ఇండియా సరిహద్దుల్లోకి చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్లను, పర్వతారోహణలో అనుభవం ఉన్న దళాలను పంపింది. చైనా సైన్యంలోని ఎవరెస్టు ఒలింపిక్ టార్చ్ ర్యాలీ టీమ్ సభ్యులు, మిశ్రమ మార్షల్ ఆర్ట్స్ క్లబ్ ఫైటర్లు సహా ఐదు మిలీషియా డివిజన్లు ఈ నెల 15న టిబెట్ రాజధాని లాసాలో తనిఖీకి హాజరైనట్లు మిలిటరీ పత్రిక వెల్లడించింది. ఈ కొత్త దళాల సభ్యులు వందల సంఖ్యలో బారులుతీరిన దృశ్యాలు సీసీటీవీలో ప్రసారమయ్యాయి. అదే రోజు రాత్రి అక్కడికి 1300 కి.మీ. దూరంలోని గాల్వన్ లోయలో ఘర్షణ జరిగింది. ఫైట్ క్లబ్ సభ్యుల రాకతో తమ దళాల శక్తి పెరిగిందని టిబెట్ కమాండర్ వాంగ్ హైజియాంగ్ ధీమా వ్యక్తం చేశారు.

2020-06-28

చైనాతో ఘర్షణ నేపథ్యంలో ఇండియా గగనతల రక్షణ వ్యవస్థలను తూర్పు లడఖ్ ప్రాంతానికి తరలించింది. దేశీయంగా రూపొందించిన ఆకాష్, ఇజ్రాయిల్ తయారీ స్పైడర్ (SpyDer), సోవియట్ రష్యా తయారీ పెచోరా, ఒఎస్ఎ-ఎకె క్షిపణి వ్యవస్థలను ఆ ప్రాంతంలో మోహరించింది. ఈ ఎస్ఎఎం వ్యవస్థలు ప్రత్యర్ధి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చగలవు. ఈ నెల 15 రాత్రి గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో 23 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ‘‘చైనా ఎలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడ్డా స్పందించడానికి మేము పూర్తి సన్నద్ధంగా ఉన్నాం’’ అని భారత అధికార వర్గాలు తెలిపాయి.

2020-06-28

యూరప్ నుంచి తమ సేనలను తగ్గించి ఇతర ప్రాంతాలకు పంపడానికి.. చైనాతో ఇండియా, ఇతర దేశాలు ఎదుర్కొంటున్న ప్రమాదం ఒకానొక కారణమని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. జర్మనీ నుంచి సేనల ఉపసంహరణపై గురువారం బ్రస్సెల్స్ ఫోరంలో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు పాంపియో ఈ సమాధానమిచ్చారు. చైనా పాలక కమ్యూనిస్టు పార్టీ చర్యలతో ఇండియా, వియత్నాం, మలేషియా, ఇండొనేషియాలకు ప్రమాదం ఉందని, దక్షిణ చైనా సముద్రంలో సవాలు ఎదురవుతోందని పాంపియో వ్యాఖ్యానించారు. ఆ సవాళ్ళను ఎదుర్కొనేలా అమెరికా ఆర్మీ మోహరింపు ఉంటుందని స్పష్టం చేశారు.

2020-06-26

రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయం సాధించి 75 సంవత్సరాలు గడచిన సందర్భంగా రష్యా ఈ నెల 24న నిర్వహిస్తున్న ఉత్సవాలలో పాల్గొనడానికి భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఆ దేశానికి వెళ్ళారు. అయితే, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియా తక్షణ రక్షణ అవసరాలపైన రష్యన్ ప్రభుత్వంతో సింగ్ మాట్లాడనున్నారు. గతంలో రష్యానుంచి కొనుగోలు చేసిన మిగ్-29, సుఖోయ్-30 ఎంకెఐ యుద్ధ విమానాలు, టి-90 యుద్ధ ట్యాంకులు, కిలో- క్లాస్ జలాంతర్గాముల విడి భాగాలను, మిసైల్ రక్షణ కవచం ఎస్-400 వ్యవస్థలను త్వరగా సరఫరా చేయాలని రాజనాథ్ కోరనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.

2020-06-23

టిబెట్ ప్రాంతంలో లాసా- న్యింగ్చి రైల్వే లైనులో చైనా తలపెట్టిన 120 బ్రిడ్జిలలో చివరిది తాజాగా పూర్తయింది. అరుణాచల్ ప్రదేశ్ ను ఆనుకొని ఉండే న్యింగ్చి ప్రాంతంలో నిర్మితమైన ఈ రైల్వే లైను వ్యూహాత్మకంగా చైనాకు ముఖ్యమైనది. సిచువాన్- టిబెట్ రైల్వే పరిధిలోని ఈ భాగం వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బ్రహ్మపుత్ర నదికి ఎగువ భాగం (యార్లుంగ్ జాంగ్బో నది)పై నిర్మించిన ఈ బ్రిడ్జి పొడవు 525 మీటర్లు. సముద్ర మట్టానికి 3,350 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రపంచంలో కాంక్రీట్ నిండిన స్టీల్ ట్యూబులతో నిర్మించిన ఆర్చి బ్రిడ్జిలలో ఇదే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉందని భావిస్తున్నారు.

2020-06-23

ఒక్కో ప్రాజెక్టు విలువ రూ. 500 కోట్లు మించకుండా ఆయుధాలు కొనుగోలు చేసే అధికారాన్ని త్రివిధ దళాధిపతులకు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఆయుధాలను త్వరితగతిన సేకరించేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సైనిక దళాలకు ఇలాంటి ఆర్థిక అధికారాలు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. యూరి దాడి, బాలాకోట్ సర్జికల్ దాడి సందర్భాల్లోనూ తాత్కాలికంగా ఈ అధికారాలు ఇచ్చారు. బాలాకోట్ వైమానిక దాడి కోసం స్పైస్-2000 బాంబులను ఎయిర్ ఫోర్స్ ఇలాగే కోనుగోలు చేసింది.

2020-06-21

చైనా సరిహద్దుల్లో ఆక్రమణల నిరోధానికి కఠినంగా వ్యవహరించేలా భద్రతా దళాలకు ‘పూర్తి స్వేచ్ఛ’ కల్పించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ సమావేశం తర్వాత ఈ సమాచారం బయటకు వచ్చింది. గాల్వన్ లోయను చైనా సైన్యం ఆక్రమించడం, వారి టెంట్లను తొలగించడానికి వెళ్లిన భారత సైనికులను చంపడం వంటి పరిణామాల నేపథ్యంలో ‘‘మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేద’’ని ప్రధాని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చైనా సరిహద్దుల్లో భారీగా ఆర్మీని, వాయుసేనను మోహరించింది.

2020-06-21

ఆయుధాలతో కూడిన పాకిస్తాన్ డ్రోన్ ఒకటి జమ్మూ కాశ్మీర్ లోకి చొరబడగా.. భారత సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) కూల్చివేసింది. కతువా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 8 అడుగుల వెడల్పు ఉన్న ఈ పాకిస్తాన్ డ్రోన్ లోపల అమెరికా తయారీ అధునాతన ఎం4 రైఫిల్, రెండు మ్యాగజైన్లు, 7 గ్రనేడ్లు ఉన్నాయి. ఈ ఆయుధాలను అలీభాయ్ అనే ఉగ్రవాదికి చేరవేసేందుకు (అతని పేరుతోనే) డ్రోన్ ను ఉపయోగించారు. బిఎస్ఎఫ్ పోస్టుకు ఎదురుగా పాకిస్తాన్ భూభాగంలో ఉన్న పికెట్ నుంచి ఈ డ్రోన్ ను నియంత్రించినట్టు భావిస్తున్నారు.

2020-06-20

చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో నిన్న రాత్రి జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించినట్టు ఆర్మీ మంగళవారం రాత్రి ప్రకటించింది. తొలుత ముగ్గురు మరణించినట్టు మంగళవారం ఉదయం ప్రకటించిన ఆర్మీ, రాత్రికి మరో ప్రకటన చేసింది. తీవ్రంగా గాయపడిన 17 మంది కూడా అతిశీతల వాతావరణం వల్ల మరణించారని పేర్కొంది. మరోవైపు మరణించిన, గాయపడిన చైనా సైనికుల సంఖ్య 43గా భారత అధికారులకు సమాచారం అందిందని వార్తలు వచ్చాయి. అయితే, చైనా సైన్యం మాత్రం మృతుల సంఖ్యను వెల్లడించలేదు. 1967 తర్వాత ఇరుదేశాల మధ్య ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరగడం ఇదే తొలిసారి.

2020-06-16

చైనా-ఇండియా సైనిక ఘర్షణలో జవాన్ల ప్రాణాలు పోవడం గత 45 ఏళ్ళలో ఇదే తొలిసారి. 1975 జూన్ మాసంలో చైనా సైనికుల కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు మరణించిన ఘటన తర్వాత... సోమవారం (2020 జూన్ 15) ఘర్షణలో ముగ్గురు భారత సైనికులు చనిపోయారు. 1962 యుద్ధంలో ఇండియా ఓడిపోయాక 1967 సిక్కిం ఘర్షణల్లో చైనాకు ఎక్కువ ప్రాణ నష్టం వాటిల్లింది. ఆ తర్వాత 8 సంవత్సరాలకు అరుణాచల్ ప్రదేశ్ లోని తులుంగ్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ కు చెందిన నలుగురిని చైనా సైనికులు కాల్చి చంపారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఒక్క బుల్లెట్ పేలలేదు. మొన్నటివరకు ఒక్క ప్రాణమూ పోలేదు.

2020-06-16
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 Last Page