తన అధికారానికి అడ్డు వస్తున్నారనుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా చంద్రబాబు వదిలిపెట్టడని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మామ ఎన్టీఆర్ ను అధికారంనుంచి దించేశాక చంపేశారని, ఇప్పుడు ఆయన ఫొటోకే దండలు వేస్తున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఎన్నికల సభలో మాట్లాడిన జగన్ ‘‘చంద్రబాబు అధికారానికి ఎవరైనా అడ్డు వస్తారని భావిస్తే ఆ వ్యక్తిని ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. వెన్నుపోటు పొడవగలడు.. చంపేయగలడు. ప్రతిపక్ష నాయకుడిని వదిలిపెట్టడు.. రేపు ప్రధానమంత్రినైనా వదిలిపెట్టడు. మా చిన్నాన్నను చంపించింది చంద్రబాబే’’ అని జగన్ ఆరోపించారు.

2019-03-20

ఒక్క అవకాశం ఇస్తే తన తండ్రి రాజశేఖరరెడ్డి కంటే గొప్పగా పరిపాలిస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు విన్నవించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలను నమ్మవద్దని సూచించారు. ఎన్నికలు రాకపోయి ఉంటే, జగన్ హామీ ఇవ్వకుంటే పెన్షన్ మొత్తం రూ. 2000కు పెరిగేదే కాదని జగన్ ఉద్ఘాటించారు. జగనన్నను సిఎంను చేసుకుందామని ప్రతి అవ్వా తాతకు చెప్పాలని కార్యకర్తలకు చెప్పారు. నెల్లూరు జిల్లా కావలిలో ఎన్నికల సభలో జగన్ మాట్లాడారు.

2019-03-20

హైదరాబాద్ నగరంలో ఆస్తులు ఉన్నవారిని బెదిరించి ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేయకుండా నిరోధిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఈరోజు ఉదయం కూడా ఒకరిద్దరు అభ్యర్ధులు పోటీ నుంచి తప్పుకుంటామన్నారని ఆయన చెప్పారు. ‘‘మా ఆస్తులు పోతాయి’’ అనే భయపడే పరిస్థితి వచ్చిందంటే.. మనం ఇప్పుడే కళ్లు తెరవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆంధ్రలో తోలుబొమ్మ ప్రభుత్వాన్ని కేసీఆర్ కోరుకుంటున్నారని విమర్శించారు. బుధవారం మధ్యాహ్నం ఏపీ పెన్షనర్ల సంఘం సభలో చంద్రబాబు మాట్లాడారు.

2019-03-20

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ మాజీ నేత నామ నాగేశ్వరరావు మంగళవారం పార్టీ పదవులకు రాజీనామా చేశారు. తెలంగాణలో పార్టీ మనుగడ ప్రశ్నార్ధకమైనందున తాను తప్పనిసరై ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన వివరణ ఇచ్చారు. నామ త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరతారని, ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామ 2009లో లోక్ సభకు ఎన్నికై 2014 వరకు పని చేశారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్ధిగా ఖమ్మం అసెంబ్లీ స్థానంనుంచి పోటీ చేసి ఓడిపోయారు.

2019-03-20

భారత దేశ తొలి లోక్ పాల్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోస్ నియమితులయ్యారు. ఆయనతో పాటు మరో 8 మంది సభ్యులతో లోక్ పాల్ కమిటీ ఏర్పాటైంది. జస్టిస్ పి.సి. ఘోస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2014 జనవరిలో లోక్ పాల్ చట్టం నోటిఫై కాగా.. ఐదేళ్ళ తర్వాత నియామకాలు జరగడం గమనార్హం. అవినీతి వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో 2013లో లోక్ పాల్ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులపై వచ్చే అవినీతి ఆరోపణలను సైతం లోక్ పాల్, రాష్ట్రాల స్థాయిలో లోకాయుక్తలు విచారించవచ్చు.

2019-03-20 Read More

భారతీయ జనతా పార్టీ నేత ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రిగా మంగళవారం తెల్లవారుజామున 2.00 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. మనోహర్ పారికర్ మరణం నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం సావంత్ ను తదుపరి సిఎంగా ఎంపిక చేసింది. షెడ్యూలు ప్రకారమైతే సావంత్ సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రమాణం చేయాలి. అయితే, మిత్రపక్షాలను ఒప్పించడంలో జాప్యంతో ప్రమాణ స్వీకారాన్ని రాత్రి 11.00 గంటలకు వాయిదా వేశారు. అప్పుడూ జరగలేదు. చివరికి మంగళవారం వేకువజామున 1.50 గంటలకు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేశారు.

2019-03-19 Read More

‘‘ఇంత కత్తికి అంత దర్యాప్తు చేశారు. కోడిగుడ్డుపైన ఈకలన్నా పీకారా’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రాన్ని వ్యంగ్యంగా ప్రశ్నించారు. సోమవారం గుంటూరు ఎన్నికల సభలో మాట్లాడిన చంద్రబాబు, ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు చేయాల్సిన ఎన్.ఐ.ఎ.ను, విశాఖ కోడికత్తి దాడి కేసుకోసం వినియోగించారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి ఢిల్లీలో ఉన్న కాపలాదారు (మోదీ) కాపాడతారనే.. జగన్మోహన్ రెడ్డి సీబీఐ విచారణ కోరుతున్నారని చంద్రబాబు విమర్శించారు. గుంటూరు ఎన్నికల సభలో చంద్రబాబు మాట్లాడారు.

2019-03-18

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరారు. శనివారం అర్ధరాత్రి దాటాక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తే సమావేశమైన లక్ష్మీనారాయణ, ఆదివారం ఉదయం లాంఛనంగా పార్టీలో చేరారు. లక్ష్మీనారాయణతోపాటు ఆయన తోడల్లుడు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ మాజీ ఉపకులపతి రాజగోపాల్ కూడా జనసేనలో చేరారు. 2014లో పార్టీ ఏర్పాటుకు కొద్ది రోజులు ముందే కలసి పని చేద్దామని లక్ష్మీనారాయణను తాను ఆహ్వానించానని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పారు.

2019-03-17

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం అర్ధరాత్రి దాటాక సమావేశమయ్యారు. కొంత కాలం క్రింత స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి ప్రవేశించారు. సొంత పార్టీ ఏర్పాటు చేసి పోటీ చేయాలని ప్రయత్నించిన ఆయన తర్వాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అధికార తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని ఇటీవల ఆయనపై ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ జనసేన అధినేతతో భేటీ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

2019-03-17

వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ ను కోరారు. పార్టీ సీనియర్లతో సహా శనివారం గవర్నర్ ను కలసిన జగన్, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ‘సిట్’తో న్యాయం జరగదని ఉద్ఘాటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన జగన్, హత్యలో చంద్రబాబు ప్రమేయం లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ‘వాళ్లే హత్య చేయిస్తారు. వాళ్ళే దొంగ దొంగ అంటారు’ అని జగన్ వ్యాఖ్యానించారు.

2019-03-17
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page