దీపాలు వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును విమర్శించినవారు కుసంస్కారులు, దుర్మార్గులు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి పిలుపులు వంద ఇచ్చామని, జేగంటలు మోగిస్తే తెలంగాణ వస్తదా.. అని ప్రశ్నించారని, వాటి ద్వారానే తెలంగాణ వచ్చిందని చెప్పారు. ప్రధానమంత్రి ఓ వ్యక్తి కాదని, ఓ వ్యవస్థ అని, ఆయన పిలుపుపై వ్యాఖ్యానాలు చేయడం వెకిలితనమని సోమవారం విలేకరుల సమావేశంలో కేసీఆర్ విమర్శించారు.
2020-04-06ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు (70) ‘కరోనా క్వారంటైన్’లోకి వెళ్లనున్నట్టు తాజా వార్త. నెతన్యాహు సలహాదారుల్లో ఒకరికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ పరిణామం అనివార్యమైంది. ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. నెతన్యాహు సలహాదారు రివ్కా పలుచ్ కు ‘కరోనా పాజిటివ్’ తేలింది. దీంతో ప్రధాని కూడా ‘క్వారంటైన్’లోకి వెళ్తారని వచ్చిన వార్తలను తొలుత ఆయన కార్యాలయం ఖండించింది. కొద్ది గంటల వ్యవధిలోనే అందుకు భిన్నమైన ప్రకటన వెలువడింది. ప్రధాని, ఆయన సమీప సిబ్బంది కూడా పరీక్షల ఫలితాలు వచ్చేవరకు విడిగా ఉంటారని ప్రభుత్వం తెలిపింది.
2020-03-30కఠినమైన ఆంక్షలతో సామాన్యుల కష్టాలకు కారణమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి క్షమాపణ చెప్పారు. సరైన ప్రణాళిక లేకుండా దేశమంతా ‘లాక్ డౌన్’ ప్రకటించిన నేపథ్యంలో కోట్ల మంది ప్రజలు.. ముఖ్యంగా వలస కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉపాధి కోల్పోయి ఆకలి బాధతో వందల కిలోమీటర్లు నడిచి సొంత ప్రదేశాలకు వెళ్తున్నారు. ఈ స్థితిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆదివారం ‘మన్ కీ బాత్’లో ప్రధాని క్షమాపణ చెప్పవలసి వచ్చింది. ‘ఈయనేం ప్రధాని’ అని కొంతమంది అంటారని, మరో ప్రత్యామ్నాయం లేకనే ‘దిగ్బంధం’ విధించానని మోడీ చెప్పారు. ఇది జీవన్మరణ పోరాటమని మోడీ పేర్కొన్నారు.
2020-03-29మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం సాయంత్రం బిజెపి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చౌహాన్, అనంతరం రాజ్ భవన్ వేదికగా సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం శివరాజ్ సింగ్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం బల నిరూపణ తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. శివరాజ్ సింగ్ సిఎం పదవి చేపట్టడం ఇది నాలుగోసారి. ఆయన బిజెపి శాసనసభా పక్ష నేతగా ఎన్నిక కావడానికి వీలుగా.. ఇప్పటివరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన గోపాల్ భార్గవ ఆ పోస్టుకు రాజీనామా చేశారు.
2020-03-23సొంత పార్టీపై తిరుగుబాటు చేసి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన 21 మంది మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు శనివారం బీజేపీలో చేరారు. బిజెపి అధ్యక్షుడు జె.పి. నడ్డా సమక్షంలో వారంతా బీజేపీ కండువాలు కప్పుకున్నారు. మరో తాజా మాజీ ఎమ్మెల్యే తర్వాత చేరనున్నారు. సీనియర్ నేత కమలనాథ్ కు వ్యతిరేకంగా యువనేత జ్యోతిరాదిత్య సింధియా చేసిన తిరుగుబాటులో భాగంగా ఆరుగురు మంత్రులు, మరో 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. మెజారిటీ కోల్పోయిన కమలనాథ్ నిన్న (మార్చి 20న) సిఎం పదవికి రాజీనామా చేయగా.. ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి సన్నాహాలు చేస్తోంది.
2020-03-21మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్షకు ముందే సిఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత కమలనాథ్ ప్రకటించారు. 15 నెలలు పదవిలో ఉన్న కమలనాథ్, పార్టీ యువనేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో మెజారిటీ కోల్పోయారు. శుక్రవారం సాయంత్రం లోపు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని నిన్న సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. శుక్రవారం సి.ఎల్.పి. సమావేశం తర్వాత మీడియా సమావేశంలో కమలనాథ్ రాజీనామా ప్రకటన చేశారు.
2020-03-20ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పేరిట చెలామణిలో ఉన్న లేఖ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎస్ఇసి కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ బయటకు వచ్చాక.. వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కె. పార్ధసారథి, జోగి రమేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ లేఖ నిజమైనదో కాదో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీయడానికి కుట్ర చేస్తున్న చంద్రబాబుకు రమేష్ కుమార్ వత్తాసు పలుకుతున్నారనే భావన తమకు కలుగుతోందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
2020-03-18ఏపీలో ‘కరోనా వైరస్’ సోకినవారున్నారని, అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం దాచిపెడుతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నా.. ఈ ప్రభుత్వం కనీస జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. ఫ్రాన్స్ లో మున్సిపల్ ఎన్నికలు పెడితే ఒక్క రోజే 900 కేసులు పెరిగాయని, ఇప్పుడు యూరప్ దేశాల్లో ప్రజలను ఇళ్లలోనే నిర్భంధించి ఆర్మీతో కవాతులు నిర్వహిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ‘‘రాష్ట్రంలోనూ ఆ పరిస్థితి తేవాలనుకుంటున్నారా?’’ అని సిఎంను ప్రశ్నించారు. తమను బూతులు తిట్టడం మాని పని చేయాలని హితవు పలికారు.
2020-03-18ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ను తాను నియమించలేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను బిశ్వాల్ పేరు సిఫారసు చేస్తే.. అప్పటి గవర్నర్ నరసింహన్ రమేష్ కుమార్ పేరు సూచించారని చంద్రబాబు వెల్లడించారు. రమేష్ కుమార్ 7 సంవత్సరాలు గవర్నర్ దగ్గర పని చేశారని, అంత సుదీర్ఘంగా మరెవరూ పని చేయలేదనే కారణంతో నరసింహన్ సూచించారని, తనకు ఇష్టం లేకపోయినా ఆమోదించానని చంద్రబాబు చెప్పారు. అలాంటి నియామకానికి తనపై ఆరోపణలు చేసి రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారని సిఎంపై మండిపడ్డారు.
2020-03-15సిఎం అయితే సర్వాధికారాలు ఉంటాయా? అని జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘నీకు సర్వాధికారాలున్నాయా? ఎక్కడినుంచి వచ్చాయి? ముఖ్యమంత్రికి రాజ్యాంగమే అధికారాలు ఇచ్చింది. రాజ్యాంగానికి మించిన అధికారం నీకుందా? అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఇతర అధికారులను మార్చినప్పుడు నువ్వేమన్నావు.. ఇప్పుడేం మాట్లాడుతున్నావు?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘నీ ఎన్నిక కూడా ఎన్నికల కమిషనే నిర్వహించింది. 151 మంది ఎన్నికను ప్రకటించిందీ ఎన్నికల అధికారులే’’ అని చంద్రబాబు సిఎంకు గుర్తు చేశారు.
2020-03-15