ఏప్రిల్ మాసంలో ఎగుమతులు, దిగుమతుల మధ్య అగాథం పెరిగింది. బుధవారం విడుదలైన సమాచారం ప్రకారం.. ఏప్రిల్ నెలలో దేశంనుంచి ఎగుమతి అయిన సరుకుల విలువ 26 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 41.4 బిలియన్ డాలర్లు. వాణిజ్య లోటు 15.33 బిలియన్ డాలర్లు (రూ. 1,07,300 కోట్లు)గా నమోదైంది. 2018 నవంబర్ తర్వాత ఇదే పెద్ద లోటు. ఏప్రిల్ మాసంలో దిగుమతులు 4.5 శాతం పెరిగాయి. గత నాలుగు నెలల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో ఎగుమతుల వృద్ధిరేటు కేవలం 0.64 శాతం.
2019-05-15 Read Moreబడా డిఫాల్టర్ల పారు బకాయిలు జాతీయ బ్యాంకులను వెన్నాడుతున్నాయి. ఫలితంగా.. ఇండియన్ బ్యాంకు 2018-19 చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ. 189.77 కోట్ల మేరకు నికర నష్టాన్ని నమోదు చేసింది. 2017-18 చివరి త్రైమాసికంలో రూ. 131.98 కోట్లు, ఆ ఏడాది మొత్తంలో రూ. 1,262.92 కోట్లు నికర లాభాన్ని ఇండియన్ బ్యాంకు ఆర్జించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం మొత్తానికి తీసుకుంటే... లాభం రూ. 320.93 కోట్లకు తగ్గిపోయింది. మొత్తం ఆదాయం పెరిగినప్పటికీ లాభం తగ్గిపోవడం గమనార్హం. నిరర్ధక ఆస్తులు 7.11 శాతంగా బ్యాంకు పేర్కొంది.
2019-05-14 Read Moreవాణిజ్య యుద్ధంలో చైనా పన్నుల పెంపువల్ల నష్టపోయే అమెరికా రైతులకు 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,05,000 కోట్లు) సాయం చేయనున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం చెప్పారు. ఈ సంవత్సరం తమకు కీలకమైనదని, అమెరికా రైతుల ఉత్పత్తులను చైనా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసిందని ట్రంప్ తెలిపారు. ఈ ప్రగతికి నజరానాగా అమెరికా రైతులకు తగిన సాయం చేస్తే మరింతగా ఫలితాలను సాధిస్తారని ఆకాంక్షించారు. గత ఏడాది కూడా అమెరికా రైతులకు 12 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ట్రంప్ ప్రభుత్వం సిద్ధం చేసింది.
2019-05-14 Read Moreతమ ఉత్పత్తులపై పన్నును అమెరికా 10 శాతం నుంచి 25 శాతానికి పెంచిన నేపథ్యంలో, చైనా ధీటైన కౌంటర్ ఇచ్చింది. 60 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై జూన్ 1వ తేదీనుంచి పన్ను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై ఇప్పటికే పన్నులు పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మిగిలిన 300 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై కూడా పన్ను పెంచాలని ఆదేశించారు. అంతే కాదు.. తమ చర్యకు చైనా కౌంటర్ ఇస్తే దారుణమైన పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ బెదిరింపులను చైనా పట్టించుకోలేదు.
2019-05-13 Read Moreదేశీయ కార్ల మార్కెట్ కుదేలైంది. గత ఏడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 15.9 శాతం తగ్గిపోయాయి. గత ఎనిమిది సంవత్సరాల్లో ఇదే అత్యధిక క్షీణత అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) సమాచారం ప్రకారం 2018 జూలై నుంచి వరుసగా 10 నెలల పాటు కార్ల అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి. అన్ని రకాల వాహనాల అమ్మకాలూ తగ్గిపోవడం గత పదేళ్లలో ఇప్పుడే చూస్తున్నామని సియామ్ చెబుతోంది. ఈ పరిస్థితినుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని భావిస్తున్నారు.
2019-05-13 Read Moreభారత దేశంలో పాసెంజర్ వాహనాల అమ్మకాలు ఏప్రిల్ మాసంలో అసాధారణంగా 17 శాతం క్షీణించాయి. 2018 ఏప్రిల్ మాసంలో 2,98,504 వాహనాలు అమ్ముడుపోగా ఈ ఏడాది మాత్రం 2,47,541కు పరిమితమయ్యాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16.4 శాతం క్షీణించి 16.38 లక్షలకు పరిమితమయ్యాయి. గత ఏడాది ఏప్రిల్ మాసంలో 19,58,761 ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోయాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 5.98 శాతం తగ్గి 68,680కి పరిమితమయ్యాయి. అన్ని రకాల వాహనాలూ కలిపి 3.8 లక్షల యూనిట్లు తక్కువగా అమ్ముడయ్యాయి.
2019-05-13 Read Moreఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ దేశానికి సహాయ ప్యాకేజీ ఇవ్వడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆదివారం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా మూడేళ్ల కాలంలో 6 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 42,000 కోట్లు) పాకిస్తాన్ పొందనుంది. ఒప్పందం కుదిరిన విషయాన్ని పాకిస్తాన్ ప్రధాని ఆర్థిక సలహాదారు అబ్దుల్ హఫీజ్ షేక్ వెల్లడించారు. అధికార స్థాయిలో కుదిరిన ఈ ఒప్పందానికి వాషింగ్టన్ లోని ఐఎంఎఫ్ బోర్డు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ప్రపంచబ్యాంకు, ఎడిబిలనుంచి మరో 2-3 బిలియన్ డాలర్ల సాయం అందుతుందని హఫీజ్ చెప్పారు.
2019-05-12 Read Moreవిదేశీ సంస్థాగత పెట్టబడి (ఎఫ్.పి.ఐ) ఇండియా మార్కెట్ నుంచి నిష్క్రమిస్తోంది. మే 2వ తేదీనుంచి 10వ తేదీవరకు గడచిన కొద్ది రోజుల్లో రూ. 3,207 కోట్ల ఎఫ్.పి.ఐ. మొత్తం నికరంగా దేశం వదిలి వెళ్లింది. ఈ రోజుల్లో కేవలం రూ. 1,344.72 కోట్ల మొత్తం దేశంలోకి రాగా రూ. 4,552.20 కోట్ల మొత్తం బయటకు వెళ్లింది. అంతకు ముందు ఏప్రిల్ మాసంలో రూ. 16,093 కోట్లు, మార్చిలో ఏకంగా రూ. 45,981 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 11,182 కోట్లు దేశంలోకి వచ్చింది. మే నెలలో తిరోగమనానికి అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం, ఎన్నికల ఫలితాలపై అస్థిరత్వం ఈ పరిస్థితికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు.
2019-05-12 Read Moreఅమెరికా-చైనా వాణిజ్య యుద్ధం తీవ్రమైంది. అమెరికాకు దిగుమతి అవుతున్న చైనా ఉత్పత్తులలో 200 బిలియన్ డాలర్ల విలువైనవాటిపై ఇంతకు ముందున్న 10 శాతం పన్నుకు బదులు 25 శాతం విధించాలని డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఆదేశించారు. వెంటనే కొత్త పన్ను అమల్లోకి వచ్చింది. అంతేకాదు.. మిగిలిన మొత్తం చైనా ఉత్పత్తులపైనా పన్ను పెంచే ప్రక్రియను ప్రారంభించాలని కూడా ట్రంప్ ఆదేశించారు. మిగిలిన ఉత్పత్తుల విలువ మరో 300 బిలియన్ డాలర్లు ఉంటుందని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రాబర్ట్ లైథైజర్ తెలిపారు.
2019-05-11 Read Moreపారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు మార్చి నెలలో -0.01 శాతంగా నమోదైంది. గత 21 నెలల్లో పారిశ్రామికోత్పత్తి తిరోగమించడం ఇదే మొదటిసారి. అంతకు ముందు నెలలో వృద్ధిరేటు కేవలం 0.01 శాతం నమోదు కాగా.. తయారీ రంగం వరుసగా రెండు నెలల్లోనూ మైనస్ లోనే ఉంది. మార్చి నెల తిరోగమనం మొత్తంగా 2018-19 ఆర్థిక సంవత్సరపు పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్ (ఐఐపి)ని 3.6 శాతానికి తగ్గించింది. ఐఐపి కిందటి సంవత్సరం 4.4 శాతంగా నమోదైంది. పారిశ్రామిక తిరోగమనం ప్రభావంతో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు తగ్గే అవకాశం ఉంది.
2019-05-11 Read More