హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఊపులో కేసీఆర్ ఆర్టీసీ ప్రైవేటీకరణపై సత్వర నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో 7000 (ప్రైవేటు) బస్సులకు రూటు పర్మిట్లు మూడు రోజుల్లో ఇస్తామని గురువారం ప్రకటించారు. దానికి కేబినెట్ నిర్ణయం కూడా అవసరం లేదని, తాను రవాణా శాఖ మంత్రితో చర్చించి ఒక్క సంతకం చేస్తే సరిపోతుందని కేసీఆర్ చెప్పారు. ఆర్టీసీ అయినా.. ప్రైవేటు అయినా ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడం ముఖ్యమని చట్టాలు చెబుతున్నాయని సిఎం పేర్కొన్నారు.

2019-10-24

ఆర్టీసీలో కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటే హైకోర్టు కొడుతుందా? అని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అనూహ్యమైన ప్రశ్న వేశారు. సెప్టెంబర్ జీతాలు ఇవ్వలేదని ఒక యూనియన్ పిటిషన్ వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ కేసీఆర్ ఈ వ్యాఖ్య చేశారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి పండుగ సమయంలో రోజుకు రూ. 100 కోట్లకు పైగా అదనపు ఆదాయం వచ్చేదని, అదే సమయంలో సమ్మె చేయడం ద్వారా అదనపు నష్టాన్ని తెచ్చి పెట్టారని మండిపడ్డారు. యూనియన్లు లేకుండా ఆర్టీసీ సరిగ్గా పని చేస్తే లక్ష రూపాయలు బోనస్ తీసుకునే పరిస్థితి వస్తుంది.

2019-10-24

ఆర్టీసీ సమ్మె ముగియడం కాదని, ఆర్టీసీనే ముగిసిపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనియన్ ఎన్నికల్లో ఓట్లకోసం ప్రతిసారీ చేసే చిల్లర రాజకీయాల్లో భాగంగానే ఈ సమ్మె జరుగుతోందని కేసీఆర్ ఆరోపించారు. నాలుగేళ్లలో జీతాలు 67% పెంచిన ఆర్టీసీ మరే రాష్ట్రంలోనైనా ఉందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. తిన్నది అరగక సమ్మె చేస్తున్నారా? అని కూడా కేసీఆర్ మండిపడ్డారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో విజయం నేపథ్యంలో కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు.

2019-10-24

కేంద్ర ప్రభుత్వం రబీలో పండే గోధుమలకు కనీస మద్దతు ధరను రూ .85 రూపాయలు పెంచింది. ఇంతకు ముందు క్వింటాల్‌కు రూ. 1840 ఉండగా ఈ నిర్ణయంతో రూ. 1,925కి పెరగనుంది. పప్పుధాన్యాల మద్ధతు ధరలను క్వింటాల్‌కు రూ .335 వరకు పెంచింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) సమావేశంలో ఈమేరకు నిర్ణయాలు తీసుకున్నారు. బార్లీ మద్ధతు ధరను రూ. 85 (రూ. 1440 నుంచి 1525కు), కందుల ధరను రూ. 325 (రూ. 4475 నుంచి రూ. 4800కు) పెంచారు.

2019-10-23

సమ్మె విరమించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ ఇన్చార్జ్ పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయభాస్కర్ ఆర్టీసీ కార్మికులను కోరారు. సమ్మె 19వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూనే, సమ్మెను ప్రేరేపిస్తున్న యూనియన్ నేతల వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులతో గతంలో తామూ కలసి పని చేశామని, ప్రజలను ఇబ్బంది పెట్టాలన్నది వారి మనస్తత్వం కాదని వినయభాస్కర్ వ్యాఖ్యానించారు.

2019-10-23

ప్రభుత్వంలో కార్పొరేషన్ విలీనం మినహా మిగిలిన డిమాండ్లను పరిశీలించేందుకు తెలంగాణ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఒక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టుకు నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో... ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్లో అధికారులతో సమీక్ష జరిపారు. కార్మికులు విలీనంపైనే పట్టబట్టబోమని హైకోర్టులో విచారణ సందర్భంగా చెప్పినట్టు ఈ సమావేశంలో అధికారులు చెప్పారు.

2019-10-22

సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని రూ. 55,548.87 కోట్లుగా ఆమోదించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో అమిత్ షాను కలసిన సిఎం... భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకే రూ. 33 వేల కోట్లు ఖర్చవుతాయని వివరించారు. అందులో రూ. 16 వేల కోట్లను ఈ ఏడాదే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుపై ఇప్పటికే ఖర్చు చేసిన రూ. 5,073 కోట్లను విడుదల చేయాలని కూడా జగన్ కోరారు.

2019-10-22

మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి మట్టం పెరగడంతో తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని వదిలారు. శ్రీరాంసాగర్ నుంచి దిగువకు నీరు వదలడం మూడేళ్ళలో ఇదే మొదటిసారి. మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగావ్, అముదుర, గైక్వాడ్, బాబ్లీ ప్రాజెక్టులు నిండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరు భారీగా వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1091 అడుగులు కాగా ఆదివారం రాత్రికి రిజర్వాయర్ నిండింది. దీంతో తొలుత 8 గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

2019-10-21

2018 బ్యాచ్ ఐఎఎస్ అధికారుల్లో తెలంగాణ రాష్ట్రానికి ఏడుగురిని కేటాయించారు. కర్నాటి వరుణ్ రెడ్డి (మాతృ రాష్ట్రం తెలంగాణ), చిత్రా మిశ్రా (తెలంగాణ), పాటిల్ హేమంత్ కేశవ్ (మహారాష్ట్ర), గరిమ అగర్వాల్ (మధ్యప్రదేశ్), దీపక్ తివారీ (ఉత్తరాఖండ్), అంకిత్ (ఉత్తరప్రదేశ్), ప్రతిమా సింగ్ (ఉత్తరాఖండ్) కొత్తగా తెలంగాణ కేడర్ ఐఎఎస్ అధికారులయ్యారు.

2019-10-17

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కేడర్ కు కేటాయించిన కొత్త (2018 బ్యాచ్) ఐఎఎస్ అధికారుల్లో చాహత్ బాజ్ పాయ్ (మాతృ రాష్ట్రం మధ్యప్రదేశ్), జి. సూర్య ప్రవీణ్ చంద్ (ఏపీ), భావన (హరియాణా), మల్లారపు నవీన్ (ఆంధ్రప్రదేశ్), వి. అభిషేక్ (తమిళనాడు), అపరాజితా సింగ్ సిన్సిన్ వార్ (రాజస్థాన్), ఎన్. జయకుమరన్ (తమిళనాడు), సి. విష్ణుచరణ్ (ఆంధ్రప్రదేశ్), నిధి మీనా (రాజస్థాన్), కట్టా సింహాచలం (ఆంధ్రప్రదేశ్), వికాస్ మర్మత్ (రాజస్థాన్) ఉన్నారు.

2019-10-17
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 Last Page