చైనాతో సరిహద్దు ఘర్షణలో మరణించిన తెలంగాణవాసి కర్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సిఎం కె. చంద్రశేఖరరావు భారీ వరాలు అందించారు. రూ. 5 కోట్ల ఆర్థిక సాయం, భార్యకు గ్రూప్ 1 ఉద్యోగం, హైదరాబాద్ బంజారాహిల్స్ లో 711 గజాల ఇంటి స్థలం పత్రాలను స్వయంగా అందించారు. సోమవారం సంతోష్ బాబు ఇంటికి వెళ్లి ఆయన పిల్లల పేరిట రూ. 4 కోట్ల చెక్కును, తల్లిందండ్రులకు రూ. కోటి చెక్కును అందజేశారు. సంతోష్ భార్యకు గ్రూప్ 1 ఉద్యోగ నియామక పత్రాన్ని, ఇంటి స్థలం డాక్యుమెంట్లను అందించారు. సూర్యాపేటలో సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు.
2020-06-22కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ లతో సమావేశమయ్యారు. ‘కరోనా’ వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో.. షా ఢిల్లీ సిఎంతో సమావేశం కావడం వారంలో ఇది మూడోసారి. గత గురువారం దేశ రాజధాని ప్రాంతం (ఎన్.సి.టి)లో ‘కరోనా’ వ్యాప్తిపై షా సమీక్ష నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, హర్యానాలలోని కొన్ని ప్రాంతాలు కూడా ఎన్.సి.టి.లో భాగం. అందువల్ల ఒక ఉమ్మడి వ్యూహం అవసరమని షా ఉద్ఘాటించారు. ఢిల్లీలో ‘కరోనా’ కేసులు ఇప్పటికే 55 వేలు దాటగా.. ఈ నెలాఖరుకు లక్షకు, వచ్చే నెలాఖరుకు 5.5 లక్షలకు చేరతాయని అంచనా.
2020-06-21గత ప్రభుత్వ హయాంలో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా అమలు చేసిన ‘చంద్రన్న కానుక’ పథకాల్లో అవినీతి జరిగిందని జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం నిర్ధారించింది. వీటితోపాటు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ‘ఏపీ ఫైబర్ నెట్’ పైనా సిబిఐ దర్యాప్తు జరిపించాలని కేబినెట్ గురువారం నిర్ణయించింది. మూడు కానుకల పంపిణీలో రూ. 158 కోట్ల మేరకు అవినీతి జరిగిందని ఈ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నివేదించింది. ఉపసంఘం చేసిన సూచన మేరకే సిబిఐ దర్యాప్తునకు నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు.
2020-06-11‘కరోనా’ విస్తరణకు ఒకానొక కేంద్ర బిందువుగా మారిన ‘తబ్లిఘీ జమాత్’పై కేంద్ర హోంశాఖ మరో చర్య తీసుకుంది. కరోనా కాలంలో ఇండియాలో ఉన్న 2,550 మంది విదేశీ తబ్లిఘీ సభ్యులు వచ్చే పదేళ్ళపాటు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. వీసా నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా మసీదులలో నివశించినవారిపై రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ చర్య తీసుకున్నట్టు హోం శాఖ తెలిపింది. ఢిల్లీ నిజాముద్ధీన్ మర్కజ్ మసీదులో తబ్లిఘీ ప్రార్ధనా సమావేశాల సందర్భంగా ‘కరోనా’ వ్యాపించిన సంగతి తెలిసిందే.
2020-06-04తెలంగాణలోనూ ‘లాక్ డౌన్’ను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సోమవారం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. అంతర్రాష్ట్ర రవాణాకు అనుమతి లేదని.. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ కోవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ వంద శాతం పని చేయవచ్చని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ మినహా మిగిలినచోట్ల మొత్తం షాపులు, హైదరాబాద్ నగరంలో షాపు మార్చి షాపు తెరవవచ్చని, కంటైన్మెంట్ జోన్లలో అన్నీ బంద్ అని కేసీఆర్ చెప్పారు. ప్రార్ధనా స్థలాలకు, మత కార్యక్రమాలకూ అనుమతి లేదన్నారు. సెలూన్లకు అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు.
2020-05-18‘కరోనా’ కట్టడికోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘దేశ దిగ్బంధం’ మరో రెండు వారాలు (మే 31వరకు) కొనసాగనుంది. లాక్ డౌన్ 4.oగా వ్యవహరిస్తున్న ఈ పొడిగింపునకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ ఆదివారం జారీ చేసింది. దేశీయ విమాన సర్వీసులు, మెట్రో సేవలు మే 31వరకు ఉండవు. ప్రార్ధనా స్థలాలు, సినిమా ధియేటర్లు, షాపింగ్ మాల్స్ కూడా తెరవకూడదు. అంతర్రాష్ట్ర రవాణాపై ఆయా రాష్టాలు పరస్పర అవగాహనతో నిర్ణయం తీసుకోవాలని కేంద్రం పేర్కొంది. ‘కంటైన్మెంట్ జోన్’లలో ఆంక్షలను కఠినతరం చేసింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ ఉంటుంది.
2020-05-17సస్పెండ్ అయిన నర్సీపట్నం ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ మానసిక పరిస్థితి బాగా లేదంటూ.. పోలీసులు ఆయనను విశాఖ మానసిక వైద్యశాలకు తరలించారు. ఆయనను కొట్టిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. కరోనా నుంచి రక్షణకు ఎన్95 మాస్కులను ప్రభుత్వం సరఫరా చేయలేదని విమర్శించి సస్పెండ్ అయిన సుధాకర్, శనివారం విశాఖ రోడ్డుపై నిరసన తెలిపారు. తాగిన మత్తులో సిఎంను ధూషించారంటూ పోలీసులు సుధాకర్ ను కొట్టి చేతులు కట్టేసి అరెస్టు చేశారు. ఆయనకు ‘ఎక్యూట్ ట్రాన్సియంట్ సైకోసిస్’ అనే మానసిక సమస్య ఉన్నట్టు ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి ప్రకటించారు.
2020-05-16వలస కార్మికుల వర్ణనాతీతమైన కష్టాలకు పోలీసుల లాఠీ దెబ్బలు తోడవుతున్నాయి. శనివారం ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో.. చెన్నై- కోల్ కత జాతీయ రహదారిపై తాడేపల్లి వద్ద జరిగిన లాఠీచార్జ్ ఇందుకు నిదర్శనం. సైకిళ్ళపై, కాలినడకన సొంత ప్రాంతాలకు వెళ్తున్న వలస కార్మికులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. అయితే, లాఠీచార్జ్ జరగలేదని గుంటూరు జిల్లా కలెక్టర్, అర్బన్ ఎస్పీ చెప్పారు. రెండు రోజుల్లో రైళ్ళలో పంపుతామని చెప్పినా వినకుండా వెళ్తున్నవారిని భయపెట్టడానికే పోలీసులు లాఠీలు ఝళిపించారని ఎస్పీ రామకృష్ణ చెప్పారు.
2020-05-16అక్వా ఉత్పత్తులతో సహా రైతులు పండించిన పంటలన్నీ గ్రామంలోనే వినియోగదారులకు అందుబాటులో ఉండేలా ‘వైఎస్ఆర్ జనతా బజార్ల’ను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. శుక్రవారం రైతుభరోసాపై జిల్లాల యంత్రాంగంతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సులో సిఎం ఈ విషయంపై మాట్లాడారు. గ్రామాల్లో జనతా బజార్ల ఏర్పాటుకు ఒక సంవత్సరం సమయం కావాలని సిఎం పేర్కొన్నారు. కోల్డ్ స్టోరేజీలు, గోడౌన్ల వంటి మౌలిక సదుపాయాలను కూడా గ్రామాల్లోనే ఏర్పాటు చేస్తామని సిఎం ప్రకటించారు.
2020-05-15నాణ్యమైన బియ్యం ఇంటివద్దకే పంపిణీ చేసే కార్యక్రమాన్ని వచ్చే సెప్టెంబరు 1న రాష్ట్రమంతా ప్రారంభించాలని సిఎం జగన్ అధికారులను ఆదేశించారు. బియ్యం పంపిణీ చేసే సంచీ, అందుకు ఉపయోగించే వాహనం నమూనాలను పై చిత్రంలో చూడొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి 13,370 వాహనాలను అందుబాటులో ఉంచనున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ చెప్పారు. ప్రతి గోనె సంచీ పైన బార్ కోడ్, గోదాముల నుంచి వచ్చేటప్పుడు స్ట్రిప్ సీల్ ఉంటాయని ఆయన తెలిపారు. కోర్టులు వద్దు వద్దంటున్నా వీటికీ వైసీపీ రంగులు పడ్డాయి.
2020-05-08