ఇండియాలో ‘కరోనా’ కేసులు 12,300 దాటాయి. 425 మంది మరణించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో కేసులు బాగా పెరిగాయి. అయితే, దేశంలోనే తొలి కేసును చూసిన కేరళ మాత్రం ‘కరోనా’ను కట్టడి చేసింది. బుధవారం ఆ రాష్ట్రంలో ఒకే ఒక్క కొత్త కేసు నమోదైంది. ఇప్పటిదాకా రాష్ట్రంలో 387 మందికి కరోనా సోకగా.. 218 మంది (56.33 శాతం) కోలుకున్నారు. మిగిలిన రాష్ట్రాల కంటే దాదాపు నెల రోజులు ముందే ‘కరోనా’ కేసులు నమోదైనా ఇంతవరకు ఇద్దరే (0.51 శాతం) మరణించారు. ఈ గణాంకాలు ‘కరోనా’పై పోరాటంలో కేరళ ప్రత్యేకతను చాటి చెబుతున్నాయి.

2020-04-16

కేంద్ర హోం శాఖ ‘లాక్ డౌన్ 2.0’ మార్గదర్శకాలను బుధవారం జారీ చేసింది. వాటి ప్రకారం.. ఈ నెల 20 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమల పున:ప్రారంభానికి, రోడ్లు- భవనాలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతిస్తారు. నగరాల్లో ఐటి, ఇ కామర్స్, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన కాల్ సెంటర్లు, అంతర్రాష్ట్ర సరుకుల రవాణా కూడా 20 నుంచి నడుస్తాయి. అయితే, మనుషుల మధ్య దూరాన్ని కచ్చితంగా పాటించాలి. విమాన, రైలు, రోడ్డు ప్రయాణాలపై నిషేధం, విద్యా సంస్థలు, హోటళ్ళు, సినిమాహాళ్ళు, షాపింగ్ కాంప్లెక్సుల మూసివేత కొనసాగుతాయి.

2020-04-15

ఇండియాలో ‘కరోనా’ వైరస్ సోకినవారిని పరీక్షించడంలో ఆలస్యం నివారించదగ్గ మరణాలకు కారణమవుతోంది. ‘కరోనా’ హాట్ స్పాట్ గా ఉన్న ముంబై నగరంలో తొలి 50 మృతుల వివరాలను పరిశీలించి నిపుణులు తేల్చిన విషయం ఇది. ముంబై తొలి 50 మృతుల్లో 26 మంది ఆసుపత్రిలో చేరిన కొద్ది గంటలు లేదా ఒక రోజు లోపే మరణించారు. 11 మంది పరీక్షల ఫలితాలు వారు చనిపోయాకే వచ్చాయి. మరో 14 మంది చనిపోవడానికి కొద్ది గంటల ముందే రోగ నిర్ధారణ జరిగింది. ఆసుపత్రిలో చేరాక ఐదు రోజులు లేదా అంతకంటే ఎక్కువ బతికి ఉన్నది కేవలం 9 మంది (20 శాతం లోపే).

2020-04-15 Read More

దేశవ్యాప్తంగా ‘లాక్ డౌన్’ను మరో 19 రోజులు పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన కొద్దిసేపటికే ముంబై వీధుల్లో వలస కార్మికులు కదం తొక్కారు. సుమారు 3000 మంది కార్మికులు బాంద్రా ప్రాంతంలో నిరనస తెలిపారు. తమను సొంత ప్రాంతాలకు పంపాలని డిమాండ్ చేశారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మార్చి 24 అర్ధరాత్రి నుంచి దేశం మొత్తాన్ని దిగ్బంధిస్తున్నట్టు కేవలం 4 గంటల ముందు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ హఠాత్ప్రకటన లక్షల మంది వలస కార్మికులను వీధులపాల్జేసింది. ఈ రోజు సడలింపు ప్రకటన చేస్తే సొంత ప్రాంతాలకు వెళ్లవచ్చనుకుంటే నిరాశే ఎదురైంది.

2020-04-14

‘కరోనా’ కట్టడికోసం విధించిన 21 రోజుల ‘లాక్ డౌన్’ మంగళవారంతో ముగుస్తుండగా.. మరో 19 రోజులు పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. మే 3వ తేదీ వరకు కొనసాగే ‘లాక్ డౌన్’లో ఈ నెల 20 తర్వాత కొన్ని మినహాయింపులు ఉంటాయని ప్రధాని సంకేతాలిచ్చారు. అప్పటిదాకా కఠినంగానే అమలవుతుందని చెప్పారు. 138 కోట్ల ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం.. ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి. తొలి దశ ‘లాక్ డౌన్’లో ప్రజలు తిండి లేక ఇబ్బంది పడినా, అనేక సమస్యలు ఎదుర్కొన్నా సామూహిక శక్తిని ప్రదర్శించారని ప్రధాని ప్రశంసించారు.

2020-04-14

‘ఇంటినుంచే పని’కి స్వస్తి పలికి కార్యాలయాలకు వెళ్ళాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన సహచర మంత్రులను ఆదేశించారు. సోమవారం బైశాఖి తర్వాత, మంగళవారం (అంబేద్కర్ జయంతి) నుంచి కార్యాలయాలకు హాజరు కావాలని సూచించారు. మార్చి 24న ప్రారంభమైన 21 రోజుల ‘దేశ దిగ్బంధం’ అదే రోజున (ఏప్రిల్ 14న) ముగియనుంది. సంయుక్త కార్యదర్శులు, ఆ పైస్థాయి అధికారులు కూడా పనికి హాజరు కావాలని పిఎం ఆదేశించారు. అయితే, అందరూ కార్యాలయాల్లో ‘సాంఘిక దూరం’ పాటించాలని స్పష్టం చేశారు. కొన్ని అంశాల్లో ‘లాక్ డౌన్’ సడలిస్తారనడానికి ఇదో సూచికగా భావిస్తున్నారు.

2020-04-11

తన అభీష్ఠానికి వ్యతిరేకంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ కు విశ్వరూపం చూపించారు. ప్రభుత్వం ప్రత్యక్షంగా ఎస్ఇసిని తొలగించే అవకాశం లేకపోవడంతో పరోక్షంగా వేటు వేశారు. ఎస్ఇసి పదవీ కాలాన్ని 5 నుంచి 3 సంవత్సరాలకు కుదిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. పంచాయతీరాజ్ చట్టాన్ని ఆర్డినెన్సుతో సవరించి.. రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసిందంటూ వెంటనే జీవో (ఎంఎస్ 617) జారీ చేశారు. ఆర్డినెన్సుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.

2020-04-10

మార్చి 22న ‘జనతా కర్ఫ్యూ’ విధించిన నాటి నుంచి ఇండియా మొత్తం దిగ్బంధంలో ఉంది. 135 కోట్లకు పైగా జనాభా కదలికలను సైతం నియంత్రించిన ఈ దిగ్బంధం భూగోళం చరిత్రలోనే అతిపెద్దది. వైరస్ వ్యాప్తి వేగాన్ని ఇది తగ్గిస్తోంది. అయినా.. మార్చి 21న 330గా ఉన్న ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారానికి (ఏప్రిల్ 8కి) 5,500కి పెరిగింది. పరీక్షల రేటు పెరిగితే వైరస్ కేసులు మరిన్ని బయటపడతాయి. ప్రస్తుతం లక్ష మంది జనాభాలో 10 మందికి కూడా పరీక్షలు జరగలేదు. కనీస సదుపాయాలతో కూడిన పరిశుభ్రమైన వార్డులు, వైద్య, రక్షణ సామాగ్రి లేకపోవడం అతి పెద్ద సమస్య.

2020-04-08

దేశవ్యాప్తంగా 22,567 సహాయ శిబిరాలు ఉంటే 15,541 (68.86%) కేరళ ప్రభుత్వం నడుపుతున్నవేనని, సహాయ నిధిలో మాత్రం కేవలం 1.4 శాతం కేటాయించిందని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు సిపిఎం నేత సీతారాం ఏచూరి. కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలోని గణాంకాలనే ఏచూరి మంగళవారం వెల్లడించారు. దేశం మొత్తంగా సహాయ శిబిరాల్లో 6,31,119 మంది ఉండగా, ఒక్క కేరళలోనే 3,02,016 మంది (47.9%) ఉన్నారని వివరించారు. అన్ని రాష్ట్రాలకు రూ. 11,092 కేటాయించిన కేంద్రం కేరళకు ఇచ్చింది కేవలం రూ. 157 కోట్లు (1.4%) అని ఆక్షేపించారు. ‘‘మోడీ ప్రభుత్వం వద్ద ఏమైనా సమాధానాలున్నాయా?’’ అని ఏచూరి ప్రశ్నించారు.

2020-04-07

‘‘హైడ్రాక్సీక్లోరోక్విన్’ను పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరినా ప్రధాని నరేంద్ర మోడీ తిరస్కరించారు’- నిన్న జరిగిన ఈ ప్రచారంలో కేసీఆర్ వంటి నేతలూ భాగమయ్యారు. వాస్తవం వేరు. ఎగుమతులకు అనుమతించకపోతే ప్రతీకార చర్యలు ఉంటాయన్న అమెరికా అధ్యక్షుడి బెదిరింపుతో నరేంద్ర మోడీ వెనక్కు తగ్గారు. నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు మంగళవారం భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘కరోనా’ నిరోధానికి ‘హైడ్రాక్సీక్లోరోక్విన్’ను సిఫారసు చేసిన ట్రంప్.. మాత్రలను పంపాలని మోడీని కోరారు. లేకపోతే ప్రతీకార చర్యలు ఉంటాయని స్పష్టం చేసినట్టు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఫలితమే నిషేధం ఎత్తివేత.

2020-04-07
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 Last Page