‘కరోనా’ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ రిటైల్ స్టోర్లను శాశ్వతంగా మూసివేయనున్నట్టు మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రకటించింది. కంపెనీ వెబ్ సైట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 83 స్టోర్లు ఉన్నాయి. ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఉపకరణాలు, ఇతర హార్డ్ వేర్ ఆ స్టోర్లలో విక్రయిస్తున్నారు. ‘యాపిల్’కు పోటీగా 2009లో రిటైల్ స్టోర్లను ప్రారంభించింది మైక్రోసాఫ్ట్. అయితే, ఆయా స్టోర్లలో అమ్మకాల ఆదాయం అనుకున్నంతగా రావడంలేదు. కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఈ స్టోర్ల ద్వారా జరుగుతున్నది కేవలం 2 శాతమే. ఈ నేపథ్యంలో ‘కరోనా’ తాకిడితో స్టోర్లను తాత్కాలికంగా మూసివేస్తూ మార్చిలో కంపెనీ నిర్ణయం తీసుకుంది.
2020-06-27దేశంలో వరుసగా 20 రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు రూ. 8.87 చొప్పున ధర పెరగ్గా, డీజిలుపై లీటరుకు ఏకంగా రూ. 10.8 చొప్పున పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచడం దీనికి నేపథ్యం. అసలే ‘కరోనా’ కాటుకు గురై అల్లాడుతున్న ప్రజలు ఒక్కో లీటరు పెట్రోలుపై ఏకంగా రూ. 32.98, డీజిలుపై రూ. 31.83 చొప్పున కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని చెల్లించవలసి వస్తోంది. డీలర్ వద్దకు వచ్చేసరికి పెట్రోలు ధర సుమారు రూ. 22గా, డీజిల్ ధర సుమారు రూ. 23గా ఉంటోంది. అక్కడ ప్రజలు ఒక్క కేంద్ర ప్రభుత్వానికే 150 నుంచి 170 శాతం వరకు పన్ను కడుతున్నారు.
2020-06-26చైనా నుంచి వచ్చిన సరుకులను పోర్టులలో తనిఖీ చేయాలన్న ఆకస్మిక నిర్ణయంతో.. హాంకాంగ్, చైనా అధికారులు ఇండియా కన్సైన్మెంట్లను పోర్టుల్లోనే నిలిపివేసినట్టు భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఇఒ) తెలిపింది. ‘‘అధికారికంగా ఎలాంటి ఆదేశాలూ ఇవ్వకున్నా.. తనిఖీల వల్ల పోర్టులలో దిగుమతుల రాశులు పెరిగాయి’’ అని ఎఫ్ఐఇఒ అధ్యక్షుడు శరద్ కుమార్ సరాఫ్ కేంద్ర వాణిజ్య శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘‘ఇండియాకు చైనా ఎగుమతులు ఆ దేశ మొత్తం ఎగుమతుల్లో 2.8 శాతమే! ఇండియా చైనాకు పంపే సరుకులు మాత్రం మన ఎగుమతుల్లో 5.4 శాతం’’ అని ఎఫ్ఐఇఒ డీజీ అజయ్ సహాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
2020-06-26 Read More2020లో భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు తిరోగమిస్తుందని, మైనస్ 4.5 శాతంగా ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజాగా అంచనా వేసింది. జూన్ మాసపు వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ (డబ్ల్యుఇఒ)ను ఐంఎంఎఫ్ బుధవారం విడుదల చేసింది. ఏప్రిల్ డబ్ల్యుఇఒతో పోలిస్తే భారత వృద్ధి రేటు అంచనాలో ఏకంగా 6.4 శాతం కోత పెట్టడం గమనార్హం. 2020 అంచనాల్లో ఇంత మార్పు మరే దేశం విషయంలోనూ జరగలేదు. 2020లో అగాథంలో పడిపోయాక 2021లో 6 శాతం వృద్ధితో ఒడ్డుకు చేరుతుందని అంచనా. 2021 వృద్ధి అంచనాలో కూడా ఐఎంఎఫ్ (ఏప్రిల్ డబ్ల్యుఇఒతో పోలిస్తే) 1.4 శాతం కోత పెట్టింది.
2020-06-24‘కరోనా’, దాని కట్టడికోసమంటూ విధించిన ‘లాక్ డౌన్’ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. తెలుగు రాష్ట్రాల్లో తలసరి ఆదాయ నష్టం తెలంగాణలోనే ఎక్కువగా కనిపిస్తోంది. 2019-20తో పోలిస్తే 2020-21లో తలసరి ఆదాయం తెలంగాణలో 11.1 శాతం, ఆంధ్రలో 8.1 శాతం చొప్పున తగ్గిపోతుందని ఎస్.బి.ఐ. రీసెర్చ్ అంచనా వేసింది. ఆ సంస్థ ప్రకారం... ఎక్కువగా నష్టపోయే రాష్ట్రాల్లో తెలంగాణది 5వ స్థానం. తలసరి ఆదాయం తెలంగాణలో గత ఏడాది రూ. 2.54 లక్షలు ఉండగా ఈ ఏడాది రూ. 2.25 లక్షలకు తగ్గవచ్చు. ఏపీలో గత ఏడాది రూ. 1.72 లక్షలు ఉన్న తలసరి ఆదాయం ఈ ఏడాది రూ. 1.58 లక్షలకు తగ్గనుంది.
2020-06-23‘కరోనా’ వైరస్ ప్రభావంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతీయుల తలసరి ఆదాయం సుమారు రూ. 9 వేలు తగ్గిపోతుందని ఎస్.బి.ఐ. రీసెర్చ్ తాజా నివేదికలో అంచనా వేసింది. తలసరి ఆదాయంలో తగ్గుదల జీడీపీ తగ్గుదల (-3.8 శాతం) కంటే ఎక్కువగా ఉంటుందని కూడా పేర్కొంది. 2019-20లో తలసరి ఆదాయం రూ. 1.52 లక్షలు ఉండగా 2020-21లో రూ. 1.43 లక్షలకు తగ్గుతుందని అంచనా. ఢిల్లీలో 15.4 శాతం, చండీగఢ్ లో 13.9 శాతం, గుజరాత్ రాష్ట్రంలో 11.6 శాతం చొప్పున తలసరి ఆదాయం తగ్గిపోతుందని, ధనిక రాష్ట్రాల్లోనే ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొంది.
2020-06-23దేశంలో ఆర్థిక మందగమనం ఉన్నా... ‘కరోనా’ మార్కెట్లను కకావికలు చేస్తున్నా... రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం పైపైకి ఎగబాకుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన కంపెనీలలో ఇప్పుడు ఆర్ఐఎల్ 60వ స్థానానికి ఎదిగింది. మార్కెట్ కేపిటలైజేషన్ ను 150.78 బిలియన్ డాలర్లకు పెంచుకొని 2019 కంటే ఏకంగా 13 స్థానాలు పైకి ఎగబాకింది. యూనిలివర్, మెక్ డొనాల్డ్స్ తదితర కంపెనీలను అధిగమించింది. ‘కరోనా’ కాలంలోనూ రూ. 1,68,818 కోట్ల పెట్టుబడిని సమీకరించగలిగిన కంపెనీ ఆర్ఐఎల్. అందులో రూ. 1,15,694 కోట్లు జియో వేదికల ద్వారా వచ్చింది.
2020-06-23వలస ఉద్యోగులను 2020 చివరివరకు నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులపై ‘గూగుల్’ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా ఆర్థిక విజయానికి వలసలు గణనీయంగా తోడ్పడ్డాయని, సాంకేతిక రంగంలో ప్రపంచ దిగ్గజంగా మార్చాయని, గూగుల్ ఇలా ఎదగడానికి కూడా దోహదపడ్డాయని సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. ఈ రోజు ఉత్తర్వులతో నిరాశ చెందినట్టు పేర్కొంటూ.. వలస ఉద్యోగులకు అండగా ఉంటామని, అవకాశాలను అందరికీ విస్తరింపజేసేలా పని చేస్తామని పిచాయ్ ఉద్ఘాటించారు.
2020-06-23‘దశలవారీ మద్య నిషేదం’ సిఎం జగన్ హామీ. ఆయన అధికారంలోకి వచ్చాక తొలి సంవత్సరం (2019-20) రాష్ట్రంలో 30 శాతం షాపులు తగ్గించినా ఆదాయం కేవలం రూ. 4.69 శాతమే తగ్గింది. మద్యంపైన వాణిజ్య పన్ను 2018-19లో రూ. 10,915.69 కోట్లు వసూలు కాగా 2019-20లో రూ. 10,403.84 కోట్లు వసూలైంది. సొంత పన్నుల ఆదాయం (43,332.45 కోట్ల)లో ఇది 24 శాతం. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తున్నందున అమ్మకాలపై లాభం దీనికి అదనం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల ఆదాయం రూ. 51,689 కోట్లు ఉండొచ్చని ప్రభుత్వ అంచనా. ఈసారైనా మద్యం వాటా తగ్గిస్తారా? వేచి చూడాలి.
2020-06-22‘కరోనా లాక్ డౌన్’ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అయింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో పన్నుల వసూళ్లు అసాధారణంగా పడిపోయాయి. ఏప్రిల్, మే నెలలకు గాను రూ. 8,319.44 కోట్లు వసూలవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా వచ్చింది కేవలం రూ. 2,874.85 కోట్లు. అంటే లక్ష్యంలో కేవలం 34.55 శాతం మాత్రమే వసూలయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి సోమవారం (జూన్ 22న) వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జిఎస్టీ పరిహారం కింద రూ. 2,355.73 కోట్లు రావలసి ఉందని మంత్రి చెప్పారు.
2020-06-22