ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించడం తప్పు అని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జార్జి వాకర్ బుష్ వ్యాఖ్యానించారు. జో బైడెన్ తాజా నిర్ణయాన్ని ఆక్షేపించిన బుష్, దీంతో ఆఫ్ఘన్ ప్రజలకు కష్టాలు తప్పవని అభిప్రాయపడ్డారు. పరిణామాలు ‘నమ్మశక్యం కానంత చెడ్డ’గా ఉంటాయని ఒక జర్మన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుష్ వ్యాఖ్యానించారు. 20 ఏళ్ళ క్రితం ఈ జూనియర్ బుష్ హయాంలోనే ఆప్ఘనిస్తాన్ పైన అమెరికా దండెత్తింది. రెండు దశాబ్దాల సుదీర్ఘ యుద్ధం తర్వాత దేశాన్ని మళ్ళీ తాలిబన్లకు అప్పగించినట్టుగా అమెరికా వెనుదిరిగింది.

2021-07-14

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకా గాంధీలను కలిశారు. ఢిల్లీ రాహుల్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపై చర్చించినట్టు సమాచారం. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పార్టీ నేత నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య దీర్ఘ కాలంగా కొనసాగుతున్న వైరానికి ముగింపు పలకడంపై కూడా వారు చర్చించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ సమావేశం నిర్ధిష్టంగా పంజాబ్ కు సంబంధించినది కాదని అందులో ఉన్న పార్టీ పంజాబ్ ఇన్జార్జి హరీశ్ రావత్ చెప్పారు.

2021-07-13

చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) సభ్యుడిని కావాలనుకుంటున్నట్టు హాంకాంగ్ యాక్షన్ చిత్రాల సూపర్ స్టార్ జాకీచాన్ ఇటీవల ఓ సినీ సింపోజియంలో చెప్పారు. ‘‘నేను సిపిసి గొప్పతనాన్ని వీక్షించగలుగుతున్నాను. ఏం చెబుతుందో అది చేసి చూపుతుంది’’ అని జాకీచాన్ ప్రశంసించారు. చైనా ఫిల్మ్ అసోసియేషన్ వైస్ ఛైర్మన్ కూడా అయిన చాకీచాన్ మాటకు ప్రాధాన్యత ఏర్పడింది. హాంకాంగ్ ఎలైట్ లో సిపిసి పట్ల మారుతున్న వైఖరికి ఇది నిదర్శనమని కొందరు విశ్లేషిస్తున్నారు.

2021-07-11

ఆస్ట్రేలియా ఇంటా బయటా తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు, యుద్ధ నేరాలకు పాల్పడిందని చైనా మండిపడింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 47వ సదస్సు సందర్భంగా చైనా దౌత్యవేత్త జియాంగ్ దువాన్ మాట్లాడారు. విదేశాల్లో మిలిటరీ ఆపరేషన్ల సందర్భంగా ఆస్ట్రేలియా సైనికులు అమాయకులను చంపారని, దేశంలోపల ఆఫ్రికన్లు, ఆసియన్లు, మైనారిటీలు, మూలవాసుల పైన సుదీర్ఘ వ్యవస్థీకృత జాతి వివక్ష పాటిస్తున్నారని, ఆఫ్ షోర్ డిటెన్షన్ సెంటర్లలో శరణార్ధులను సుదీర్ఘ కాలం నిర్భంధిస్తున్నారని వివరించారు.

2021-07-09

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ప్రమోషన్ వచ్చింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బుధవారం ఆయన కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కూడా ఇదే రోజు ప్రమాణం చేయడం యాధృచ్ఛికమే. అయితే కిషన్ రెడ్డికి ప్రమోషన్ ఇవ్వడంలో మాత్రం రేవంత్ ఫ్యాక్టర్ పని చేసినట్టు భావిస్తున్నారు. తెలంగాణలో బలీయంగా ఉన్న రెడ్లను కాంగ్రెస్ వైపు సమీకరించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్న తరుణంలో, కిషన్ రెడ్డికి ఊహించినదానికంటే ఎక్కువ ప్రాధాన్యత దక్కింది.

2021-07-07

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్వాసనకు గురైన 12 మంది బుధవారం రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు వారి రాజీనామాలను ఆమోదించినట్టు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రకటించారు. సీనియర్ మంత్రులు డివి సదానందగౌడ, రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్, హర్షవర్థన్, రమేష్ పోఖ్రియాల్ లతో పాటు సంతోష్ కుమార్ గంగ్వార్, బాబుల్ సుప్రియో, ప్రతాప్ చంద్ర సారంగి తదితరులు ఉన్నారు. థావర్ చంద్ గెహ్లాట్ ను నిన్ననే కర్నాటక గవర్నరుగా నియమించగా, మిగిలినవారి భవిష్యత్ ఏమిటన్నది తేలాల్సి ఉంది.

2021-07-07

భారత ఎన్నికల కమిషన్ (సీఈసీ)పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కమిషన్ సాయం చేయకపోతే బిజెపి సీట్లు 30కి మించేవి కావని మమత వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ ‘‘నేను పోటీ చేసిన చోట చూశాను. ప్రజలను ఓటు వేయవద్దని భయపెట్టారు’’ అని మమత ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 77 సీట్లు గెలుచుకుంది. ఎన్నికల సమయంలోనూ, తర్వాత ఈసీ పాత్రపై మమత ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

2021-07-06

రాష్ట్ర బిజెపి సీనియర్ నేత, విశాఖపట్నం మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబును మిజోరాం గవర్నరుగా నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురు గవర్నర్లను ప్రస్తుతం ఉన్నచోట నుంచి బదిలీ చేసిన కేంద్రం, కొత్తగా నలుగురిని గవర్నర్లుగా నియమించింది. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లోట్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించి కర్నాటక గవర్నరుగా పంపారు. బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానాకు బదిలీ చేశారు.

2021-07-06

ప్రధాని మోదీ రెండో టర్మ్ లో మొదటిసారిగా మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు ప్రకటన ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విస్తరణ తర్వాత మంత్రివర్గపు సగటు వయసు తగ్గిపోతుందని, చరిత్రలో ఇదే అత్యంత యువ కేబినెట్ అవుతుందని చెబుతున్నారు. పి.హెచ్.డి.లు, ఎంబిఎల వంటి ప్రొఫెషనల్స్ వస్తారని, మొత్తంగా బీసీలు రెండు డజన్లు అవుతారని సమాచారం. కేంద్ర మంత్రివర్గంలో 81 మందికి అవకాశం ఉండగా ఇప్పుడు 53 మంది మాత్రమే ఉన్నారు.

2021-07-06

బౌద్ధ మత గురువు దలైలామా 86వ పుట్టిన రోజు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దలైలామాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్టు మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. 1959లో ఇండియాకు పారిపోయి వచ్చిన దలైలామా బృందానికి భారత ప్రభుత్వం ఆశ్రయమిచ్చింది. ఆ బృందం ఇండియా నుంచే టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఇండియా, చైనా సంబంధాలను ప్రభావితం చేసిన ప్రధానాంశాల్లో ఇదొకటి.

2021-07-06
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page