‘కరోనా’పై ప్రభుత్వమే ఏదో చేయాలని అనుకొనే కంటే.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని మంత్రి కేటీఆర్‌ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో 23 వేల కేసులు వెలుగుచూస్తే మరణాలు 300 మాత్రమే నమోదయ్యాయని, అయినా కొంత మంది విమర్శలు చేస్తున్నారని విపక్షాలపై మండి పడ్డారు. అక్కడక్కడా లోపాలు లేవని తాను చెప్పడంలేదన్న కేటీఆర్, పరీక్షలు చేయడంలేదు.. డేటా దాచిపెడుతున్నారన్న ఆరోపణలను మాత్రం కొట్టిపారేశారు. అదే నిజమైతే మరణాల సంఖ్య ఎలా దాయగలమని ప్రశ్నించారు. దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ప్రతిపక్ష నేతలపై ధ్వజమెత్తారు.

2020-07-08

చైనాలో ‘కరోనా’ కట్టడి అయ్యాక.. గత నెలలో రాజధాని బీజింగ్ నగరంలో కొద్ది కేసులు నమోదు కావడం కలకలం రేపింది. అయితే, అక్కడి యంత్రాంగం వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నగరంలోని కోటీ 10 లక్షల మందికి పైగా ప్రజలకు న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. అయితే, జూన్ 11 నుంచి జూలై 5 వరకు నగరంలో కేవలం 335 కేసులు నిర్ధారణ అయ్యాయి. అందులో 324 మందికి ఆసుపత్రిలో చికిత్స చేశారు. ‘కోవిడ్ 19’ లక్షణాలు కనిపించని మరో 30 మందిని వైద్య పర్యవేక్షణలో ఉంచారు.

2020-07-06

ఏపీలో ‘కరోనా’ పరీక్షల సంఖ్య శనివారం 10,17,140కి పెరిగింది. ప్రతి 10 లక్షల జనాభాకు 19,048 టెస్టులతో రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. శనివారం 20,567 నమూనాలను పరీక్షించగా 998 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయింది. కొత్త కేసులు ఎక్కువగా నమోదైన జిల్లాల్లో గుంటూరు (157), తూర్పుగోదావరి (118), కర్నూలు (97)తో పాటు శ్రీకాకుళం (96), విశాఖపట్నం (88) ఉండటం గమనార్హం. కాగా, నిన్నటికి దేశం మొత్తంమీద 97,89,066 పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) వెల్లడించింది.

2020-07-05

‘కరోనా’ వేడిలో మోడీ ప్రభుత్వం రైల్వేలలో ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టింది. 109 రూట్లలో 151 రైళ్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు రైల్వే శాఖ బుధవారం రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్స్ (ఆర్.ఎఫ్.క్యూ)ను ఆహ్వానించింది. గంటకు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఆధునిక రైళ్ళను ప్రవేశపెట్టాలని, ఒక్కో రైలుకు కనీసంగా 16 బోగీలు ఉండాలని నిర్దేశించింది. 109 రూట్లలో ప్రారంభ స్థలం, గమ్యస్థానం.. రెండువైపుల నుంచీ సర్వీసులను నడిపే అవకాశం ప్రైవేటు వ్యక్తులకు ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ. 30,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది.

2020-07-01

చిన్న దేశమైనా భూటాన్ ఓ పాఠం చెబుతోంది. యోగా గురువు రాందేవ్ ‘కరోనా’కు మందు అంటూ విడుదల చేసిన ‘కరోనిల్’ను అనుమతించేది లేదని ఆ దేశం స్పష్టం చేసింది. ‘కరోనా’కు ఇంతవరకు మందు లేదని భూటాన్ డ్రగ్ రెగ్యులేటరీ అధారిటీ (డిఆర్ఎ) గుర్తు చేసింది. ‘కరోనా’ను తగ్గిస్తుందని చెప్పే ఏ మందునూ తమ దేశంలోని మందుల షాపులలో అనుమతించబోమని తేల్చి చెప్పింది. జలుబు మందు పేరిట ‘కరోనిల్’కు ఉత్తరాఖండ్ లో అనుమతి పొందిన రాందేవ్ కంపెనీ, ‘కరోనా’ను ఖాయంగా తగ్గిస్తుందంటూ భారీగా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించారు.

2020-06-30

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ సంస్థ ‘అమరరాజా ఇన్ఫ్రాటెక్’కు కేటాయించిన భూమిలో సుమారు సగం వెనుకకు తీసుకుంటూ జగన్ ప్రభుత్వం మంగళవారం జీవో ఎంఎస్ 33ని జారీ చేసింది. 2009లో చిత్తూరు జిల్లా యాదమర్రి మండలంలో ఈ కంపెనీకి 483.27 ఎకరాలు కేటాయించారు. అందులో 229.66 ఎకరాలు మాత్రమే వినియోగించారంటూ.. మిగిలిన 253.61 ఎకరాలను వెనుకకు తీసుకోవడానికి ఎపిఐఐసికి జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తన తండ్రి రాజశేఖరరెడ్డి సిఎంగా ఉండగా కేటాయించిన భూములను జగన్ వెనుకకు తీసుకోవడం విశేషం. జయదేవ్ తల్లి అరుణ అప్పుడు వైఎస్ ప్రభుత్వం (కాంగ్రెస్)లో మంత్రి.

2020-06-30

భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా తమిళనాడులో ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ నిర్మాణానికి చేపట్టిన టెండర్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. తమిళనాడు ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టిఎఎన్ఎఫ్ఐఎన్ఇటి) చేపట్టిన టెండర్లలో అవకతవకలపై ‘అరప్పోర్ ఇయక్కమ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. కేంద్రం గత నెలలో టెండర్లను తాత్కాలికంగా నిలిపివేసింది. టెండరు నిబంధనలు కొన్ని కంపెనీలకు మేలు చేసేలా రూపొందించారన్నది ప్రధాన ఆరోపణ. కంపెనీల అర్హతలకు సంబంధించి విధించిన వివక్షాపూరితమైన నిబంధనలను మార్చి మళ్ళీ టెండర్లను పిలవాలని కేంద్రం నిర్దేశించింది.

2020-06-27

జాత్యహంకారానికి, వలస పాలనకు ప్రతీకలుగా ఉన్నవారి విగ్రహాలు అమెరికాలో ఈ మధ్య కూలిపోతున్నాయి. వాటి పరిరక్షణకోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వును తాజాగా జారీ చేశారు. స్మారక చిహ్నాలు, విగ్రహాలు ధ్వంసం చేస్తే దీర్ఘకాల జైలు శిక్షలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఉత్తర్వుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇంతకు ముందే ఉన్న ‘వెటరన్స్ మెమోరియల్ ప్రిజర్వేషన్ యాక్ట్’కు, తాజా ఉత్తర్వుకు తేడా ఏమిటో కూడా తెలియరాలేదు. అయితే... విగ్రహాలు, మాన్యుమెంట్లు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని గత వారం నుంచీ ట్రంప్ చెబుతున్నారు.

2020-06-27

మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం 200వ మైలు రాయిని చేరుకున్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కడ పర్యటించారు. గోడపై సంతకం చేశారు. వలసలకు వ్యతిరేకంగా మరో సంకేతాన్ని అమెరికన్లకు ఇచ్చారు. నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా.. ఇండియా, మెక్సికో వంటి దేశాలపై అధిక ప్రభావం చూపేలా హెచ్-1బి, హెచ్-2బి, ఎల్-1 తదితర వీసాల జారీపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే.. 2016 ఎన్నికలకు ముందు, తర్వాత కూడా ట్రంప్ ప్రచారం చేసిన సరిహద్దు గోడ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 1954 మైళ్ళలో ఇప్పటికి కేవలం 200 మైళ్ళు పాత కంచెను తొలగించి కొత్తది నిర్మించారు.

2020-06-24

‘కరోనా’ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న 90 రోజుల్లో ప్రతి కుటుంబాన్నీ పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ చేయాలని సిఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం ఆదేశించారు. అనుమానం ఉన్నవారి నుంచి ‘కోవిడ్’ నమూనాను సేకరించాలని, మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడానికి పరీక్షలు నిర్వహించి అక్కడే మందులు ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం 104 వాహనాలను వినియోగించుకోవాలని, ఈ వాహనాల ద్వారా ప్రతి గ్రామంలో నెలలో ఒక్కసారైనా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

2020-06-22
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 Last Page