2019-20 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా కింద రూ. 19,718.57 కోట్లు రానున్నాయి. మొత్తం బదలాయింపుల్లో తెలంగాణ వాటా 2.437 శాతం. శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం.. ఈ ఏడాది తెలంగాణకు కార్పొరేషన్ పన్ను రూపంలో 6,718.49 కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి రూ. 5,135.90 కోట్లు, కేంద్ర జీఎస్టీ నుంచి రూ. 5,369.67 కోట్లు, కస్టమ్స్ సుంకాలనుంచి రూ. 1,419.41 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ సుంకాలనుంచి రూ. 1,075.28 కోట్లు అందనున్నాయి.
2019-07-05కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా కింద 2019-20 సంవత్సరంలో రూ. 34,833.18 కోట్లు బదిలీ అవుతాయని బడ్జెట్లో పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు బదలాయించే మొత్తం (రూ. 8,09,233 కోట్ల)లో ఇది 4.305 శాతం. కార్పొరేషన్ పన్నులో రూ. 11,868.32 కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్నులో రూ. 9,072.65 కోట్లు, జీఎస్టీలో రూ. 9,485.62 కోట్లు, కస్టమ్స్ సుంకాల్లో 2,507.40 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ సుంకాల్లో రూ. 1,899.51 కోట్లు ఏపీ వాటా కింద రానున్నాయి.
2019-07-05కేంద్ర ప్రభుత్వ అప్పులు ఒక్క ఏడాది కాలంలో రూ. 8.11 లక్షల కోట్ల మేరకు పెరగనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంచనా వేశారు. 2019 మార్చినాటికి అప్పుల మొత్తం రూ. 90,56,725 కోట్లు కాగా, 2020 మార్చినాటికి 98,67,921 కోట్లకు పెరగనుంది. అంతర్గత అప్పులు, ఇతర బాధ్యతల మొత్తం రూ. 87,97,766 కోట్ల నుంచి రూ. 95,99,652 కోట్లకు.. విదేశీ అప్పు స్పల్పంగా రూ. 2,58,959 కోట్ల నుంచి రూ. 2,68,269 కోట్లకు పెరుగుతాయని అంచనా.
2019-07-05కేంద్ర ప్రభుత్వ వ్యయాల్లో ప్రధానమైన అంశం వడ్డీ చెల్లింపులే..! 2019-20 ఆర్థిక సంవత్సరంలో వడ్డీలకోసం కేంద్ర బడ్జెట్లో రూ. 6,60,471 కోట్లు కేటాయించారు. రక్షణ రంగానికి (రూ. 3,05,296 కోట్లు), సబ్సిడీల మొత్తానికి (రూ.3,01,694 కోట్లు) కలిపి చేయబోయే వ్యయం కంటే ఇది ఎక్కువ. 2018-19 సవరించిన అంచనాల ప్రకారం వడ్డీలపై వ్యయం రూ. 5,87,570 కోట్లు. పెన్షన్లకు రూ. 1,74,300 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ. 1,51,518 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 1,40,762 కోట్లు కేటాయించారు.
2019-07-05ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ప్రకటించిన ‘కిసాన్ సమ్మాన్ నిధి’ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 75,000 కోట్లు కేటాయించారు. ఈ పథకం రైతులందరికీ వర్తించేలా ఇటీవల చేసిన మార్పుతో రూ. 87 వేల కోట్లు అవసరమని అంచనా. కాగా, ఇప్పటివరకు కేటాయింపుల్లో అగ్రస్థానంలో ఉన్న ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం’కోసం ఈ ఏడాది రూ. 60 వేల కోట్లు కేటాయించారు. 2018-2019 సవరించిన అంచనాల (రూ. 61,084 కోట్ల) కంటే ఇది తక్కువే.
2019-07-052019-20లో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాగా రూ. 8,09,133 కోట్లు బదలాయించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది. ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు పంపిణీ చేయనున్న రూ. 1,20,466 కోట్లు, ఇతర బదలాయింపులతో కలిపి మొత్తం రూ. 13,29,428 కోట్లు రాష్ట్రాలకు ఇవ్వనున్నట్టు తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరం తుది లెక్కల ప్రకారం రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ. 6,73,006 కోట్లు, మొత్తంగా రూ. 10,85,130 కోట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు.
2019-07-052019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 27,86,349 కోట్ల వ్యయం అంచనాలతో కేంద్ర బడ్జెట్ వెలువడింది. కేంద్ర ప్రభుత్వానికి రాబడి రూ. 19,62,761 కోట్ల మేరకు ఉంటుందని అంచనా వేశారు. అప్పులు, ఇతర రాబడుల రూపంలో రూ. 8,23,588 కోట్లు సమకూరుతాయని అంచనా. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంటులో సుదీర్ఘ (2.15 గంటల) ఉపన్యాసం చేశాక బడ్జెట్ వివరాలను వెబ్ సైట్లో ఉంచారు.
2019-07-05డీజిల్, పెట్రోలుపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని మరో రూపాయి మేరకు పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు. శుక్రవారం లోక్ సభలో 2019-20 బడ్జెట్ పత్రాన్ని నిర్మల ప్రవేశపెట్టారు. ఇప్పటికే బ్రాండెడ్ డీజిల్ పై లీటరుకు రూ. 7.19 చొప్పున ప్రాథమిక ఎక్సైజ్ సుంకం, రూపాయి ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం, రూ. 8 అదనపు ఎక్సైజ్ సుంకం (రోడ్లు, మౌలిక సదుపాయాల సెస్) వసూలు చేస్తున్నారు.
2019-07-05ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా 7వ స్థానంలో ఉందని ఆర్థిక సర్వే 2019 నిర్ధారించింది. 2019 ఏప్రిల్ నాటి ఐఎంఎఫ్ సమాచారాన్ని కోట్ చేస్తూ సర్వేలో ఇచ్చిన గ్రాఫ్ ను పైన చూడవచ్చు. 2014, 2018 మధ్య ఆర్థిక వ్యవస్థల సగటు వృద్ధి రేటు, ర్యాంకులను సూచించే గ్రాఫ్ ఇది. దాని ప్రకారం వృద్ధి రేటులో చైనా, ఇండియా పోటాపోటీగా ఉండగా ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యు.కె., ఫ్రాన్స్, ఇండియా, ఇటలీ, బ్రెజిల్, కెనడా మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి.
2019-07-04ప్రపంచ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో ఇండియా వాటా 2018లో తగ్గింది. 2013 నుంచి స్థిరంగా పెరుగుతూ వచ్చిన ఇండియా వాటా 2017లో 3.3 శాతానికి చేరి 2018లో 3.2 శాతానికి తగ్గింది. 2012 తర్వాత ఇండియా వాటా తగ్గడం ఇదే మొదటిసారి. 2011లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇండియా వాటా 2.5 శాతంగా ఉంటే 2012లో అది 2.4 శాతానికి తగ్గింది. సవరించిన జీడీపీ సిరీస్ లెక్కల ప్రకారం 2013 నుంచి ఇండియా వాటా క్రమంగా పెరుగుతూ వచ్చింది.
2019-07-04