వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) కింద అక్టోబర్ మాసంలో రూ. 95,380 కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది అక్టోబరు (రూ. 1,00,710 కోట్లు)తో పోలిస్తే ఈ మొత్తం 5.3 శాతం తక్కువ. పండుగ మాసమైనా అక్టోబరులో వసూళ్లు తగ్గడం గమనార్హం. వరుసగా మూడో నెల...జీఎస్టీ లక్ష కోట్ల కంటే తక్కువ వసూలైంది. అక్టోబరులో సీజీఎస్టీ కింద రూ. 17,582 కోట్లు, ఎస్.జి.ఎస్.టి. కింద రూ. 23,674 కోట్లు, ఐ.జి.ఎస్.టి. కింద రూ. 46,517 కోట్లు (దిగుమతుల ద్వారా రూ. 21,446 కోట్లు), సెస్ రూపంలో రూ. 7,607 కోట్లు వసూలయ్యాయి.

2019-11-02 Read More

అమెరికాపై 3.6 బిలియన్ డాలర్ల మేరకు ఆంక్షలు విధించడానికి ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) చైనాకు అనుమతి ఇచ్చింది. అమెరికా యాంటీ డంపింగ్ ఆంక్షలకు పరిహారంగా ఈ మొత్తాన్ని విధించడానికి డబ్ల్యుటిఒ ఆమోదం తెలిపింది. డబ్ల్యుటిఒ చరిత్రలో అనుమతించిన పరిహారాల్లో ఇది మూడో పెద్ద మొత్తం. రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సుంకాల యుద్దం ప్రారంభం కావడానికి ముందే చైనా ఈ కేసును దాఖలు చేసింది. దానిపై డబ్ల్యుటిఒ తీర్పు తాజాగా వెలువడింది.

2019-11-02 Read More

పారిశ్రామికోత్పత్తిలో కీలకమైన 8 ప్రధాన రంగాలు చతికిలపడ్డాయి. సెప్టెంబరులో ఆయా పరిశ్రమల ఉత్పత్తి పెరగకపోగా 5.2 శాతం తగ్గింది. 8 ప్రధాన పరిశ్రమల్లో 7 తిరోగమనంలోనే ఉన్నాయి. అందులో బొగ్గు ఉత్పత్తి పరిశ్రమ ఏకంగా 20.5 శాతం క్షీణించింది. ఈ తిరోగమనం... రెండో త్రైమాసికంలో మొత్తం జీడీపీ వృద్ధిపైనే ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయింది. 8 ప్రధాన రంగాల్లో వృద్ధి రేటు ఆగస్టులో కేవలం 0.1 శాతంగా నమోదైంది.

2019-10-31

విశాఖలో 20 ఏళ్లలో రూ. 70 వేల కోట్ల పెట్టుబడితో అతి పెద్ద డేటా సెంటరును నిర్మిస్తామని గతంలో చెప్పిన గౌతమ్ అదానీ కంపెనీ ఇప్పుడా మొత్తాన్ని రూ. 3000 కోట్లకు తగ్గించింది. అదానీ సంస్థకు గత ప్రభుత్వం విశాఖలో మూడు చోట్ల కేటాయించిన 400 ఎకరాల భూమి చాలా ఎక్కువని భావించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వచ్చే రెండు-మూడేళ్లలో ఎంత పెట్టుబడి పెట్టగలరో.. ఎంతమందికి ఉపాధి కల్పిస్తారో స్పష్టంగా చెప్పాలని ప్రశ్నించింది. దీంతో అదానీ సంస్థ స్వల్పకాల ప్రణాళికకు 89 ఎకరాలు చాలని బదులిచ్చింది.

2019-10-31

భారత ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ వాటా పెంచడమే లక్ష్యంగా సాగాలని పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ దిశగా తాను 15 రోజులకోసారి పరిశ్రమల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహిస్తానని ఆయన చెప్పారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలకు సానుకూల వాతావరణాన్ని కల్పించడానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, భవిష్యత్ తరానికి తగినట్టుగా నైపుణ్య శిక్షణకోసం అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

2019-10-31

2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్ నుంచి రూ. 4,48,122 కోట్ల మేరకు అప్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిర్దేశించుకుంది. అయితే, సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల్లోనే రూ. 4,78,253 కోట్లు మార్కెట్ నుంచి సేకరించింది. అంటే ఏడాది మొత్తంలో చేయవలసిన అప్పుల కంటే ఆరు నెలలకే ఎక్కువ (107 శాతం) చేసింది. గత ఏడాది ఇదే కాలంలో వార్షిక లక్ష్యానికి 82 శాతం మేర మార్కెట్ రుణాలు సేకరించింది.

2019-10-31

2019-20 తొలి అర్ధ భాగంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయం రూ. 8,37,065 కోట్లుగా ఉంటే వ్యయం రూ. 14,88,619 కోట్లుగా తేలింది. పన్నుల ద్వారా వచ్చింది రూ. 6,07,429 కోట్లయితే పన్నేతర ఆదాయం రూ. 2,09,038 కోట్లు. వ్యయంలో రెవెన్యూ పద్ధు రూ. 13,01,082 కోట్లు. కేపిటల్ వ్యయం 1,87,537 కోట్లు కాగా వడ్డీ చెల్లింపులకే రూ. 2,70,696 కోట్లు పోయింది. సంవత్సరం మొత్తంలో రూ. 27,86,349 కోట్ల వ్యయం అవుతుందని బడ్జెట్లో అంచనా వేయగా ఆర్నెల్లలో అందులో 53.4 శాతం పూర్తయింది. ఆదాయం మాత్రం లక్ష్యంలో 40.2 శాతమే వచ్చింది.

2019-10-31

2019-20 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ. 4,85,503 కోట్లు ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేసింది. అయితే, సెప్టెంబరుతో ముగిసిన ఆర్నెల్లలోనే లోటు రూ. 4,84,615 కోట్లకు చేరింది. అంటే వార్షిక అంచనాలో 99.8 శాతం. అదే సమయంలో ద్రవ్య లోటు 92.6 శాతానికి చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ. 7,03,760 కోట్లు ఉంటుందనుకుంటే ఆర్నెల్లకే రూ. 6,51,554 కోట్లు తేలింది. గురువారం కేంద్ర ప్రభుత్వం తాజా గణాంకాలను వెల్లడించింది.

2019-10-31

లెక్కల్లోకి రాని బంగారాన్ని వ్యక్తులు, సంస్థలు వెల్లడించేలా ప్రభుత్వం ఓ పథకాన్ని తేనుందని వచ్చిన వార్తలను అధికార వర్గాలు అనధికారికంగా ఖండించాయి. అలాంటి పథకం ఏదీ ఆదాయ పన్ను శాఖ పరిశీలనలో లేదని ఆ వర్గాలు తెలిపాయి. నోట్ల రద్దు నాటి నుంచి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో అల్లాడుతున్న ప్రజలు... ఈ ‘బంగారం వెల్లడి పథకం’ వార్తలతో అయోమయానికి గురయ్యారు. దీంతో అధికారులు పత్రికలకు వివరణ ఇచ్చారు. బడ్జెట్ రూపకల్పన ప్రారంభమయ్యాక ఇలాంటి వార్తలు రావడం సహజమని వారు చెప్పారు.

2019-10-31 Read More

నిరంతరం ఆందోళనలతో అశాంతి నెలకొనడంతో హాంగ్ కాంగ్ ఆర్థిక వ్యవస్థ తిరోగమించింది. 2019 మూడో త్రైమాసికంలో హాంగ్ కాంగ్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గత ఏడాది అదే కాలంతో పోలిస్తే 2.9 శాతం తగ్గింది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత హాంగ్ కాంగ్ జీడీపీ తిరోగమించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాలలో వరుసగా 0.6 శాతం, 0.4 శాతం వృద్ధి నమోదైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో పాటు హాంగ్ కాంగ్ లో జరుగుతున్న ఆందోళనలు హఠాత్పతనానికి కారణాలని ప్రభుత్వం పేర్కొంది.

2019-10-31
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 Last Page