క్రిస్మస్ రోజు హిందువులు చర్చిలకు వెళ్తే వారిపై దారుణంగా దాడి చేస్తామని అస్సాంలోని కాచర్ జిల్లా భజరంగదళ్ ప్రధాన కార్యదర్శి మీతూ నాథ్ హెచ్చరించారు. ‘‘వాళ్ళు షిల్లాంగ్ లో దేవాలయాలకు తాళాలు వేస్తున్నారు. మనం వారితో వెళ్లి వేడుకలు జరుపుకుంటున్నాము. దీన్ని మేము అనుమతించబోము’’ అని నాథ్ ఒక కార్యక్రమంలో మాట్లాడినట్టుగా ‘నార్త్ ఈస్ట్ టుడే’ రిపోర్టు చేసింది. మేఘాలయ రాజధాని (షిల్లాంగ్)లో ఇటీవల వివేకానంద కల్చరల్ సెంటర్ కు ఖాసీ విద్యార్థి యూనియన్ తాళాలు వేసినట్టు ఈ భజరంగ్ దళ్ నేత పేర్కొన్నారు.
2020-12-04ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెళ్ళికోసం మతం మారడాన్ని నేరంగా పరిగణిస్తూ ఆర్డినెన్స్ జారీ అయిన గంటల్లోనే తొలి కేసు నమోదైంది. షరీఫ్ నగర్ గ్రామానికి చెందిన తికారామ్ ఫిర్యాదు మేరకు బరేలీ పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన కుమార్తెతో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి మతం మారాలని ఒత్తిడి చేస్తున్నట్టు తికారామ్ ఫిర్యాదు చేశారు. ‘ఉత్తర్ ప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రెలిజియన్ ఆర్డినెన్స్ 2020’ని ఈ నెల 27న గవర్నర్ ఆనందీబెన్ పాటిల్ ఆమోదించారు. అదే రోజు తికారామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2020-11-29‘లవ్ జిహాద్’ను నిరోధించడానికంటూ రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్సుకు ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెళ్లి కోసం మతం మార్చుకోవడాన్ని నేరంగా పరిగణిస్తూ అందుకు 10 సంవత్సరాల జైలు శిక్షను ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన మంగళవారం ఆ రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. మోసం, బలవంతం, అబద్ధాలతో జరుగుతున్న మత మార్పిడులు గుండెల్ని పిండేస్తున్నాయని యూపీ మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధి సిద్ధార్థ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
2020-11-24మణిపూర్ లో ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు గాను కేవలం 757 మంది ఆడపిల్లలు పుడుతున్నారు. ఇది దేశంలోనే అత్యంత అధ్వానమైన లింగ నిష్ఫత్తి. మరో ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు గాను 1084 ఆడపిల్లల జననాలను నమోదు చేసి దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. పౌర నమోదు వ్యవస్థ వైటల్ స్టాటిస్టిక్స్ 2018 రిపోర్టు ప్రకారం.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ (896) అధ్వాన రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. 2018లో దేశం మొత్తంలో 2.33 కోట్ల జననాలు నమోదయ్యాయి.
2020-11-15ఉగ్రవాదులు, తీవ్రవాదులంతా మదరసాలలో చదివారని మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ మంగళవారం వాక్రుచ్చారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల ఫ్యాక్టరీగా మారిందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. విద్యార్ధులను జాతీయతకు అనుసంధానించడంలో విఫలమైన మదరసాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావలసిన అవసరం ఉందని ఈ మంత్రి పేర్కొన్నారు. ఇటీవల అస్సాం ప్రభుత్వం మదరసాలను మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తన వాదనకు మద్ధతుగా ఉదహరించారు. ‘‘జాతీయతకు అవరోధాలు కల్పిస్తున్న అన్ని సంస్థలనూ దేశ ప్రయోజనాల రీత్యా మూసివేయాలి’’ అని ఠాకూర్ ఉద్ఘాటించారు.
2020-10-20తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖకు డీజీపీ గౌతమ్ సవాంగ్ కార్యాలయం నుంచి లేఖ వెళ్లింది. అంతర్వేది ఆలయంలో 60 ఏళ్లుగా కళ్యాణోత్సవాల్లో భాగమైన 40 అడుగుల రథం శనివారం అర్ధరాత్రి తర్వాత తగలబడింది. దీనిపై హిందూ మత సంస్థలు ఆందోళనకు దిగాయి. రథం దగ్ధం వెనుక కుట్ర ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పలువురు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.
2020-09-10అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టు చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ‘కరోనా’ బారిన పడ్డారు. బుధవారం మధురలో పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. గత వారం రామ మందిరానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో దాస్ ప్రధాని నరేంద్ర మోదీతో కలసి పాల్గొన్నారు. దాస్ జ్వరం, శ్వాస సమస్యతో బాధపడుతుండటంతో ‘కరోనా’ పరీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జ్వరం తగ్గుముఖం పట్టిందని, అయినా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మహంత్ ను గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రికి తరలించామని జిల్లా కలెక్టర్ సర్వగ్య రామ్ మిశ్రా చెప్పారు.
2020-08-13ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నిర్దేశించిన 10 శాతం కోటాలో సగాన్ని చంద్రబాబు ప్రభుత్వం కాపులకు కేటాయిస్తే, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కారని జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు కాపు రిజర్వేషన్ జపం చేసిన జగన్ రెడ్డి, పాదయాత్ర మధ్యలో వ్యూహకర్తల బోధనలతో మాట మార్చారని ఆక్షేపించారు. బ్రిటిష్ పాలనలో బీసీలలో ఉన్న కాపులను 1956లో నీలం సంజీవరెడ్డి తొలగించారని, దామోదరం సంజీవయ్య 1961లో తిరిగి రిజర్వేషన్లు కల్పిస్తే కాసు బ్రహ్మానందరెడ్డి తొలగించారని విమర్శించారు. కొన్ని వర్గాల వారు కాపు రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని పవన్ ఆరోపించారు.
2020-06-27అమెరికాలోని న్యూమెక్సికో రాష్ట్రంలో శాంటా ఫే నగరంలో ఓ భారతీయ రెస్టారెంట్ ను శ్వేతజాతి దురహంకారులు ధ్వంసం చేశారు. పాకశాలలోని గోడలపైన ‘వైట్ పవర్’, ‘ట్రంప్ 2020’, ‘గో హోం’ అనే నినాదాలు రాశారు. తలుపులు, కౌంటర్లు, గోడలన్నింటా వికృతమైన రాతలున్నాయని రెస్టారెంట్ యజమాని బల్జీత్ సింగ్ చెప్పారు. ఈ సిక్కు రెస్టారెంట్ కు జరిగిన నష్టం లక్ష డాలర్లు ఉంటుందని స్థానిక శాంటాఫే మీడియా ప్రతినిధి చెప్పారు. ఇలాంటి విద్వేషం, విధ్వంసంపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఖ్ అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (సల్దేఫ్) ఇ.డి. కిరణ్ కౌర్ గిల్ డిమాండ్ చేశారు.
2020-06-24ఈ ఏడాది హజ్ యాత్రను చాలా కొద్దిమందితో నిర్వహించనున్నట్టు సౌదీ అరేబియా తాజాగా ప్రకటించింది. ఇప్పటికే తమ దేశంలో నివశిస్తున్న వివిధ దేశాల యాత్రికులను అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. అంటే ఇకపైన ఎవరినీ విదేశాలనుంచి అనుమతించరు. ‘కరోనా’ కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో.. జూలైలో జరిగే ఈ మత క్రతువుపై సౌదీ హజ్ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. హజ్ యాత్ర సాధారణంగా నిర్వహిస్తే ‘భౌతిక దూరం’ పాటించడం సాధ్యం కాదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణంగా ప్రతి ఏటా 20 లక్షలకు పైగా ముస్లింలు వివిధ దేశాలనుంచి హజ్ యాత్రకు వెళ్తుంటారు.
2020-06-23