రేషన్ కార్డులపై బియ్యానికి తోడు ఒక కేజీ పప్పు కూడా ఈ నెల ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రేషన్ బియ్యాన్ని, పప్పును 29న అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ప్రస్తుతం మనిషికి 6 కేజీల బియ్యాన్ని ఇస్తున్నారు. ఇవి కాకుండా నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి రూ. 1000 చొప్పున ఏప్రిల్ 4న వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తామని సిఎం చెప్పారు. ‘‘ఈ మొత్తం ఎక్కువ అని చెప్పను. కానీ, ఈ మాత్రం చేయడానికే రూ. 1500 కోట్లు ఖర్చవుతోంది. పరిస్థితులు గమనిస్తున్నారు కాబట్టి అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నా’’ అని జగన్ వ్యాఖ్యానించారు.
2020-03-22ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ‘లాక్ డౌన్’ ప్రకటించారు. ప్రజా రవాణా మొత్తాన్ని నిలిపివేస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. ప్రభుత్వ శాఖలను రొటేషన్ పద్ధతిలో తక్కువమందితోనే నడపాలని ఆదేశించారు. అత్యవసరం కాని షాపులు మార్చి 31 వరకు మూసివేయాలని స్పష్టం చేశారు. మరీ అవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు విన్నవించారు. తప్పనిసరి సేవలకోసం ఆటోలు తీయవలసి వస్తే.. ఇద్దరికంటే ఎక్కువమందిని ఎక్కించుకోవద్దని సూచించారు. విదేశాల నుంచి వచ్చినవారు 14 రోజుల పాటు తప్పనిసరిగా ‘హోం క్వారంటైన్’లో ఉండాలని నిర్దేశించారు.
2020-03-22ఈ నెల 31 వరకు తెలంగాణ ‘లాక్ డౌన్’ను ప్రకటించారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు. ప్రభుత్వ శాఖల్లో వైద్యం, విద్యుత్ వంటి అత్యవసర విభాగాలలో అందరూ విధులకు హాజరు కావాలని, మిగిలిన శాఖల్లో 20 శాతం చొప్పున రొటేషన్ విధానం పాటిస్తామని చెప్పారు. ప్రజారవాణా మొత్తం నిలిపివేస్తున్నామని, ఆటోలతో సహా ప్రైవేటు వాహనాలు సైతం రోడ్లపైకి రాకూడదని స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నామని, అత్యవసర సరుకులకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. పరీక్షా పత్రాలు దిద్దడంతో సహా విద్యా కార్యకలాపాలేవీ 31వరకు సాగవని చెప్పారు.
2020-03-22ఆదివారం దేశవ్యాప్తంగా పాటించిన ‘జనతా కర్ఫ్యూ’ను తమ రాష్ట్రంలో ఈ నెల 31 వరకు కొనసాగించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆహారం, మందుల వంటి అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఆదివారం చెప్పారు. మరికొన్ని రాష్ట్రాలు ఆ పేరు వాడకుండానే 31 వరకు అత్యవసర సేవలు మినహా అన్నిటినీ బంద్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణ సిఎం కేసీఆర్, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఆయా రాష్ట్రాల్లో తీసుకోబోయే చర్యలను ప్రకటించనున్నారు.
2020-03-22ఆపత్సమయాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం ఎలా వ్యవహరించాలో కేరళ సిఎం పినరయి విజయన్ మరోసారి చూపించారు. ‘కరోనా వైరస్’పై పోరాటానికి స్థానిక సంస్థల ప్రతినిధులను సిద్ధం చేసే ప్రయత్నంలో ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితలను భాగస్వామిని చేశారు. గురువారం వారిద్దరూ కలసి మీడియా సమక్షంలో కేరళ విద్యా శాఖ ఛానల్ ‘విక్ట్రెస్’ ద్వారా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉద్ధేశించి ప్రసంగించారు. ‘కరోనా’పై అవగాహన పెంచడంలో, ‘హోమ్ క్వారంటైన్’లో ఉన్న 26,000 మందిని పర్యవేక్షించడంలో కేరళ స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
2020-03-20ఉగాదికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్న ప్రభుత్వం, ‘కరోనా వైరస్’ కారణంగా ఆ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14కు వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం వెల్లడించింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టాలు పంపిణీ చేస్తామని తాజాగా తెలిపింది. పట్టాల పంపిణీకి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వాయిదా వేయడం వ్యూహాత్మకం. రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనకు వ్యతిరేకంగా.. దళిత సంఘాల నాయకత్వలో అధికార పార్టీ ఓ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. రాజధాని భూముల్లో ఇళ్ళ పట్టాల పంపిణీకి ‘అంబేద్కర్ జయంతి’ మంచి సందర్భంగా అధికార పార్టీ భావిస్తోంది.
2020-03-20‘కరోనా’ కాలంలో ప్రజల తక్షణ అవసరాలను తీర్చడం, కొనుగోలు శక్తి పడిపోకుండా చూడటం అన్న జమిలి లక్ష్యాలతో కేరళ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ. 14,000 కోట్లను ఏప్రిల్ లోగా విడుదల చేయనుంది. కుదుంబశ్రీ పథకం కింద రూ. 2000 కోట్ల రుణాలు, ఉపాధి హామీకి రూ. 2000 కోట్లు కేటాయించింది. ఆరోగ్య సాయంకోసం రూ. 500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ప్రజలు చెల్లించాల్సిన విద్యుత్, నీటి బిల్లుల గడువును సడలించడం, ప్రయాణీకుల వాహనాలకు పన్ను రాయితీ వంటి చర్యలను ప్రకటించింది.
2020-03-19‘కరోనా’ మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఇళ్ళకు పరిమితమయ్యే ప్రజలను ఆదుకోవడానికి కేరళ ప్రభుత్వం రూ. 20,000 కోట్ల విలువైన ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. సామాజిక పింఛన్లు రాని కుటుంబాలకు నెలకు రూ. 1000 చొప్పున ఇచ్చేందుకు రూ. 1320 కోట్లను కేటాయించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం ప్రకటించారు. పెన్షన్లు వచ్చేవారికి 2 నెలల కిస్తీలను ఈ నెలలోనే చెల్లిస్తామని ఆయన చెప్పారు. ధనిక-పేద తేడా లేకుండా అందరికీ ఉచిత బియ్యం, 1000 సబ్సిడీ భోజనశాలలను ఏప్రిల్ లోగా ప్రారంభించడం వంటి అనేక చర్యలను సిఎం ప్రకటించారు.
2020-03-19రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ భద్రతను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా 1+1గా ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని 4+4కి పెంచారు. నిన్న (మార్చి 18న) రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాసినట్టుగా ఉన్న ఓ లేఖలో భద్రతపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం ఈ లేఖ అంశమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ లతో సమావేశమయ్యారు. రమేష్ కమార్ కుటుంబానికి భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం.
2020-03-19సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయ్యాక నాలుగు నెలలకు రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడయ్యారు. అంతకు రెండు నెలల ముందే ఆయన సోదరుడు అంజన్ గొగోయ్ కి ఓ పదవి దక్కింది. రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అంజన్ గొగోయ్ ని ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి సభ్యుడిగా నియమిస్తూ జనవరిలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉత్తర్వులిచ్చారు. 8 రాష్ట్రాల అభివృద్ధికి సలహా మండలిలా పని చేసే ఈ వ్యవస్థలో సభ్యునిగా మాజీ ఆర్మీ అధికారిని నియమించడం ఇదే తొలిసారి. అంజన్ గొగోయ్ 2013లో పదవీ విరమణ చేస్తే.. ఏడేళ్లకు మరింత పెద్ద హోదాలో నియమించడం గమనార్హం.
2020-03-18