లడాక్ లోని గాల్వన్ వ్యాలీలో ఇండియా, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తత ఆందోళనకర స్థాయికి చేరింది. సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో భారత ఆర్మీ అధికారి ఒకరు, ఇద్దరు జవాన్లు మరణించారు. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు జరుగుతుండగా సోమవారం గాల్వన్ లోయలో హింసాత్మక ఘర్షణ జరిగినట్టు భారత ఆర్మీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం (మంగళవారం) ఇరు దేశాల సీనియర్ మిలిటరీ అధికారులు సమావేశమైనట్టు ఆ ప్రకటనలో తెలిపారు. గాల్వన్ వ్యాలీ, పాంగాంగ్ ట్సో ప్రాంతాల్లో చైనా సైనికులు ‘భారత భూభాగం’లోకి చొరబడిన సంగతి తెలిసిందే.

2020-06-16

అమెరికా అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ ‘ఎఫ్-35ఎ’లో కదన రంగానికి వెళ్లిన తొలి మహిళగా ఆ దేశ పైలట్ కెప్టెన్ ఎమిలీ థాంప్సన్ రికార్డుల్లో చేరారు. ఇటీవల యుఎఇలోని అల్ ధఫ్రా వైమానిక స్థావరం నుంచి మధ్యప్రాఛ్యంలోని ఓ ప్రాంతానికి ఆమె ‘ఎఫ్-35ఎ లైటెనింగ్ 2’లో వెళ్ళారు. ఆ ప్రాంతం పేరును అమెరికా ఎయిర్ ఫోర్స్ వెల్లడించలేదు. ఈ విన్యాసంలో ఎమిలీకి సహకరించిన మెయింటెనెన్స్ సిబ్బంది కూడా అంతా మహిళలే. థాంప్సన్ విద్యాభ్యాసం తర్వాత ఎఫ్-16 పైలట్ గా ఏడాదిన్నర శిక్షణ పొందారు. తర్వాత ‘ఎఫ్-35ఎ’కి బదిలీ అయ్యారు. సహచరులు ‘బంజాయ్’గా పిలుచుకునే ఎమిలీ కదన రంగానికి యుద్ధ విమానాన్ని నడపడం ఇదే తొలిసారి.

2020-06-12

‘గణనీయమైన సంఖ్య’లో చైనా సైనిక దళాలు తూర్పు లడఖ్ ప్రాంతంలోకి ప్రవేశించాయని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం అంగీకరించారు. దాదాపు నెల రోజుల క్రితం.. గాల్వన్ లోయ, పాంగాంగ్ ట్సో ప్రాంతాల్లోకి 5000 నుంచి 10,000 మంది చైనా సైనికులు ప్రవేశించి బంకర్లు, రోడ్లు నిర్మించినట్టు రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. 6వ తేదీన ఇరు దేశాల సైన్యంలోని ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్టు రాజ్ నాథ్ చెప్పారు. కాగా, మేజర్ జనరల్ స్థాయిలో మంగళవారం చర్చలు జరిగినట్టు సమాచారం.

2020-06-02

యుద్ధం వద్దన్నందుకు సొంత దేశంలో విద్యార్ధులను కాల్చి చంపిన ఘటన అమెరికా చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది. ‘కెంట్ రాష్ట్ర నరమేధం’గా చరిత్రకెక్కిన కాల్పులు జరిగి నేటికి సరిగ్గా 50 సంవత్సరాలు. వియత్నాంతో సుదీర్ఘ యుద్ధాన్ని నిరసిస్తూ అమెరికాలో ‘శాంతి’ ర్యాలీలు జరుగుతున్న కాలం అది. కాంబోడియాపై అమెరికా సైన్యం భారీగా బాంబులు వేయడాన్ని నిరసిస్తూ.. కెంట్ స్టేట్ యూనివర్శిటీ వద్ద 1970 మే 4న విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. వారిపైన అనూహ్యంగా అమెరికా నేషనల్ గార్డ్ సైనికులు కాల్పులు జరిపారు. నలుగురు విద్యార్ధులు చనిపోగా 9 మంది గాయపడ్డారు.

2020-05-04

ఉభయ కొరియాల సరిహద్దులోని నిస్సైనిక ప్రదేశం (డిఎంజెడ్)లో కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం ఉదయం ఉత్తరకొరియా వైపు నుంచి తమ గార్డులు ఉన్న పోస్టుపై కాల్పులు జరిగాయని, ప్రతిగా తమ సిబ్బంది రెండు రౌండ్లు కాల్చారని దక్షిణకొరియా సైనికాధికారులు చెప్పారు. దక్షిణకొరియా పోస్టులో ఉన్న గార్డు గాయపడినట్టు ‘యోన్హాప్’ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఎవరూ మరణించినట్టు సమాచారం లేదని ఆ దేశ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు.

2020-05-03

‘కరోనా’పై యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది గౌరవార్ధం అమెరికా సైన్యం యుద్ధ విమానాలతో దేశంలోని ప్రధాన నగరాల్లో విన్యాసాలు చేపట్టింది. న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ వరకు ప్రధాన నగరాల్లో ముఖ్యమైన ప్రదేశాలు, ఆసుపత్రులపై విహరించిన యుద్ధ విమానాలు.. వైద్య సిబ్బందికి వందనం సమర్పించాయి. తాజాగా వాషింగ్టన్ నగరంలో శ్వేతసౌథం దగ్గరగా విహరిస్తున్న అమెరికా నేవీ ‘బ్లూ ఏంజెల్స్’, ఎయిర్ ఫోర్స్ ‘థండర్ బర్డ్స్’ను ఈ చిత్రంలో చూడొచ్చు. #AmericaStrong #InThisTogether సందేశాలను మోస్తూ యుద్ధ విమానాలు దేశమంతా విహరించాయి.

2020-05-03

2020-21 భారత రక్షణ బడ్జెట్లో వేతనాలు మినహా మిగిలిన వ్యయాన్ని కనీసంగా 20 శాతం, గరిష్ఠంగా 40 శాతం తగ్గించే అవకాశం ఉందని తాజాగా ఓ వార్త. మంగళవారం ఢిల్లీలో రక్షణ వ్యవహారాల విశ్లేషకులతో మాట్లాడుతూ.. రక్షణ శాఖ అధికారి ఒకరు ఈ విషయం చెప్పినట్టుగా ‘బిజినెస్ స్టాండర్డ్’ రాసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వ్యయాన్ని కేవలం 15-20 శాతానికి పరిమితం చేయాలని మిలిటరీని ఆదేశించినట్టు ఆమె (రక్షణ అధికారి) చెప్పారు. ఏడాది మొత్తం మిలిటరీ వ్యయంలో 20 శాతం కోత విధిస్తే రూ. 40,000 కోట్లు, 40 శాతం కోత పెడితే ఏకంగా రూ. 80,000 కోట్లు ప్రభుత్వానికి మిగులుతాయి.

2020-04-29 Read More

ప్రపంచం మొత్తంమీద ప్రభుత్వాలు చేసే అతిపెద్ద వ్యయం ఏమిటి? దీనికి తడుముకోకుండా చెప్పగలిగిన సమాధానం ‘మిలిటరీ వ్యయం’. ఈ రేసులో ఇండియా మున్ముందుకు పోతోంది. 2019లో మిలిటరీ వ్యయంలో ఇండియా మూడో స్థానానికి ఎగబాకింది. స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) తాజా నివేదిక ప్రకారం.. 2018లో 66.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇండియా మిలిటరీ వ్యయం 2019లో 71.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2017లో 5వ స్థానం, 2018లో 4వ స్థానం, 2019లో 3వ స్థానంతో ఏడాదికో ర్యాంకు ఎగబాకిన ఇండియా..ఇంతకు ముందే రష్యాను, తాజాగా సౌదీ అరేబియాను వెనుకకు నెట్టింది. 732 బిలియన్ డాలర్లతో అమెరికా, 261 బిలియన్ డాలర్లతో చైనా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

2020-04-27

మ్యాన్మార్ తీవ్రవాద సంస్థ అరాకన్ ఆర్మీ ప్రముఖుడి ఇంటర్వ్యూ ప్రచురించినందుకు ‘వాయిస్ ఆఫ్ మ్యాన్మార్’ ఎడిటర్ ఇన్ చీఫ్ నే మ్యో లిన్ జీవిత ఖైదు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయనపై ‘ఉగ్రవాద’ అభియోగాలు మోపారు. మంగళవారం మాండలే కోర్టులో ఆయనను హాజరుపరిచారు. ఉగ్రవాద సంస్థలు భయాన్ని వ్యాపింపజేయడానికి సహకరించారన్నది ఒక ఆరోపణ. అరాకన్ ఆర్మీ (ఎఎ)ని మ్యాన్మార్ ప్రభుత్వం మార్చి 23న ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ తర్వాత సంస్థ ప్రముఖుడొకరి ఇంటర్వ్యూను మార్చి 27న ‘వాయిస్ ఆఫ్ మ్యాన్మార్’ ప్రచురించింది. లిన్ గతంలో బిబిసి బర్మీస్ న్యూస్ కోసం పని చేశారు.

2020-03-31

అమెరికా ఆయుధాల ఎగుమతులు అసాధారణంగా పెరుగుతూనే ఉన్నాయి. 2010-14, 2015-19 మధ్య కాలంలో అమెరికా ఎగుమతులు 23% పెరిగాయి. అదే కాలంలో రష్యా ఎగుమతులు 18% శాతం తగ్గాయి. ఇండియా మార్కెట్ పోవడమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా ‘సిప్రి’ తాజా నివేదిక విశ్లేషించింది. ఆయుధ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా వాటా 31% నుంచి 36%కి పెరిగితే... రెండో స్థానంలో ఉన్న రష్యా వాటా 27% నుంచి 21% శాతానికి తగ్గింది. ఫ్రాన్స్ వాటా 4.8% నుంచి గణనీయంగా (7.9%) పెరిగింది. అమెరికా ఆయుధాలను కొన్న దేశాల సంఖ్య 96కు పెరిగింది.

2020-03-09 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 Last Page