండ్ హార్బర్ లోక్ సభ నియోజకవర్గానికి సిఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2020-12-10

కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఉద్యమించిన రైతుల వెనుక చైనా, పాకిస్తాన్ ఉన్నాయని కేంద్ర మంత్రి రావ్ సాహెబ్ దన్వే ఆరోపించారు. రైతుల ఆందోళన విదేశాల కుట్ర అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి)లపై ముస్లింలను తప్పుదారి పట్టించారని, ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు కొత్త చట్టాలతో నష్టం అంటూ రైతులకు చెబుతున్నారని మంత్రి ఆరోపించారు. కేంద్ర మంత్రి మాటలపై శివసేన మండిపడింది. బిజెపి నేతలు స్పృహలో లేరని వ్యాఖ్యానించింది.

2020-12-10

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కేంద్ర ప్రభుత్వం పరిధిలో పని చేసే ఢిల్లీ పోలీసులు ‘దాదాపు హౌస్ అరెస్టు’ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. సిఎం నివాసానికి ర్యాలీగా వెళ్లి ఆయనను విడిపించుకుంటామని ప్రకటించింది. కేజ్రీవాల్ మంగళవారం సింగు సరిహద్దులో కేంద్రానికి నిరసన తెలుపుతున్న రైతులను కలసి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పోలీసులు సిఎం నివాసం చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారని, పార్టీ ఎమ్మెల్యేలు కలవడానికి వెళ్తే కొట్టారని ‘ఆప్’ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు.

2020-12-08

ఇండియాలో మూడు టీకాలు వివిధ ప్రయోగ దశలలో ఉన్నాయని, ఒక టీకా మరికొద్ది వారాల్లో సిద్ధమవుతుందని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కోవిడ్- టీకా సవాళ్ళపై శుక్రవారం మోదీ రాజకీయ పార్టీలతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. టీకా ధర నిర్ణయం, పంపిణీ అంశాలపై రాష్ట్రాలతో చర్చలు జరుగుతున్నాయని ప్రధాని చెప్పారు. ఈ సమావేశానికి వివిధ పార్టీల నుంచి 12 మంది నాయకులు హాజరయ్యారు. కేంద్ర రక్షణ, హోం, వైద్య శాఖల మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, హర్షవర్ధన్ సమావేశంలో ఉన్నారు.

2020-12-04

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమితో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. 150 డివిజన్లు ఉన్న జి.హెచ్.ఎం.సి.లో కాంగ్రెస్ రెంటిని మాత్రమే దక్కించుకొని అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది. అసెంబ్లీలో రెండో పెద్ద పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల మరింత బలహీనపడింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి విజయం సాధించగా, కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. భాగ్యనగరంలోనూ కాంగ్రెస్ స్థానాన్ని బిజెపి ఆక్రమిస్తున్నట్టు స్పష్టమవుతోంది.

2020-12-04
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page