మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినవారికి 21 రోజుల్లోనే ఉరిశిక్ష పడేలా కొత్త చట్టం తెస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి భావాద్వేగభరిత ప్రసంగం చేశారు. హైదరాబాద్ గ్యాంగ్ రేప్ ఉదంతాన్ని ప్రస్తావించిన జగన్, ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా తాను ఆ బాధితురాలి బాధను అర్ధం చేసుకోగలనని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాల కేసుల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామని సిఎం ప్రకటించారు.

2019-12-09

దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్.పి.డి.సి.ఎల్)ను విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెం. 41) జారీ చేసింది. విజయవాడ కేంద్రంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేకంగా మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (సి.పి.డి.సి.ఎల్)ను ఏర్పాటు చేసింది. దీంతో ఎస్.పి.డి.సి.ఎల్. పరిధి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు పరిమితమైంది. రాష్ట్ర విభజన తర్వాత మొత్తం 8 జిల్లాలతో ఎస్.పి.డి.సి.ఎల్, గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు 5 జిల్లాలతో ఇ.పి.డి.సి.ఎల్. ఏర్పాటయ్యాయి.

2019-12-05

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ నీలం సాహ్ని నియమితులయ్యారు. విభజన తర్వాత మిగిలిన రాష్ట్రానికి ఆమె తొలి మహిళా సీఎస్. మొన్నటిదాకా ఆమె కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. అక్కడ రిలీవ్ కాగానే రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆమె నియామక ఉత్తర్వులను జారీ చేసింది. ఎల్.వి. సుబ్రహ్మణ్యాన్ని తప్పించిన తర్వాత ప్రధాన కార్యదర్శి విధులను తాత్కాలికంగా నిర్వర్తిస్తున్న నీరబ్ కుమార్ నుంచి నీలం సాహ్ని గురువారం బాధ్యతలను స్వీకరించనున్నారు.

2019-11-13

తెలంగాణ ఆర్టీసీ వ్యవహారం మరో కొత్త మలుపు తిరిగింది. అసలు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ విభజనే జరగలేదని, తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటుకు తాము అనుమతే ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు తెలిపింది. దీంతో తెలంగాణ ఆర్టీసీ ఉనికే ప్రశ్నార్ధకమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలోనే తమకు 31 శాతం వాటా ఉందన్న కేంద్రం, తమ అనుమతి ఉంటేనే ఆ సంస్థ విభజన జరుగుతుందని హైకోర్టుకు స్పష్టం చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ పొంతన లేని వాదన వినిపించారు.

2019-11-07

‘అగ్రిగోల్డ్’లో బాధితుల్లో రూ. 10 వేల లోపు డిపాజిట్ చేసినవారికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేపట్టింది. గురువారం గుంటూరులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా చెల్లింపులను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 10 వేల లోపు డిపాజిట్ చేసినవారు 3.7 లక్షల మంది ఉండగా వారికోసం రూ. 264 కోట్లు కేటాయించినట్టు సిఎం చెప్పారు. త్వరలో రూ. 20 వేల వరకు డిపాజిట్ చేసినవారికి, ఆ తర్వాత ప్రతి డిపాజిటర్ కూ వారి సొమ్ము అందజేస్తామని జగన్ హామీ ఇచ్చారు.

2019-11-07

ప్రధాన కార్యదర్శి స్థానం నుంచి తప్పించిన తర్వాత బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ డీజీగా బాధ్యతలు స్వీకరించడానికి సీనియర్ ఐఎఎస్ అధికారి విముఖంగా ఉన్నారు. నెల రోజుల పాటు సెలవు పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. డిసెంబర్ 6 వరకు సెలవులో ఉంటారని తెలిసింది. ఎల్.వి.ని సీఎస్ స్థానం నుంచి తప్పిస్తూ... సాధారణ పరిపాలనా శాఖ రాజకీయ విభాగం బాధ్యతలు (అదనపు) నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మొన్న ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.

2019-11-06

మంగళవారం అర్ధరాత్రిలోగా విధుల్లో చేరితేనే ఉద్యోగం ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే హెచ్చరికలు చేసినా ఆర్టీసీ కార్మికులు లెక్క చేయలేదు. డెడ్ లైన్ ముగిసేలోగా కేవలం 217 మంది విధుల్లో చేరినట్టు ఆయన సొంత పత్రిక ‘నమస్తే తెలంగాణ’ తెలిపింది. చేరినవారందరూ కూడా కార్మికులు కాదని సంఘాలు చెబుతున్నాయి. సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సుమారు 48 వేల మందిలో పట్టుమని 0.5 శాతం కూడా కేసీఆర్ హెచ్చరికలకు జడిసి విధుల్లో చేరకపోవడం గమనార్హం.

2019-11-06

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అనూహ్యంగా బదిలీ అయ్యారు. సిఎంఒ ముఖ్య కార్యదర్శి, జి.ఎ.డి. ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ కు మూడు రోజుల క్రితం సీఎస్ షో కాజ్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో... ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది. సోమవారం హఠాత్తుగా బదిలీ చేసి... తక్షణమే ఆయన సీఎస్ బాధ్యతల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించారు. ఆయనను బాపట్లలోని ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ గా నియమించింది. ఆ జీవో కూడా ప్రవీణ్ ప్రకాష్ పేరిటే జారీ అయింది.

2019-11-04

జమ్మూ కాశ్మర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దయ్యాక ఆ రాష్ట్రం అక్టోబర్ 31వ తేదీనుంచి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం శనివారం కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల కొత్త మ్యాప్ విడుదల చేసింది. దాంతోపాటు సవరించిన ‘ఇండియా పొలిటికల్ మ్యాప్’ను కూడా విడుదల చేసింది. అవిభాజ్య కాశ్మీర్ రాష్ట్రంలో 28 జిల్లాలు ఉండగా విభజిత లడఖ్ ప్రాంతంలో కేవలం రెండు (లేహ్, కార్గిల్) ఉన్నాయి. మిగిలిన జిల్లాలు కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో భాగమయ్యాయి.

2019-11-02

తెలంగాణలోని 5,100 రూట్లలో 5,100 ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆర్టీసీలో 2,100 ప్రైవేటు అద్దె బస్సులు నడుస్తున్నాయని, ఆర్టీసీ వద్ద ఉన్న 8,200 బస్సులలో 2,609 కాలం చెల్లినవని, మరికొద్ది నెలల్లో మరో 3-4 వందల బస్సులకు కాలం చెల్లుతుందని, వాటన్నిటి స్థానంలో ప్రైవేటు బస్సులకు రూటు పర్మిట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. కొత్త బస్సులు కొనే పరిస్థితి ఆర్టీసీకి లేదని స్పష్టం చేశారు.

2019-11-02
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 Last Page