తెలంగాణలో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలకు ఆందోళన అక్కర్లేదని, హాస్టళ్ల మూసివేత ఉండదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చెప్పారు. ఎక్కడివాళ్ళు అక్కడే ఉండిపోవాలని సూచించారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలుతున్న ప్రజలతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులతో సహా ఎవరూ ఆకలితో ఉండకూడదని, వారికి షెల్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల వారు ఎక్కువమంది హైదరాబాద్, చుట్టూ ఉన్న 9 కార్పొరేషన్ల పరిధిలోనే ఉన్నారని చెప్పారు.
2020-03-27నిత్యావసరాలు లేదా ఇతరత్రా సమస్యలు ఎదురైతే 1902కు ఫోన్ చేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సూచించారు. 10 ప్రభుత్వ శాఖల అధికారులు, ముగ్గురు మంత్రులు, సిఎం కార్యాలయ అధికారులు ఆ కంట్రోల్ రూములో ఉంటారని చెప్పారు. నిత్యావసరాలకోసం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బయటకు రావచ్చని, అయితే.. ఇతరేతర పనులపై మాత్రం రావద్దని స్పష్టం చేశారు. రైతులు, రైతుకూలీలు కూడా తప్పనిసరి అయితేనే బయటకు రావాలని సూచించారు. క్రమశిక్షణతోనే ‘కరోనా’ను గెలవగలమని, నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందన్న విషయం కొన్ని దేశాల్లో చూస్తున్నామని పేర్కొన్నారు.
2020-03-26‘కరోనా’ మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించడానికి దేశమంతా ‘లాక్ డౌన్’ విధిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి ఎవరూ ఇల్లు వదలి బయటకు రావద్దని హుకుం జారీ చేశారు. 21 రోజుల పాటు (ఏప్రిల్ 14వరకు) ఈ నిషేధం కొనసాగుతుందని, ఇది నిర్బంధ కర్ఫ్యూ వంటిందని, జనతా కర్ఫ్యూ కాదని మోడీ చెప్పారు. మంగళవారం రాత్రి 8.00 గంటలకు ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా చాలా భయంకరమైన మహమ్మారి అని, ఒక్కరి నుంచి మొదలై లక్షల మందికి వ్యాపించిందని చెప్పారు. ఇంటినుంచి బయటకు అడుగుపెట్టడం అంటే.. కరోనాను ఇంటికి తెచ్చుకోవడమేనని మోడీ వ్యాఖ్యానించారు.
2020-03-24విదేశాలనుంచి వచ్చినవారు ‘క్వారంటైన్’లో ఉండకపోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వారంటైన్ల నుంచి తప్పించుకుంటున్నవారిని సమాజానికి శత్రువులుగా అభివర్ణించారు. విదేశాల నుంచి వచ్చిన అందరి పాస్ పోర్టులూ సీజ్ చేయాలని ఆదేశించానని, ఎక్కువ చేస్తే పాస్ పోర్టులను సస్పెండ్ చేయిస్తామని హెచ్చరించారు. సమాజానికి శత్రువులుగా పరిణమించినవారు సమాజం కల్పించిన సదుపాయాలను పొందడానికి అనర్హులని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నిర్మల్ లో క్వారంటైన్ నుంచి ఒకే వ్యక్తి మూడుసార్లు తప్పించుకున్నాడని చెప్పారు.
2020-03-24జనతా కర్ఫ్యూ తర్వాత తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా కర్ఫ్యూ విధించింది. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయట కనిపించడానికి వీల్లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హుకుం జారీ చేశారు. మంగళవారం రాత్రి 7.40 గంటలకు మీడియాతో మాట్లాడిన కేసీఆర్, ఇప్పటికే కర్ఫ్యూ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. నిత్యావసరాల దుకాణాలన్నీ సాయంత్రం 6 గంటలకే మూసేయాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లైసెన్సులు రద్దవుతాయని హెచ్చరించారు. ఇక బ్రతిమాలే పరిస్థితి లేదని, ‘కనిపిస్తే కాల్చివేత’ వరకు తెచ్చుకోవద్దని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
2020-03-24‘కరోనా వైరస్’ వ్యాప్తి వేగవంతం కావడంతో ఇండియాలో 100 కోట్ల మందికి పైగా ప్రజలు పూర్తి స్థాయి ఆంక్షల పరిధిలోకి వచ్చారు. కేంద్రం సూచనను అనుసరించి... 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పూర్తి ‘లాక్ డౌన్’ ప్రకటించాయి. మరో 3 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పరిమిత ‘లాక్ డౌన్’ను అమలు చేస్తున్నాయి. మొత్తంగా 548 జిల్లాలు పూర్తి స్థాయి ఆంక్షల పరిధిలోకి రాగా 58 జిల్లాలు పాక్షిక నిర్బంధంలో ఉన్నాయి. దేశంలో 471 ‘పాజిటివ్’ కేసులు నమోదైనట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సోమవారం రాత్రి ప్రకటించింది.
2020-03-23నిత్యావసరాలకోసం ఇంటికి ఒక్కరికి మాత్రమే.. అదీ ఇంటినుంచి 3 కిలోమీటర్ల లోపే.. అనుమతించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘కరోనా’ కట్టడిపై సోమవారం సమీక్ష అనంతరం ఆంక్షలను కఠినతరం చేశారు. విశాఖ విమ్స్, విజయవాడ, తిరుపతి, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రులలో 1300 బెడ్లు అందుబాటులోకి వస్తున్నాయని, 150 వెంటిలేటర్లతో ఐసియు యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో మరో 200 వెంటిలేటర్లతో అదనపు యూనిట్లు ఏర్పాటవుతాయని అధికారులు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులలో 450 వెంటిలేటర్లను సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
2020-03-23‘కరోనా’ వ్యాప్తి నిరోధంకోసం అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన ప్రభుత్వం, ఈ నెల 25వ తేదీనుంచి దేశీయ విమాన ప్రయాణాన్నీ నిషేధించింది. మంగళవారం రాత్రి 11.59 నిమిషాల కల్లా అన్ని విమానాలు నేలపైకి దిగాలని కేంద్ర విమానయాన శాఖ సోమవారం ఆదేశించింది. అయితే, సరుకు రవాణా విమానాలకు ఈ నిషేధం వర్తించదు. ప్రయాణీకుల విమాన సర్వీసులను ఎప్పుడు పునరుద్ధరించేదీ సోమవారం చెప్పలేదు. ఇండియాలో కరోనా యాక్టివ్ కేసులు 415కి పెరగడంతో చర్యలు తీవ్రతరమయ్యాయి. మార్చి 20న అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించారు.
2020-03-23 Read More‘కరోనా’ పెద్ద ప్రమాదకారి కాదనే వాదన నుంచి ‘లాక్ డౌన్’ వరకు వచ్చారు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి. మంచిదే..! అయితే, ‘కరోనా’ తీవ్రతను కొట్టిపారేసిన రోజు ఏ లెక్కలు చెప్పారో ‘లాక్ డౌన్’ రోజూ అవే చెప్పారు. వైరస్ సోకినవారిలో 80.9% మందికి ఇంట్లోనే నయమవుతోందని, కేవలం 4.7% మాత్రమే ఐసియులలో చేరితే..మరణాల రేటు 2% ఉందని చెప్పుకొచ్చారు. మరి వాస్తవం ఏమిటి? ఇటలీలో నిన్నటికి 53,578 మందికి వైరస్ సోకితే 4,825 మంది చనిపోయారు. అంటే, 9% ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ లో 7.79%, స్పెయిన్ లో 6.02%, చైనాలో 4% మరణించారు. ప్రపంచ సగటు తీసుకుంటే మరణాల రేటు 4.3%.
2020-03-22‘కరోనా వైరస్’ కట్టడికోసం లాక్ డౌన్ ప్రకటించిన కేసీఆర్, ప్రైవేటు కంపెనీలకు ఓ హెచ్చరిక చేశారు. ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితుల్లో.. ఈ వారానికి కూడా వేతనం చెల్లించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల్లో కోత ఉండదని, అలాగే ప్రైవేటు కంపెనీలు, సంస్థలు కూడా వేతనాన్ని చెల్లించాలని ఆదేశించారు. ఇది కంపెనీల సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలోని ఆసుపత్రులలో అత్యవసరం కాని సర్జరీలను వాయిదా వేయాలని, వైన్ షాపులను కూడా బంద్ చేయాలని ఆదేశించారు.
2020-03-22