సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రంజన్ గొగోయ్ పదవీ కాలంలో ‘బాబ్రీ మసీదు- రామ జన్మభూమి’ సహా వివాదాస్పద అంశాలపై అనూహ్యమైన తీర్పులు ఇచ్చారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా అవినీతి ఆరోపణలను ఎదుర్కోగా, గొగోయ్ నాయకత్వంలోని ధర్మాసనం దాదాపు ‘క్లీన్ చిట్’ ఇచ్చింది. ఈ తీర్పుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 2019 నవంబర్ 17న రిటైరైన గోగోయ్ ని నాలుగు నెలల్లోపు రాజ్యసభ సీటు వరించింది.

2020-03-16

‘కరోనావైరస్’ను విపత్తుగా గుర్తిస్తూ.. మృతుల కుటుంబాలకు ఎస్.డి.ఆర్.ఎఫ్. నుంచి రూ. 4 లక్షల పరిహారం ప్రకటించిన కేంద్ర హోం శాఖ, కొద్ది గంటల్లోనే ఆ ఉత్తర్వులను మార్చింది. తాజా సర్క్యులర్ నుంచి పరిహారం క్లాజును తొలగించింది. వైరస్ సోకినవారికి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించే రేట్ల ప్రకారం వైద్యానికి సాయం చేయాలని తొలి సర్క్యులర్ లో పేర్కొన్న కేంద్రం.. తాజా సర్క్యులర్లో ఆ అంశాన్ని కూడా తొలగించింది. వచ్చే 30 రోజుల పాటు ‘కరోనా వైరస్’ను సమర్ధవంతంగా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించింది.

2020-03-14

రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ప్రజలు గుమి కూడే అన్ని ప్రాంతాలనూ మూసివేయాలని, సెమినార్లు-సభలు సహా అన్ని ఈవెంట్లనూ మానుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. ఆర్టీసీ, మెట్రో రైలు, సూపర్ మార్కెట్లు, మాల్స్ మాత్రమే పని చేస్తాయని ఆయన చెప్పారు. ఇప్పటికే ముహూర్తాలు పెట్టుకున్న పెళ్లిళ్లను 31వరకు అనుమతించాలని, ఆ తర్వాత పెళ్లిళ్ళు కూడా వద్దని, ఎవరూ కళ్యాణ మండపాలను ఇవ్వొద్దని కేసీఆర్ హుకుం జారీ చేశారు. సినిమా హాళ్ళు, క్లబ్బులు, ప్రైవేటు కోచింగ్ సెంటర్లు సహా అన్నీ మూతపడాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

2020-03-14

‘కరోనా వైరస్’ను నియంత్రించే చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం పర్యాటక, వైద్య వీసాలన్నిటినీ సస్పెండ్ చేసింది. ఏప్రిల్ 15 వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుంది. వీసా లేకపోయినా అనుమతించే నాన్ ఒసిఐ (ఓవర్సీస్ సిటిజెన్ షిప్ ఆఫ్ ఇండియా) కార్డుదారులకు కూడా ఈ నిషేధం వర్తిస్తుంది. విదేశీ ప్రయాణాలను మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం పౌరులందరికీ సూచించింది. ప్రవాస భారతీయులు కూడా ఇండియాకు రావడం మానాలని స్పష్టం చేసింది. విదేశాల నుంచి తిరిగి వచ్చినవారిని 14 రోజులు ‘క్వారంటైన్’లో ఉంచుతామని స్పష్టం చేసింది.

2020-03-11

గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నందున ఈ నెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల్లో మద్యం పంపిణీని నియంత్రించాలని ప్రభుత్వం ఆదేశించగా, చిత్తశుద్ధి ఉంటే షాపులు మూసివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన ప్రభుత్వం, ఆ డిమాండుకు అనుగుణంగా స్పందించింది. ఎంపిటిసి, జడ్.పి.టి.సి.లకు ఈ నెల 21న, మున్సిపాలిటీలకు 23న, పంచాయతీలకు 27, 29 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది.

2020-03-09

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్)ను అమ్మే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్ సభలో చిరాగ్ కుమార్ పాశ్వాన్ అడిగిన ప్రశ్నకు బుధవారం కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ బదులిచ్చింది. బిఎస్ఎన్ఎల్ రుణ బాధ్యతలు గత ఏడాది మార్చినాటికి రూ. 35,729 కోట్లకు పెరిగినట్టు మరో ప్రశ్నకు సమాధానంగా కేంద్రం వెల్లడించింది. 2016 మార్చి 31 నాటికి రూ. 1,02,460 కోట్లుగా ఉన్న సంస్థ నికర విలువ మూడేళ్ల తర్వాత 74,734 కోట్లకు తగ్గిపోయినట్టు పేర్కొంది. అప్పులే అందుకు కారణమని కేంద్రం తెలిపింది.

2020-03-05

పారదర్శకంగా పరిపాలిస్తానని ప్రమాణ స్వీకార వేదికపై నొక్కి చెప్పారు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి. కానీ, ప్రభుత్వంలో పారదర్శకత లేమికి నిదర్శనంగా చెప్పుకునే రహస్య జీవోలకు మాత్రం అడ్డుకట్ట పడలేదు. మంగళవారం అర్దరాత్రికి కొద్ది నిమిషాల ముందు ఒక్క పంచాయతీరాజ్ శాఖలోనే 10 రహస్య జీవోలను జారీ చేశారు. అవన్నీ ఎంపిటిసి, జడ్.పి.టి.సి. ఎన్నికలకు సంబంధించినవేనని సమాచారం. సోమవారం కూడా రెండు రహస్య జీవోలు విడుదలయ్యాయి. ఈ రహస్య జీవోలు రిజర్వేషన్లను 50 శాతానికి తగ్గించే అంశంపై కావచ్చనే అనుమానాలున్నాయి.

2020-03-04 Read More

ఢిల్లీ మతోన్మాద దాడుల సమయంలో మరణించిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. అంకిత్ శర్మ కుటుంబంలో ఒకరికి ఢిల్లీ ప్రభుత్వంలో ఉద్యోగం ఇస్తామని కూడా ఆయన చెప్పారు. అంకిత్ శర్మ నివాసం ఉన్న చాంద్ బాగ్ ప్రాంతంలో అల్లర్లు, దహనాలు అధికంగా జరిగాయి. ఆ సందర్భంలో అంకిత్ మృతదేహం మురికి కాల్వలో దొరికిన సంగతి తెలిసిందే. ఆ కేసులో అనుమానితుడైన కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ను ‘ఆప్’ సస్పెండ్ చేసింది.

2020-03-02 Read More

‘‘సాంకేతికత అభివృద్ధి చెంది నిముషాలలో పింఛను బ్యాంక్ అకౌంట్ కు జమ చేసే విధానం ఉన్న ఈ రోజుల్లో గడప వద్ద పెన్షన్ పంపిణీ అవసరమా? ప్రభుత్వ సొమ్ము మేము సొంతంగా ఇస్తున్నాం అన్న భావన కల్పించటానికి తప్పితే దీని వలన అదనంగా కలిగే ప్రయోజనం శూన్యం’’ అని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదివారం ట్విట్టర్లో విమర్శించారు. వాలంటీర్ల ద్వారా పంపిణీని ఆయన తప్పు పట్టారు. లేవలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధులకు పోస్టాఫీసులో జమ చేసి పోస్టు మెన్ ద్వారా అందించాలని మరో ట్వీట్లో సూచించారు.

2020-03-02

మార్చి 1నే అందరికీ పెన్షన్ అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్లు ఆదివారం వేకువ జాము నుంచే పంపిణీ ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 83 శాతం మంది లబ్దిదారులకు వ్యక్తిగతంగా పెన్షన్ మొత్తాన్ని అందించారు. మొత్తం 58,00,131 పెన్షన్లు విడుదల కాగా సాయంత్రానికి 48,16,062 మందికి అందించినట్టు అధికారులు ప్రకటించారు. ‘ఇంటివద్దకే పెన్షన్’ అందించడంలో ఫిబ్రవరిలో ఎదురైన సమస్యలను ఈసారి అధిగమించినట్టు అధికారులు తెలిపారు.

2020-03-01
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 Last Page