అంతర్జాతీయ పేటెంట్ దరఖాస్తులలో ఇండియా వెనుకబడింది. 2018లో 2007 దరఖాస్తులతో 13వ స్థానంలో ఉన్న ఇండియా, 2019లో 2053 దరఖాస్తులతో 14వ స్థానానికి తగ్గింది. దరఖాస్తులు స్వల్పంగా పెరిగినా ఓ ర్యాంకు కోల్పోవడానికి ప్రధాన కారణం.. టర్కీ సాధించిన ప్రగతి. 2018లో 1403 దరఖాస్తులతో 20వ స్థానంలో ఉన్న టర్కీ 2019లో 2058 దరఖాస్తులతో ఏకంగా 7 స్థానాలు ఎగబాకింది. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (డబ్ల్యు.ఐ.పి.ఒ) తాజా నివేదిక మంగళవారం విడుదలైంది. పేటెంట్ దరఖాస్తుల్లో టాప్ 13 దేశాల్లో ర్యాంకులను కోల్పోయింది అమెరికా, ఇండియా మాత్రమే.

2020-04-07

అంతర్జాతీయ పేటెంట్ల రేసులో అగ్రరాజ్యం అమెరికాను అధిగమించింది చైనా. 2019లో చైనా అగ్రస్థానానికి చేరినట్టు ఐరాస పేటెంట్ ఏజెన్సీ మంగళవారం వెల్లడించింది. చైనా నుంచి 58,990 పేటెంట్ దరఖాస్తులు దాఖలు కాగా అమెరికా నుంచి 57,840 దాఖలైనట్టు ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యు.ఐ.పి.ఒ) తెలిపింది. గత 20 ఏళ్లలో చైనా పేటెంట్ల సంఖ్య 200 రెట్లు పెరిగిందని ఈ సంస్థ పేర్కొంది. 1978లో పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ వ్యవస్థ ఉనికిలోకి వచ్చాక.. ప్రతి ఏటా అమెరికాదే ఆధిపత్యం. గత ఏడాది 3, 4, 5 స్థానాల్లో జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా ఉన్నాయి.

2020-04-07

టీబీ నిరోధంకోసం బీసీజీ టీకా తప్పనిసరి చేసిన దేశాల్లో ‘కరోనా’ మరణాలు తక్కువగా ఉన్నట్టు న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టక్నాలజీ (ఎన్.వై.ఐ.టి) అధ్యయన బృందం గుర్తించింది. సార్వత్రిక విధానం లేని ఇటలీ, నెదర్లాండ్స్, అమెరికా చాలా తీవ్రంగా ప్రభావితం అయ్యాయని ఎత్తిచూపింది. చైనాలో 1950లలోనే సార్వత్రిక బీసీజీ విధానం ఉన్నా.. సాంస్కృతిక విప్లవ కాలంలో దెబ్బ తిన్నదని, ఇరాన్ 1984లో ఈ విధానాన్ని ప్రారంభించడం వల్ల 36 సంవత్సరాల కంటే తక్కువ వయసువారికే ఆ ‘రక్షణ’ ఉందని పేర్కొంది. ఇండియా 1948లోనే సార్వత్రిక బీసీజీ టీకా కార్యక్రమాన్ని చేపట్టింది. బీసీజీ టాకానే కాపాడుతోందా? అన్న అంశంపై మరింత అధ్యయనం జరగాల్సి ఉంది.

2020-04-02

ఎ- గ్రూపు రక్తం ఉన్నవాళ్లకు ‘కరోనా వైరస్’ ఎక్కువగా సోకే అవకాశం ఉందని, తీవ్రత కూడా ఆ గ్రూపువారికే ఎక్కువని చైనా పరిశోధకులు గుర్తించారు. ఆ గ్రూపుతో పోలిస్తే ఒ- గ్రూపు రక్తం ఉన్నవారికి రిస్క్ తక్కువని, వారిలో ‘కరోనా’ నిరోధక శక్తి ఎక్కువగా ఉందని ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనకోసం వుహాన్, షెంజెన్ నగరాల్లో 2000 మంది నుంచి రక్త నమూనాలను సేకరించారు. దీనిపై ఇంకా పరిశోధించాల్సి ఉందంటూ.. వైరస్ (సార్స్-సిఒవి-2) సోకినవారికి వైద్యం చేసే సమయంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని శాస్తవేత్తలు సూచించారు.

2020-03-17 Read More

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (64) ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకున్నారు. సామాజిక సేవకు అధిక సమయం కేటాయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని కంపెనీ శుక్రవారం (శాన్ ఫ్రాన్సిస్కో సమయం) ప్రకటించింది. బిల్ గేట్స్ 2000 సంవత్సరంలోనే సీఈవో పోస్టు నుంచి వైదొలిగి స్టీవ్ బామర్ కు బాధ్యతలు అప్పగించారు. 2014లో సత్య నాదెళ్ళ సీఈవో అయిన సమయంలో బోర్డు డైరెక్టర్ల ఛైర్మన్ బాధ్యతల నుంచీ తప్పుకున్నారు. 13 సంవత్సరాల వయసులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ప్రారంభించిన బిల్, ‘మైక్రోసాఫ్ట్’తో ప్రపంచంలోనే నెంబర్ 1 కుబేరుడిగా ఎదిగారు.

2020-03-14

జెడి (యు)తో తెగతెంపులయ్యాక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రారంభించిన ‘బాత్ బీహార్ కీ’ ప్రచారాంశం ‘కాపీ’ కొట్టినదట! ప్రశాంత్ కిషోర్ క్యాంపెయిన్ కు తాను సృజించిన సమాచారాన్ని వాడుతున్నారని కాంగ్రెస్ పార్టీలో ఉన్న డేటా అనలిస్ట్ శశ్వత్ గౌతమ్ ఫిర్యాదు చేశారు. దీంతో పాట్నా పోలీసులు గురువారం ఐపిసి 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో తనతో కలసి పని చేసిన ఒసామా అనే వ్యక్తి ఆ సమాచారాన్ని ప్రశాంత్ కిషోర్ కు ఇచ్చి ఉండొచ్చని గౌతమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జార్జ్ వాషింగ్టన్ వర్శిటీలో చదివిన గౌతమ్, ఇంతకు ముందు పరిశోధనా సంస్థ ‘ఎడిఆర్ఐ’లో పని చేశారు.

2020-02-27 Read More

కంప్యూటర్ కీ బోర్డుపై ‘కట్/కాపీ, పేస్ట్’ కమాండ్ల సృష్టికర్త లారీ టెస్లర్ (74) మరణించారు. ఆయన కనుగొన్న అంశాలతో అందరూ కంప్యూటర్ నేర్చుకోవడం తేలికైంది. 1945లో న్యూయార్క్ లోని బ్రాంగ్జ్ లో జన్మించిన టెస్లర్, స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో చదివారు. అమెరికాలో జనసామాన్యానికి కంప్యూటర్ అందుబాటులోకి రాని 1960లలో టెస్లర్ సిలికాన్ వ్యాలీలో పని చేశారు. ‘యూజర్ ఇంటర్ ఫేస్ డిజైన్’లో ప్రత్యేకత సాధించారు. జెరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్ (పార్క్)తో ప్రారంభమైన ఆయన కెరీర్ అనేక టెక్నాలజీ సంస్థల్లో సుదీర్ఘంగా సాగింది.

2020-02-20

చైనా కంపెనీ ‘రియల్ మి’ ఇండియాలో 5జి ఫోన్ల అమ్మకానికి ఈ నెల 24న శ్రీకారం చుట్టనుంది. 865 స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో కూడిన 5జి ఫోన్ ధర రూ. 50,000 ఉంటుందని ‘రియల్ మి’ ప్రతినిధి ఒకరు బుధవారం చెప్పారు. అయితే, తక్కువ స్థాయి చిప్‌సెట్‌తో వచ్చే వెర్షన్ రూ. 25,790కు లభించవచ్చని ఓ ప్రముఖ వెబ్ సైట్ పేర్కొంది. X50 ప్రో 5జి ఫోన్ ను స్పెయిన్, ఇండియాలలో ఒకేసారి ఆవిష్కరించనుండగా, మరో చైనా బ్రాండ్ ‘ఐకూ 3’ కూడా ఈ నెల 25నే 5జి ఫోన్ ను ఇండియాలో విడుదల చేయనుంది.

2020-02-19 Read More

విమానం లోపల ఇంటర్నెట్ వైఫై సేవలు ఇండియాలో మార్చిలో ప్రారంభం కానున్నాయి. టాటా గ్రూపు సంస్థ ‘నెల్కో’ పానసోనిక్ ఏవియానిక్స్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో తొలిగా ‘విస్టార’ విమానాలకు ఈ సేవలను అందించనుంది. ‘విస్టార’లో కూడా ‘టాటా’ భాగస్వామి. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ సంయుక్త యాజమాన్యంలో నడుస్తోంది. ‘విస్టార’ సుదూర ప్రయాణాలకు వినియోగించే బోయింగ్ 787, ఎ321 విమానాల్లో తొలుత మార్చి - ఏప్రిల్ మాసాల్లో వైఫై సేవలను ప్రారంభించనున్నారు.

2020-02-19 Read More

ఎయిర్ ఇండియా రిక్రూట్ మెంట్ యాడ్ పేరిట ఓ తప్పుడు ఇ-మెయిల్ అనేక మందికి అందింది. ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 11.30కి ముంబై చత్రపతి శివాజీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఇంటర్వ్యూకి హాజరు కావాలని ఆ యాడ్ లో సూచించారు. అయితే, అలాంటి ఇ మెయిల్ ఏదీ తాము పంపలేదని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఉద్యోగార్ధులు నోటిఫికేషన్లకోసం ఎయిర్ ఇండియా అధికారిక వెబ్ సైట్ (www.airindia.in) చూడాలని ఆ సంస్థ సూచించింది.

2020-02-18
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 Last Page