‘కరోనా వైరస్’ భయానకమేమీ కాదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ కారణంగా ఎన్నికలు వాయిదా వేయడం అన్నది ఒక సాకు మాత్రమేనని ఆయన ఆక్షేపించారు. 60 ఏళ్ల పైగా వయసు ఉన్నవారు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారిపైనే ‘కరోనా’ ప్రభావం ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకిన కేసుల్లో 81.9 శాతం మందికి ఇంట్లోనే చికిత్స చేస్తున్నారని, 13 శాతం మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 4.7 శాతం కేసులను మాత్రమే ఐసియులో పెట్టారని జగన్ చెప్పారు.
2020-03-15స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల తర్వాత యధాతథంగా కొనసాగిస్తామన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటనపై మిశ్రమ స్పందన వెలువడింది. వాయిదా చాలదని... నామినేషన్ల ప్రక్రియను మళ్లీ చేపట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వాయిదాను స్వాగతిస్తూనే... మొత్తం ప్రక్రియను మళ్లీ చేపట్టాలని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు కోరారు. అధికార వైసీపీ దౌర్జన్యాలతో ప్రతిపక్షాల నామినేషన్లను అడ్డుకుందని, ఇప్పటిదాకా జరిగిన ప్రక్రియ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా లేదని పవన్ పేర్కొన్నారు. పోలీసులే బెదిరించి నామినేషన్లను ఉపసంహరింపజేశారని విమర్శించారు.
2020-03-15రాష్ట్రంలో పోలీసు ఉగ్రవాదం పెరిగిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోలీసులే ప్రతిపక్షాల నేతలను బెదిరిస్తున్నారని, బైండోవర్ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఖాకీ డ్రెస్ వేసుకొని ఇలాంటి తప్పుడు పనులు చేయడం నీచమని చంద్రబాబు డీజీపీపై విరుచుకుపడ్డారు. ‘‘నామినేషన్లతో మీకేం సంబంధం’’ అని ప్రశ్నించారు. పోలీసుల తీరు ఇలాగే ఉంటే ప్రజలు తిరగబడతారని, వారి ముఖాన ఉమ్మేసే పరిస్థితి వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
2020-03-14మధ్యప్రదేశ్ మంత్రివర్గం నుంచి నిన్న ఉధ్వాసనకు గురైన ఆరుగురు (మాజీ) మంత్రుల ఎమ్మెల్యే పదవులూ ఊడిపోయాయి. వారు శాసనసభ్యత్వానికి చేసిన రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి శనివారం ఆమోదించారు. జ్యోతిరాదిత్య సింధియాకు మద్ధతుగా శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేలలో ఈ ఆరుగురు ఉన్నారు. ఆ రాజీనామాలతో కమలనాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అయితే, శుక్రవారం ముఖ్యమంత్రి కమలనాథ్ సూచన మేరకు ఆయా మంత్రులను గవర్నర్ లాల్జీ టాండన్ తొలగించారు. మిగిలిన ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలు సాగుతున్నాయి.
2020-03-14ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఈ రోజుకు ఏడాది అయిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య గుర్తు చేశారు. ముఖ్యమంత్రికి, వివేకా కుటుంబ సభ్యులకు గుర్తు చేస్తున్నానంటూ... ‘‘ఈ ఏడాదిలో మీ ప్రభుత్వం ఏం సాధించింది?’’ అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించింది. ఒక రాష్ట్ర డీజీపీ కోర్టు ముందు ఐదున్నర గంటల పాటు నిలబడే పరిస్థితిని సిఎం కల్పించారని వర్ల ఆరోపించారు. ఈ దుస్థితి దేశంలో మరే డీజీపీకీ రాలేదని వ్యాఖ్యానించారు.
2020-03-14‘కరోనా వైరస్’పై పోరాటానికి ‘సార్క్’ దేశాలు బలమైన వ్యూహన్ని రూపొందించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఇందుకోసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరుపుదామని ప్రతిపాదించారు. పెద్ద మొత్తంలో జనాభా ఉన్న దక్షిణాసియాలో ప్రజారోగ్యానికి భరోసా ఇచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ వదలకూడదని మోడీ శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘సార్క్’ దేశాలు ఉమ్మడిగా ప్రపంచానికి ఓ ఉదాహరణగా నిలవాలని, ఆరోగ్యకరమైన భూగోళానికి దోహదం చేయాలని మోడీ అభిప్రాయపడ్డారు.
2020-03-13ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్ప కూలుస్తున్న ‘కరోనా’ కంటే ప్రమాదకరమైన జగన్ వైరస్ రాష్ట్రానికి పట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ నామినేషన్లు కూడా వేసే పరిస్థితి లేదని, ఆడబిడ్డలకు రక్షణ లేదని, నేరాలు - ఘోరాలను వ్యవస్థీకృతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతల దౌర్జన్యాలను వివరిస్తూ శుక్రవారం సాయంత్రం చంద్రబాబు పలు వీడియోలను ప్రదర్శించారు. ఎక్కువ దౌర్జన్యాలు చేసేవారే సిఎంకు దగ్గరివారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
2020-03-13అధికార పార్టీ వాళ్లే మందు సీసాలు టీడీపీ అభ్యర్ధుల ఇళ్ళలో పెట్టి జైళ్లకు పంపాలని కుట్ర చేశారని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తెనాలి 4వ వార్డు టీడీపీ అభ్యర్ధి అడుసుమల్లి వెంకటేశ్వరరావు ఇంట్లో రాత్రి 12.46 గంటలకు ఓ ముసుగు వ్యక్తి గోడ దూకి వచ్చి మద్యం కేసును పెట్టిన వీడియోను చంద్రబాబు శుక్రవారం సాయంత్రం మీడియా ఎదుట ప్రదర్శించారు. మద్యం పట్టుబడితే జైలు శిక్ష, జరిమానా అంటూ ఓ నల్ల చట్టాన్ని ఇందుకే తెచ్చారని చంద్రబాబు విమర్శించారు. సీసీ టీవీ ఉంది కాబట్టి ఈ దుర్మార్గం రికార్డయిందని, వీళ్లకోసం గ్రామాల్లో కూడా సీసీ టీవీలు పెట్టుకోవలసి వస్తోందని వ్యాఖ్యానించారు.
2020-03-13జమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని ఉపసంహరించాక గృహ నిర్బంధానికి గురైన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా (83) శుక్రవారం విడుదలయ్యారు. లోక్ సభ సభ్యుడైన ఫరూక్ అబ్దుల్లాను పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద సుమారు 7 నెలల 10 రోజులు నిర్బంధంలో ఉంచారు. ఆయనతోపాటు ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, పిడిపి నేత మెహబూబా ముఫ్తీలు కూడా గత ఆగస్టు 5 నుంచి నిర్బంధంలో ఉన్నారు. ‘‘ఈ రోజు నాకు స్వేచ్ఛ వచ్చింది. అయితే, మిగిలిన నాయకులు విడుదలయ్యేదాకా పూర్తి స్వాతంత్రం వచ్చినట్టు కాదు’’ అని ఫరూక్ వ్యాఖ్యానించారు.
2020-03-13 Read Moreమరో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాను నిలబెట్టుకునేలా లేరని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీ మారితే రాజీనామా చేయాలన్న జగన్మోహన్ రెడ్డి మాటలో ఎలాంటి మార్పూ లేదంటూ... కొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్ధతు ప్రకటిస్తున్నారని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆక్షేపించారు.
2020-03-13 Read More