విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే ఉద్దేశించిన శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు హక్కుగా కేటాయించిన నీటిని వాడుకుంటుంటే, ఉత్పత్తిని ఆపాలని ఆంధ్రా ప్రభుత్వం కెఆర్ఎంబీకి ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమని సిఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అభిప్రాయపడింది. 51% ‘క్లీన్ ఎనర్జీ’ ఉత్పత్తి చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జరుగుతున్న జల విద్యుత్ ఉత్పాదనను ఇక ముందు కూడా కొనసాగించాలని సమావేశం తీర్మానించింది.
2021-07-03‘‘నీటి కేటాయింపులు, పర్యావరణ అనుమతులు లేకుండా... జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే వున్నప్పటికీ కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న చట్టవ్యతిరేక పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంలేదని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం తీర్మానించింది.’’ అని తెలంగాణ సిఎం కార్యాలయం శనివారం ప్రకటించింది. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి రాజీ లేని పోరాటం కొనసాగించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు.
2021-07-03కొత్తగా ట్రిబ్యునల్ కేటాయింపులు జరిపేదాకా కృష్ణా జలాల్లో చెరి సగం వాడుకోవాలనే వాదనను తెలంగాణ ప్రభుత్వం శనివారం ముందుకు తెచ్చింది. తెలుగు రాష్ట్రాలకు ఉన్న నికర జలాల కేటాయింపు 811 టిఎంసిలలో 405.5 టిఎంసిల చొప్పున రెండు రాష్ట్రాలు వినియోగించుకోవాలని కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తీర్మానించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఇప్పటివరకు అమలైన 66:34 నిష్ఫత్తిని ఈ సమావేశం తిరస్కరించింది.
2021-07-03ఉత్తరప్రదేశ్ జిల్లా పంచాయతీ ఛైర్మన్ ఎన్నికల్లో బిజెపి 75 సీట్లకు గాను 67 కైవసం చేసుకుంది. 22 సీట్లు ముందే ఏకగ్రీవం కాగా 21 బిజెపి పరమయ్యాయి. ఎన్నికలు జరిగిన 53 స్థానాల్లో బిజెపికి 46 దక్కాయి. సమాజ్ వాదీ పార్టీకి 6 ఛైర్మన్ సీట్లు దక్కాయి. అయితే, ఈ ఎన్నికల్లో బిజెపి బలప్రయోగానికి, కిడ్నాప్ లకు పాల్పడిందని ‘సమాజ్ వాదీ’ నేతలు ఆరోపించారు. ఫలితాల ప్రకటన తర్వాత అనేక కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. ఏకగ్రీవ స్థానాల్లో ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, సిఎం యోగి అడ్డా గోరఖ్ పూర్ ఉన్నాయి.
2021-07-03ఉత్తరాఖండ్ లో ఆదినుంచీ రాజకీయ అస్థిరత్వమే రాజ్యమేలుతోంది. 2000 సంవత్సరం నవంబరులో రాష్ట్రం ఏర్పడ్డాక, సగటున రెండేళ్ళకు ఒకరు చొప్పున సిఎంలు మారారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన ఎన్డీ తివారీ మాత్రమే విభజిత రాష్ట్రానికి ఐదేళ్లపాటు సిఎంగా పని చేశారు. మిగిలిన ఏ ఒక్కరూ ఐదేళ్ళ పదవీ కాలాన్ని పూర్తి చేయలేదు. ‘‘దేవభూమి’’లో ఎక్కువమంది అవినీతి ఆరోపణలు, పార్టీలో తిరుగుబాట్లతో పదవి కోల్పోయారు. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో ముగ్గురు పాలించగా, బిజెపి 11 ఏళ్ళ కాలంలో ఏడో వ్యక్తి తాజాగా సిఎం అయ్యారు.
2021-07-03ఉత్తరాఖండ్ లో 4 నెలల్లో మూడో సిఎంగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కాని తీరథ్ సింగ్ రావత్ (ఎంపీ) మోదీ-షా దన్నుతో మార్చి 10న సిఎంగా బాధ్యత చేపట్టారు. పుష్కరాల్లో కోవిడ్ వ్యాప్తి, టెస్టుల కుంభకోణం సహా అనేక వివాదాలు ఎదుర్కొన్నారు. అయితే, పదవి చేపట్టాక ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలన్న రాజ్యాంగ నిబంధన అమలయ్యే పరిస్థితి లేకనే రాజీనామా చేస్తున్నట్టు రావత్ చెప్పారు. మరో ఆర్నెల్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఒక్క స్థానానికి ఉప ఎన్నిక కుదరదని ఈసీ స్పష్టం చేసింది.
2021-07-03రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో విచారణ జరిపించాలన్న డిమాండ్ ను కాంగ్రెస్ పార్టీ పునరుద్ఘాటించింది. 36 విమానాల అమ్మకానికి 2016లో కుదిరిన ఒప్పందంలో అవినీతి చోటు చేసుకుందన్న అనుమానంతో ఫ్రాన్స్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం (పి.ఎన్.ఎఫ్) దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా మీడియాతో మాట్లాడారు. రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగిందన్న తమ నేత రాహుల్ గాంధీ వాదన రుజువైందని సూర్జేవాలా పేర్కొన్నారు.
2021-07-03చైనాను బెదిరించడానికి, ప్రభావితం చేయడానికి ప్రయత్నించే బయటి శక్తులు ‘‘గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్’’ను ఢీకొట్టినట్టేనని ఆ దేశ అధ్యక్షుడు జి జిన్ పింగ్ హెచ్చరించారు. చైనా కమ్యూనిస్టు పార్టీని స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా గురువారం బీజింగ్ లో జరిగిన భారీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చైనాను పూర్తి స్థాయిలో ఏకీకరించడానికి కట్టుబడి ఉన్నామని జిన్ పింగ్ ఉద్ఘాటించారు. ‘తైవాన్ స్వాతంత్రం’ దిశగా జరిగే ఏ ప్రయత్నాన్నైనా ఓడించడానికి దృఢమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
2021-07-01కృష్ణా జలాలపై ప్రస్తుతం జరుగుతున్నదంతా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కలసి సృష్టించిన కృత్రిమ వివాదమేనని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ మళ్ళీ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విభజన తేవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రా సోదరులు ఈ ఉచ్చులో పడవద్దని సూచించారు. కాంగ్రెస్ వైపు వస్తున్న శ్రేణులను షర్మిలవైపు మళ్ళించడానికే రాజశేఖరరెడ్డిని ధూషిస్తున్నారని ఆరోపించారు.
2021-07-01నీటి వాడకం విషయంలో ఇంకా పాత ఆటలు సాగవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హెచ్చరించారు. పాత పద్ధతిలో అరాచకాలు చేస్తామంటే చూస్తూ ఉండటానికి తెలంగాణ ఇప్పుడు అమాయకంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీశైలంలో జలవిద్యుత్ కోసం కె.ఆర్.ఎం.బి. ఆదేశాలకు విరుద్ధంగా నీటిని వాడడాన్ని ఏపీ కేబినెట్ ఖండించిన కొద్దిసేపటికే జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఒక రాష్ట్రమైంది... ఇక్కడ కేసీఆర్ ఉన్నాడనే విషయాన్ని మరచిపోయినట్టున్నారు’’ అని ఎద్దేవా చేశారు.
2021-06-30