తెలంగాణలో రైతులకు ఇస్తున్నంత సాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందా? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. శనివారం హైదరాబాదులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘‘అక్కడ రైతు భరోసా అని రూ. 12,500 ఇస్తున్నారు. ఇక్కడ ఐదెకరాల రైతుకు 50,000 ఇస్తున్నాం. ఇక్కడ కుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ. 5 లక్షలు ఇంటికొస్తున్నాయి. అక్కడ (ఏపీలో) వస్తుందా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇలా తెలంగాణలో 25 పథకాలున్నాయని, మరే రాష్ట్రంలోనూ లేవని ఉద్ఘాటించారు.
2019-11-02ఇసుక సంక్షోభంపై పవన్ కళ్యాణ్ శనివారం విశాఖలో తలపెట్టిన ‘లాంగ్ మార్చ్’ను రాష్ట్ర మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్ తప్పు పట్టారు. అది ‘రాంగ్ మార్చ్’ అని అనిల్ వ్యాఖ్యానించారు. మంగళగిరిలో నివాసం ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రకాశం బ్యారేజీ మీదుగా వెళ్లేప్పుడు ఓసారి నదిని చూస్తే ‘వరదలు ఉన్నప్పుడు ఇసుక ఎలా తీస్తారు’ అన్న ప్రశ్న తలెత్తేదని అనిల్ పేర్కొన్నారు. వరదల సమయంలో ఇసుక తీయడానికి ప్రయత్నిస్తే ప్రమాదాలు జరగవచ్చని, అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని కన్నబాబు ప్రశ్నించారు.
2019-11-02జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి బాగాలేదని, ప్రజలు అస్థిర పరిస్థితుల్లో జీవిస్తున్నారని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వ్యాఖ్యానించారు. ఇండియా పర్యటనకు వచ్చే సమయంలో తనతో ఉన్న పాత్రికేయులతో ఆమె మాట్లాడారు. శుక్రవారం సాయంత్రం ఇండియా ప్రధాని నరేంద్ర మోదీతో చర్చల సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తుతానని కూడా ఏంజెలా చెప్పారు. జమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని ఉపసంహరించి రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ప్రజలు ఆంక్షల మధ్య నివసిస్తున్న సంగతి తెలిసిందే.
2019-11-01ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయి భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని సీపీఎం సీనియర్ నేత ఎంఎ గఫూర్ మండిపడ్డారు. ఎన్ని కష్టాలున్నా ఎవరైనా బతకాలనుకుంటారన్న గఫూర్, 28 సంవత్సరాల యువకుడు ఏ కారణంతో ఆత్మహత్య చేసుకుంటాడని ప్రశ్నించారు. ‘‘మీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. ప్రభుత్వానికి అప్రదిష్ట వచ్చిందన్న కారణంతో మీలో ఒక్కరైనా ఆత్మహత్య చేసుకుంటారా? మేం 10 లక్షల పరిహారం ఇస్తాం’’ అని తీవ్రంగా ప్రశ్నించారు.
2019-10-31నవంబర్ 3వ తేదీన విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన ర్యాలీకి తెలుగుదేశం పార్టీ నేతలు హాజరు కానున్నారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారం స్వయంగా వెల్లడించారు. ఇసుక సంక్షోభంతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ర్యాలీకి హాజరు కావాలని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కూడా పవన్ కోరినా, ఆయన హాజరు కారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు.
2019-10-31ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఒ)లో అమెరికా దాఖలు చేసిన కేసులో ఇండియాకు ఓటమి ఎదురైంది. ఎగుమతులకు ఇండియా దేశీయంగా ఇస్తున్న ప్రోత్సాహకాలపై అమెరికా డబ్ల్యు.టి.ఒ.లో ఫిర్యాదు చేసింది. గురువారం డబ్ల్యు.టి.ఒ. వివాదాల పరిష్కార విభాగం దీనిపై తీర్పు చెప్పింది. ఇండియా ఇస్తున్న ప్రోత్సాహకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఈ ప్యానల్ స్పష్టం చేసింది. అయితే, దీనిపై భారతదేశం డబ్ల్యు.టి.ఒ. అప్పీలేట్ అధారిటీకి వెళ్లే అవకాశం ఉంది.
2019-10-31 Read Moreజమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగంగానే తాము చూస్తున్నట్టు పాకిస్తాన్ నేతలతో సౌదీ అరేబియా చెప్పిందని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ప్రధాని మోదీ సౌదీ పర్యటనలో ఆయనకు, ఆ దేశ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కు మధ్య జరిగిన చర్చల్లో ఈ అధికారి కూడా భాగస్వామి అని ‘ద ప్రింట్’ రాసింది. అయితే, ఆ అధికారి తన పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు. కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని రద్దు చేశాక ఇతర దేశాల మద్ధతుకోసం పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలపై కూడా మోదీ, సల్మాన్ మధ్య చర్చ జరిగినట్టు ఆ అధికారి తెలిపారు.
2019-10-31 Read Moreరాష్ట్రంలో ఇసుక కొరతతో ఆత్మహత్యలు జరగడం దారుణమని, వరద సహాయక చర్యల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి వైఎస్ (సుజనా) చౌదరి విమర్శించారు. బీజేపీ గాంధీ సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఇంకా ఎన్నికల మూడ్ నుంచి పరిపాలనా మోడ్ లోకి రాలేదని వ్యాఖ్యానించారు. బంధుప్రీతితో సొంత మనుషులకు ఏం చేసుకోవాలా? అనే ధోరణే తప్ప సమస్యల పరిష్కారంపై సిఎంకు దృష్టి లేదని సుజనా ఆరోపించారు.
2019-10-31ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులను కాలం చెల్లి చనిపోయారంటూ వైసీపీ నేతలు ఎగతాళి చేసి మాట్లాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆక్షేపించారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబ సభ్యులతో గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన రాష్ట్ర మంత్రులపై మండిపడ్డారు. ‘‘23 సంవత్సరాలు, 45 సంవత్సరాలకే కాలం చెల్లి పోయారా’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. పేదవాళ్ల జీవితాలను ఎగతాళి చేసేలా మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు.
2019-10-31జమ్మూ - కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని ఉపసంహరించి.. పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను కూడా తొలగించి.. రాష్ట్రాన్ని రెండుగా విభజించిన కేంద్ర ప్రభుత్వం, నేటి నుంచి నేరుగా పరిపాలన సాగించనుంది. అసెంబ్లీ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ - కాశ్మీర్, అసెంబ్లీ రహిత కేంద్ర పాలిత ప్రాంతంగా లడక్ నేటి నుంచి ఉనికిలోకి వచ్చాయి. కాశ్మీర్ అసెంబ్లీ ముందే రద్దయినా లోక్ సభతో పాటు ఎన్నికలు నిర్వహించకుండా వ్యూహాత్మకంగా ఎన్నికల తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేసి ఏకంగా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం వివాదాస్పదమైంది.
2019-10-31