ఏపీ ‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్’ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యసభ సభ్యుడు (బిజెపి) సుజనా చౌదరిని కలవడం రాజకీయ వివాదంగా మారింది. ఈ నెల 13న హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో సుజనా చౌదరి, రాష్ట్ర మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ లతో ‘రహస్య సమావేశం’ జరిపారంటూ నిమ్మగడ్డపై వీడియో అస్త్రాన్ని ప్రయోగించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హోటల్ సీసీ టీవీ ఫుటేజీని ఇందుకు సాక్ష్యంగా చూపింది. నిమ్మగడ్డ వెనుక చంద్రబాబు ఉన్నారన్న గత ఆరోపణలను పునరుద్ఘాటించింది. స్థానిక ఎన్నికలను వాయిదా వేయడంపై మండిపడ్డ జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డను తొలగించడం, ఆ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేయడం తెలిసిందే.

2020-06-23

2010, 2013 మధ్య 600సార్లు చైనా సైనికులు చొరబడ్డారంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై బిజెపి అధ్యక్షుడు జె.పి. నడ్డా చేసిన విమర్శకు కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కౌంటర్ ఇచ్చారు. ‘‘అవును, చొరబాట్లు చోటు చేసుకున్నాయి. అయితే, అప్పుడు భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదు. హింసాత్మక ఘర్షణల్లో సైనికులు ప్రాణాలు కోల్పోలేదు’’ అని చిదంబరం మంగళవారం ట్విట్టర్లో స్పష్టం చేశారు. ‘‘2015 నుంచి 2,264 సార్లు జరిగిన చైనా చొరబాట్లపై జెపి నడ్డా ప్రస్తుత ప్రధానిని అడుగుతారా? నేను పందెం వేస్తా.. ఆ ప్రశ్న అడగడానికి సాహసించరు’’ అని చిదంబరం వ్యంగ్యాస్త్రం విసిరారు.

2020-06-23

కిరిబాతి.. ఓ చిన్న ద్వీప దేశం. కానీ వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్ర‘దేశం’. పసిఫిక్ మహా సముద్రంలో పట్టు సంపాదించాలంటే ఇలాంటి దేశాల దన్ను కావాల్సిందే! తాజాగా కిరిబాతిలో జరిగిన ఎన్నికల్లో చైనా అనుకూల నేత, ప్రస్తుత అధ్యక్షుడు తనేటి మామౌ మళ్లీ ఎన్నికయ్యారు. ఈ పరిణామంతో ‘తైవాన్’ ఆశలు గల్లంతయ్యాయి. మామౌ ప్రత్యర్ధి గెలిస్తే కిరిబాతితో దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకోవచ్చని తైవాన్ ఆశించింది. చాలా కొద్ది దేశాలు.. అదీ చిన్న దేశాలు తైవాన్ ను స్వతంత్ర దేశంగా గుర్తించి దౌత్య సంబంధాలు నెరుపుతున్నాయి. కిరిబాతి గత ఏడాది సెప్టెంబరులో తైవాన్ తో సంబంధాలు తెంచుకొని చైనాతో కలసింది.

2020-06-23

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ట్వీట్లలో ఓటమి భాష ధ్వనిస్తోంది. 2020 ఎన్నికల్లో ఓ డెమోక్రాట్ గెలిస్తే.. అది ఆఫ్రికన్ అమెరికన్లకు విషాదకర ఓటమి అవుతుందని ట్రంప్ సోమవారం ఓ ట్వీట్ చేశారు. కొద్ది గంటల తర్వాత ఎన్నికల్లో రిగ్గింగ్ జరగబోతోందంటూ మరో ట్వీట్ పెట్టారు. మిలియన్లకొద్దీ మెయిల్-ఇన్ బ్యాలెట్లను విదేశాలు ముద్రించబోతున్నాయని, ఇది మన కాలపు కుంభకోణం కాబోతోందని పేర్కొన్నారు. దీనికి అమెరికన్లు స్పందించారు. ఓటమిని ఊహించి ముందే సాకును సిద్ధం చేసుకుంటున్నారని కొందరు వెటకారమాడితే.. 2016లో మెయిల్-ఇన్ బ్యాలెట్ల ద్వారానే ట్రంప్ గెలిచారని మరికొందరు గుర్తు చేశారు.

2020-06-23

మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 43,000 కిలోమీటర్ల విస్తీర్ణంలోని భారత భూభాగాన్ని నిస్సహాయంగా చైనాకు అప్పగించారని బిజెపి అధ్యక్షుడు జె.పి. నడ్డా ఆరోపించారు. తాజా చైనా ఆక్రమణ విషయంలో మన్మోహన్ ప్రధాని మోడీని విమర్శించినందుకు నడ్డా సోమవారం వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. 2010, 2013 మధ్య మన్మోహన్ హయాంలో 600సార్లు చైనా సైన్యం చొరబాట్లు చోటు చేసుకున్నాయని నడ్డా ఆరోపించారు. సైనిక దళాలను అవమానించేలా మాట్లాడుతున్నారంటూ మాజీ ప్రధానిపై నడ్డా ధ్వజమెత్తారు.

2020-06-22

ప్రధాని ఎల్లప్పుడూ తాను వాడే పదాల పర్యవసానాలను గుర్తెరిగి మాట్లాడాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనపై మన్మోహన్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గాల్వన్ లోయలోకి చొరబడి టెంట్లు వేసుకున్న చైనా సైనికులను ఖాళీ చేయించే ప్రయత్నంలో 20 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కర్నల్ సంతోష్ బాబు, ఇతర జవాన్లు చేసిన అసాధారణ త్యాగానికి తగినట్టుగా కేంద్రం స్పందించకపోతే ‘ప్రజల విశ్వాసానికి చారిత్రక ద్రోహం’ చేసినట్టేనని సింగ్ విమర్శించారు.

2020-06-22

మూడు నెలల తర్వాత ఎన్నికల ప్రచారాన్ని మళ్ళీ ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి ర్యాలీకి లక్ష మంది హాజరవుతారని శ్వేతసౌధం ఊదరగొట్టింది. అయితే, 19 వేల సీట్లు మాత్రమే ఉన్న తుల్సా బి.ఒ.కె. స్టేడియంలో సుమారు సగం సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. జనం రాని కారణంగా స్టేడియం వెలుపల జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేశారు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ నిరసనల భయంతో చాలా మంది రాలేదని, కొంతమందిని నిరసనకారులు అడ్డుకున్నారని ఈ ర్యాలీ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. ‘కరోనా’ వ్యాప్తి తర్వాత ట్రంప్ కు జనాదరణ తగ్గిందని సర్వేలు చెబుతున్నాయి.

2020-06-21

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలతో తనకు ప్రాణహాని ఉందని ఆ పార్టీకే చెందిన నర్సాపురం ఎం.పి. రఘురామకృష్ణంరాజు కేంద్రానికి నివేదించారు. ఈమేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాలకు లేఖలు రాశారు. ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై మాట్లాడేందుకు సిఎంను కలవాలని ప్రయత్నించినా సాధ్యపడలేదని, బహిరంగంగా మాట్లాడితే బెదిరింపులకు దిగారని వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తాను స్వేచ్ఛగా నియోజకవర్గంలో పర్యటించే అవకాశం లేనందున కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని విన్నవించారు.

2020-06-21

‘కరోనా’ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజధానిని విశాఖపట్నానికి తరలించే అంశంపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. జూలైలో ‘కరోనా’ వ్యాప్తి పతాక స్థాయికి చేరుతుందని అంచనాలు ఉన్నాయన్న మంత్రి, వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టాక తరలింపు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. రాజధానిని విశాఖకు తరలిస్తామని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న విషయాన్ని ఆయన ఆదివారం గుర్తు చేశారు.

2020-06-21

‘నరేంద్ర మోడీ నిజానికి సరెండర్ మోడీ’’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రం విసిరారు. గాల్వన్ లోయలో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిన తర్వాత.. ‘ఎవరూ చొరబడలేద’ని ప్రధాని ప్రకటించడంపై రాహుల్ గత మూడు రోజులుగా విరుచుకుపడుతున్నారు. ఇండియా- చైనా తాజా పరిణామాలపై ‘జపాన్ టైమ్స్’ వ్యాఖ్యానాన్ని రాహుల్ గాంధీ ఆదివారం ట్విట్టర్లో షేర్ చేశారు. 2014 నుంచీ మోడీ చైనాను బుజ్జగించే విధానాలను అవలంభించారని జపాన్ టైమ్స్ సోదాహరణంగా విమర్శించింది.

2020-06-21
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page