పార్లమెంటు పూర్తి బడ్జెట్ సమావేశాలు జూన్ 17 నుంచి జూలై 26వ తేదీవరకు జరిగే అవకాశం ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్ ను గత ఫిబ్రవరి 1వ తేదీన అప్పటి ఇన్ఛార్జి మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టగా... పూర్తి బడ్జెట్ ను జూలై 5న కొత్త ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారని సమాచారం. నరేంద్రమోదీ నాయకత్వంలో రెండో ప్రభుత్వం కొలువుదీరగానే శుక్రవారం తొలి కేబినెట్ సమావేశం జరిగింది. పార్లమెంటు సమావేశాల తేదీలపై ఈ సమావేశంలో చర్చించారు.

2019-05-31

కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే కీలక స్థానాల్లో గత ప్రభుత్వం నియమించిన అధికారుల తొలగింపు శరవేగంగా జరుగుతోంది. అందులో భాగంగా ప్రొటోకాల్ విభాగపు డైరెక్టర్ ఎం. అశోక్ బాబు డిప్యుటేషన్ ను కుదించి మాతృ విభాగమైన కేంద్ర రక్షణ శాఖకు తిప్పి పంపుతున్నారు. ఈమేరకు జీవో ఆర్.టి. నెంబర్ 1202ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అశోక్ బాబును డిప్యుటేషన్ పై రెండేళ్ళ కాలానికి 2015 మే 13న నియమించింది. తర్వాత మరో రెండేళ్ళు (2020 మే 12వరకు) డిప్యుటేషన్ పొడిగించారు.

2019-05-31

కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూన్ 8వ తేదీన సచివాలయానికి రానున్నారు. జగన్ ప్రవేశానికి 8వ తేదీ ఉదయం 8.39 గంటలకు ముహూర్తం ఖరారైంది. అప్పటిదాకా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచే ప్రభుత్వ కార్యకలాపాలను జగన్ సాగిస్తారు. శుక్రవారమే సమీక్షలకు శ్రీకారం చుట్టారు. జగన్ వెళ్లేలోగా సచివాలయానికి వాస్తుపరంగా మార్పులు చేయనున్నారు. సిఎం ఛాంబర్ ను కూడా తీర్చిదిద్దనున్నారు.

2019-05-31

నిన్న ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారమే సమీక్షలను ప్రారంభించారు. తొలి రోజున మధ్యాహ్న భోజన పథకంపై అక్షయపాత్ర ట్రస్ట్, ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శనివారం ఆర్థిక, ఆదాయార్జన శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. జూన్ 3న విద్యా, జలవనరుల శాఖలపైన సమీక్ష ఉంటుంది. 4వ తేదీన వ్యవసాయ, గృహనిర్మాణ విభాగాలను, 6వ తేదీన రాజధాని నిర్మాణంలో కీలకమైన సి.ఆర్.డి.ఎ.ని జగన్ సమీక్షిస్తారు.

2019-05-31

సామాజిక పింఛను మొత్తాన్ని రూ. 2000 నుంచి రూ. 2,250కు పెంచుతూ, పింఛనుకు అర్హత వయసును 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ప్రమాణ స్వీకార వేదికపైనుంచే పింఛను పెంపు ఫైలుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతకం చేయగా.. శుక్రవారం జీవో విడుదలైంది. పెంచిన పింఛను మొత్తం జూలై 1 నుంచి లబ్దిదారులకు అందుతుంది.

2019-05-31

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా ఉన్న సొలోమన్ ఆరోకియ రాజ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఇకపైన ఆయన సిఎంకు కార్యదర్శిగా వ్యవహరిస్తూనే పరిశ్రమల శాఖ కార్యదర్శి బాధ్యతలను అదనంగా నిర్వర్తిస్తారని ప్రభుత్వం గురువారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పాత సిఎంఒ అధికారులను బదిలీ చేశారు. గురువారమే ధనంజయరెడ్డిని సిఎం అదనపు కార్యదర్శిగా, కృష్ణమోహన్ రెడ్డిని ఒ.ఎస్.డి.గా నియమించారు.

2019-05-30

సిఎం కార్యాలయ అధికారులు, డీజీపీ మార్పు తర్వాత జగన్ ప్రభుత్వం కీలక శాఖల్లోనూ తొలిరోజే అధికారులను మారుస్తోంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా షంషేర్ సింగ్ రావత్ (ఎస్ఎస్ రావత్)ను నియమిస్తూ గురువారమే జీవో ఆర్.టి. నెం. 1181 జారీ అయింది. సామాజిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రావత్ ఆ బాధ్యతలను కూడా అదనంగా నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.

2019-05-30

ఎన్నికలకు ముందు ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఉధ్వాసనకు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కొత్త ప్రభుత్వం ఏసీబీ డైరెక్టర్ జనరల్ స్థానం నుంచి కూడా తప్పించింది. గురువారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఏబీ వెంకటేశ్వరరావును జిఎడికి రిపోర్టు చేయవలసిందిగా ఉత్తర్వులు (జీవో ఆర్.టి. నెం. 1182) జారీ అయ్యాయి. ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా ఉన్న కుమార్ విశ్వజిత్ కు ఏసీబీ (పూర్తి అదనపు) బాధ్యతలు అప్పగించారు.

2019-05-30

నిన్న 57 మంది మంత్రులతో సహా ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వారికి శాఖలను కేటాయించారు. ఇదివరకు ప్రభుత్వంలో నెంబర్ 2గా హోం శాఖ బాధ్యతలు నిర్వర్తించిన రాజ్ నాథ్ సింగ్ కు రక్షణ శాఖను అప్పగించారు. సుష్మాస్వరాజ్ కు ఈ మంత్రివర్గంలో చోటు ఇవ్వనందున గతంలో ఆమె నిర్వర్తించిన విదేశాంగ శాఖ బాధ్యతలను మాజీ అధికారి ఎస్. జయశంకర్ కు అప్పగించారు. (పూర్తి జాబితాకోసం ఎడమకు స్వైప్ చేయండి)

2019-05-31 Read More

కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా భావించే హోం, ఆర్థిక శాఖలను అమిత్ షా, నిర్మలా సీతారామన్ లకు కేటాయించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వీరిలో అమిత్ షా కొత్తగా కేంద్ర మంత్రివర్గంలో చేరగా.. నిర్మల కొంత కాలంగా రక్షణ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. బిజెపి అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా హోం మంత్రిత్వ శాఖను ఎంచుకోవడం వ్యూహాత్మకమే. కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ ఎజెండాకు కీలకమైన అంశాలు హోం శాఖ పరిధిలోకే వస్తాయి.

2019-05-31
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page