టీడీపీతో కలసి ‘ఢిల్లీని తలదన్నే రాజధాని’ని నిర్మిస్తామని ఎన్నికలకు ముందు వాగ్ధానం చేసిన నరేంద్ర మోదీ, ప్రధానిగా ‘అమరావతి’కి శంకుస్థాపన చేసి నేటికి ఐదేళ్ళు పూర్తయింది. 2015 అక్టోబర్ 22న పార్లమెంటు నుంచి పుట్ట మట్టి, నీరు తెచ్చి పవిత్ర జలాలు, మట్టితో పూజ చేసి మరీ అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు హయాంలో మూడున్నరేళ్ళ పాటు కొంత పురోగతి సాగించాక, ప్రభుత్వం మారడంతో అమరావతికి గ్రహణం పట్టింది. పాలనా రాజధానిని విశాఖపట్నానికి తరలించాలని నిర్ణయించిన సిఎం జగన్మోహన్ రెడ్డి, అమరావతి పునాది రాళ్లను శిథిలావస్థకు చేరుస్తున్నారు.

2020-10-22

భారత విదేశీ నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW- రా) అధిపతి సమంత్ కుమార్ గోయల్ నేపాల్ ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలిని కలిసారు. నేపాల్ తో ఉన్న స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాల్లో అంతరాయాన్ని ఇండియా అనుమతించబోదని స్పష్టం చేస్తూ... అన్ని సమస్యలనూ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని గోయల్ సూచించినట్టు సమాచారం. నవంబర్ మొదటి వారంలో భారత సైన్యాధిపతి ఎంఎం నరవణె నేపాల్ సందర్శనకు వెళ్లనున్న నేపథ్యంలో ‘రా’ చీఫ్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. బుధవారం సాయంత్రం నేపాల్ ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగినట్టు ఆయన మీడియా సలహాదారు సూర్య థాప చెప్పారు.

2020-10-22

వచ్చే ఐదేళ్ళలో బీహార్ లో 19 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని బిజెపి హామీ ఇచ్చింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బిజెపి మేనిఫెస్టోను గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. జనతాదళ్ (యునైటెడ్)తో కలసి ఎన్డీయే కూటమిగా పోటీ చేస్తున్న బిజెపి, మిత్రపక్షం కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమాగా ఉంది. నితీష్ కుమారే ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించినా, ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే ఈసారి సీఎం సీటుకు పట్టుబట్టే అవకాశం ఉంది.

2020-10-22

ఎన్నికల సమయంలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే నాయకులు, ఇప్పుడు వరద బాధితులను ఆదుకోవడానికి డబ్బులు బయటకు తీయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇది కూడా రాజకీయాల కోసం పెట్టుబడి అనుకోవాలని సూచించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మౌలిక సదుపాయాల సంస్థలకు వేల కోట్ల సామర్ధ్యం ఉందని పవన్ పేర్కొన్నారు. నాయకులు, వ్యాపారులతో పోలిస్తే సినిమావాళ్ల దగ్గర ఉన్న సందప ఎంతని ప్రశ్నించారు. విపత్తుల సమయంలో ఆదుకోవడంలో ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదేనని ఉద్ఘాటించారు.

2020-10-22

2017లో యుఎపిఎ కింద కేసు పెట్టాక అజ్ఞాతంలోకి వెళ్ళిన గూర్ఖా జనముక్తి మోర్చా (జిజెఎం) నేత బిమల్ గురుంగ్ బుధవారం మీడియా ముందుకు వచ్చారు. ఎన్డీయేతో సంబంధాలు తెంచుకుంటున్నట్టు ప్రకటించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రత్యేక గూర్ఖాల్యాండ్ హామీని నిలబెట్టుకోలేదని ఆక్షేపించారు. 2021 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇవ్వనున్నట్టు చెప్పారు. ‘‘మేము గూర్ఖాల్యాండ్ డిమాండ్ కి దూరం కావడం లేదు. మా డిమాండ్ ను ముందుకు తీసుకెళ్లే పార్టీకి మద్ధతు ఇస్తాం’’ అని గురుంగ్ పేర్కొన్నారు.

2020-10-21

బంగ్లాదేశ్ తలసరి జీడీపీలో ఇండియాను దాటిపోతోంది! అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజా ‘ప్రపంచ ఆర్థిక వీక్షణం’లో పేర్కొన్న ముఖ్యాంశాల్లో ఇదొకటి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సరిగ్గా ఈ అంశాన్ని పట్టుకున్నారు. "బీజేపీ ద్వేషపూరిత సాంస్కృతిక జాతీయవాదపు 6 సంవత్సరాల ఘన విజయం" అంటూ ఘాటుగా ట్వీటారు. 2020 తలసరి జీడీపీ ఇండియాలో తిరోగమించి 1888 డాలర్లకు తగ్గుతుండగా, బంగ్లాదేశ్ లో పురోగమించి 1876.5 డాలర్లకు పెరుగుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది. అంటే... పేద బంగ్లాదేశ్ కంటే ‘సూపర్ పవర్’ ఇండియా తలసరి జీడీపీ కేవలం 11.5 డాలర్లు ఎక్కువ.

2020-10-14

గత ఏడాది ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసినప్పటినుంచీ నిర్బంధంలో ఉన్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మంగళవారం విడుదలయ్యారు. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం పాలనా విభాగపు అధికార ప్రతినిధి రోహిత్ కన్సాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజా భద్రతా చట్టం (పిఎస్ఎ) కింద ఆమె నిర్బంధాన్ని మూడు నెలలు పొడిగిస్తూ జూలైలో ఉత్తర్వులిచ్చారు. మెహబూబా నిర్బంధంపై రెండు రోజుల్లో సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా విడుదల నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.

2020-10-13

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యత్వం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి బలంగా గళమెత్తారు. ‘ఐరాస’ నిర్ణయాత్మక విభాగాల నుంచి ఇండియాను ఎంత కాలం వెలుపల ఉంచుతారని ప్రశ్నించారు. మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐరాస సాధారణ అసెంబ్లీని ఉద్ధేశించి హిందీలో ప్రసంగించారు. ‘ఐరాస’లో సంస్కరణలు తక్షణ అవసరమని ఉద్ఘాటించారు. ‘‘ఈ దేశం వందలాది భాషలు, అనేక జాతులు, అనేకానేక భావజాలాలు కలిగిన దేశం. శతాబ్దాలుగా ప్రపంచంలో ప్రముఖ ఆర్థిక వ్యవస్థ. ఈ దేశంలో జరుగుతున్న మార్పులు ప్రపంచంలోని ఎక్కువ భాగాన్ని ప్రభావితం చేస్తున్నవేళ ఇంకా ఎంత కాలం వేచి చూడాలి’’ అని మోదీ ప్రశ్నించారు.

2020-09-27

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకమంటూ కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్న శిరోమణి అకాలీదళ్, తాజాగా ఎన్.డి.ఎ.కి కూడా టాటా చెప్పింది. ఈ మేరకు ఎస్.ఎ.డి. కోర్ కమిటీ శనివారం ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు పార్టీ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ కార్యాలయం ఒక ట్వీట్ లో పేర్కొంది. బిజెపి నేతృత్వంలోని ఎన్.డి.ఎ.లో అకాలీదళ్ చిరకాల, విశ్వసనీయ భాగస్వామిగా వ్యవహరించింది. వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్, కనీస మద్ధతు ధరకు భరోసా ఇచ్చే మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మొండిగా నిరాకరించిందని, పంజాబీలు- సిక్కుల సమస్యల పట్ల నిర్లక్ష్యం చూపుతోందని అకాలీదళ్ ఆరోపించింది.

2020-09-26

ఢిల్లీ అల్లర్లలో సహ కుట్రదారులంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్, ఆర్థికవేత్త జయతి ఘోష్, ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్, డాక్యుమెంటరీ నిర్మాత రాహుల్ రాయ్ లపై పోలీసులు అభియోగం మోపారు. కేంద్ర హోం శాఖ అధీనంలో ఉండే ఢిల్లీ పోలీసులు ఈమేరకు తాజాగా అనుబంధ చార్జ్ షీట్ నమోదు చేశారు. ఢిల్లీ అల్లర్లపై ఆ రాష్ట్ర పోలీసుల తీరు తొలినుంచీ వివాదాస్పదంగానే ఉంది. అసలు కుట్రదారులను వదిలేసి సిఎఎ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నవారిని కేసుల్లో ఇరికించారనే ఆరోపణలు వచ్చాయి.

2020-09-12
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page