‘కరోనా’ కాలంలో చాలా మంది పిల్లలు టీవీలకు, వీడియో క్రీడలకు పరిమితం కాగా... ఢిల్లీలో ఓ పదో తరగతి విద్యార్ధి 10 మందికీ పనికొచ్చే ఆలోచన చేశాడు. 3డి ప్రింటర్ ఉపయోగించి ముఖ కవచాలు (ఫేస్ మాస్కులు) రూపొందించాడు. జరేబ్ వర్ధన్ అనే విద్యార్ధి తను చదువుకునే గదినే ఉత్పత్తి కేంద్రంగా మలచుకొని మాస్కులు రూపొందించాడు. 100 మాస్కులను మొన్న ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవకు అందజేశాడు. ‘‘సాధకులు కష్టసమయాల్లోనే పుడతారు. కంఫర్ట్ జోన్లలో కాదు’’ అని పోలీసు కమిషనర్ తన ప్రశంసాపత్రంలో పేర్కొన్నారు. తన పాకెట్ మనీతో 3డి మిషన్ కొనుగోలు చేసినట్టు జరేబ్ చెప్పాడు.

2020-06-24

బైదూ నేవిగేషన్ శాటిలైట్ వ్యవస్థ (బిడిఎస్)లో చివరి ఉపగ్రహాన్ని చైనా మంగళవారం ఉదయం ప్రయోగించింది. నైరుతి చైనాలో సిచువాన్ ప్రావిన్సులో ఉన్న జిచాంగ్ ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 9.43 గంటలకు లాంగ్ మార్చ్-3బి రాకెట్ ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. బిడిఎస్-3 ఉపగ్రహాల్లో ఇది 30వది. మొత్తం బైదూ కుటుంబంలో 55వ ఉపగ్రహం. దేశీయంగా అభివృద్ధి చేసిన నేవిగేషన్ వ్యవస్థను ఈ చివరి ఉపగ్రహం సంపూర్ణం చేసింది. ప్రపంచ నేవిగేషన్ వ్యవస్థలలో అమెరికా జిపిఎస్, రష్యా గ్లోనాస్, యూరోపియన్ యూనియన్ గెలిలియోల సరసన బైదూ చేరింది.

2020-06-23

స్టెరాయిడ్ ‘డెక్సామెథాసోన్’కు తీవ్రంగా జబ్బుపడిన రోగుల ప్రాణాలను కాపాడే సామర్ధ్యం ఉందన్న నిర్ధారణ ‘కోవిడ్ 19’పై పోరాటానికి ఊతమిచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ చెప్పారు. సోమవారం జెనీవా (స్విట్జర్లాండ్)లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఉత్పత్తిని పెంచడం, ప్రపంచం మొత్తానికి వేగంగా.. సమానంగా పంపిణీ చేయడం తదుపరి సవాలు’’ అని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. యు.కె. పరీక్షల ఫలితాల తర్వాత ఇప్పటికే ‘డెక్సామెథాసోన్’కు డిమాండ్ బాగా పెరిగిందని, అయితే... తక్కువ ధరకు అందించాల్సి ఉందని పేర్కొన్నారు.

2020-06-22

గంటకు 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా దేశీయంగా రూపొందించిన మాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్) రైలును చైనా పరీక్షిస్తోంది. తొలిగా ఒకే బోగీతో షాంగైలో ఆదివారం పరీక్షను నిర్వహించారు. ఈ మాగ్లెవ్ రైలును షాండాంగ్ ప్రావిన్సులోని క్విగ్డావో నగరంలో ఉన్న సి.ఆర్.ఆర్.సి. ఫ్యాక్టరీలో రూపొందించారు. మాగ్లెవ్ రైళ్ళలో చక్రాలు పట్టాలకు రాసుకోవడం ఉండదు గనుక శబ్దం తక్కువ వస్తుంది. ఐదు బోగీల మాగ్లెవ్ రైళ్ల అభివృద్ధి సాఫీగా సాగుతోందని, 2020లోనే ఉత్పత్తి జరుగుతుందని కంపెనీ తెలిపింది.

2020-06-22

మనుషుల తరహాలోనే బుద్ధి జీవులు నివశించే గ్రహాలేవైనా విశ్వంలో ఉన్నాయా? అని శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా అన్వేషిస్తున్నారు. ఎక్కడో సుదూరంగా కాదు.. మన గెలాక్సీలోనే 30 వరకు గ్రహాంతర జీవుల నాగరికతలు ఉండొచ్చని తాజాగా నాటింగ్హమ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. భూమి తరహాలోనే జీవ పరిణామం జరిగే అవకాశం ఉన్న గ్రహాలు మనకు దగ్గరగా ఎన్ని ఉన్నాయో అంచనా వేసేందుకు పరిశోధకులు ప్రయత్నించారు. బుద్ధి జీవుల అవతరణకు భూమిపై పట్టినట్టే 500 కోట్ల సంవత్సరాలు అవసరమన్న అంచనా ప్రాతిపదికగా.. మన గెలాక్సీలో కొన్ని డజన్ల క్రియాశీల నాగరికతలు ఉండొచ్చని పేర్కొన్నారు.

2020-06-15

వివాదాస్పద ‘ఆరోగ్యసేతు’ మొబైల్ అప్లికేషన్ (యాప్) విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్బంధ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక రైళ్లలో ప్రయాణించడానికి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం తప్పనిసరి చేసింది రైల్వే శాఖ. ఇప్పుడు దేశంలో విమానం ఎక్కాలన్నా ఈ యాప్ తప్పనసరి. పౌర విమానయాన శాఖ తాజాగా జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్.ఒ.పి)లో పేర్కొన్న తప్పనిసరి అంశాల్లో ఈ యాప్ కూడా ఉంది. ‘కరోనా వైరస్’ పాజిటివ్ కేసులు దగ్గరగా ఉంటే అలర్ట్ వస్తుందనే పేరిట ‘ఆరోగ్య సేతు’ను కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేసింది. అయితే, ప్రజలపై నిఘాకు మోడీ ప్రభుత్వం ఈ యాప్ ను ఉపయోగించుకుంటోందని ఆరోపణలు ఉన్నాయి.

2020-05-12

‘కరోనా వైరస్’కు టీకా ఆగస్టులో వచ్చే అవకాశం ఉందని శాంతా బయోటెక్ యజమాని వరప్రసాదరెడ్డి చెప్పినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వెల్లడించారు. మంగళవారం తెలంగాణ కేబినెట్ భేటీ తర్వాత రాత్రి 9.45కు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలోని జీనోమ్ వ్యాలీ కేంద్రంగా పని చేస్తున్న భారత్ బయోటెక్, బిఇ, శాంతా బయోటెక్ కంపెనీల ముఖ్యులు తనను కలిశారని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. ఆగస్టు, సెప్టెంబర్ లక్ష్యంగా రెండు వ్యాక్సిన్ ప్రయత్నాలు జరుగుతున్నాయని, మొదట తెలంగాణ నుంచే వ్యాక్సిన్ వెలువడితే అది గర్వకారణం అవుతుందని పేర్కొన్నారు.

2020-05-05

కరోనా వైరస్ (SARS-CoV-2) ప్రాథమిక రకం కంటే వేగంగా వ్యాపించిన కొత్త రూపాంతరాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రకం (D614G) ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా వ్యాపించిందని లాస్ అలమాస్ జాతీయ లేబొరేటరీ శాస్త్రవేత్తలు ఓ అధ్యయన పత్రంలో పేర్కొన్నారు. ఇది ఫిబ్రవరిలో ఐరోపా ఖండంలో ప్రత్యక్షమై వేగంగా అమెరికా తూర్పు తీరానికి వ్యాపించి, మార్చి మధ్య కల్లా ప్రపంచవ్యాప్తంగా ‘ఆధిపత్య రకం’గా అవతరించిందని వారు వివరించారు. వేగంగా వ్యాపించడంతో పాటు.. ఒకే వ్యక్తికి రెండోసారి సంక్రమించే గుణం ఈ కొత్త రకానికి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. (పరిశోధనా పత్రం కోసం ఎడమకు స్వైప్ చేయండి)

2020-05-05 Read More

వాయు కాలుష్యంలోని ధూళి కణాలపైన ‘కరోనా’ వైరస్ ఉంటుందని తాజాగా ఇటలీ పరిశోధకులు గుర్తించారు. తద్వారా వైరస్ ఎక్కువ దూరం ప్రయాణించి.. ఎక్కువమందికి సోకుతుందా? అన్న అంశంపై పరిశోధన జరుగుతోంది. బెర్గామో ప్రావిన్సులోని పారిశ్రామిక వాడలో వాయు కాలుష్యం నుంచి నమూనాలను సేకరించారు. అనేక నమూనాల్లో కోవిడ్19కు ప్రత్యేకమైన జన్యువులను కనుగొన్నారు. ఈ పరిశోధన ఇంకా ప్రాథమిక దశలో ఉంది. వైరస్ ధూళి కణాలపై మనగలుగుతుందా.. వ్యాధిని కలిగించేంత పరిమాణంలో ఉంటుందా? అన్నది తేలాలి. సో.. గాలి ద్వారా వైరస్ వ్యాపించదన్న ధీమా మంచిది కాదు.

2020-04-25

‘కరోనా’పై పోరాడి కోలుకున్నవారి రక్తాన్ని ఇతర ‘కోవిడ్19’ రోగులకు చికిత్సలో ఉపయోగించవచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఓ కరోనా పాజిటివ్ పేషెంట్ కోలుకున్నాడంటే.. అతని శరీరం వైరస్ తో యుద్ధం చేసి ఉంటుందని, ఆ యుద్ధంకోసం ఉత్పత్తి అయిన ‘యాంటీబాడీస్’ అతని రక్తంలో ఉంటాయని గులేరియా వివరించారు. వ్యాధి నయమైన వారి రక్తాన్ని ఉపయోగించి వైరస్ పేషెంట్లలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచవచ్చని ఆయన పేర్కొన్నారు. కోవిడ్19 రోగులకు చికిత్సలో ప్లాస్మా మార్పిడి ఒక ప్రత్యామ్నాయమని తెలిపారు.

2020-04-13 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 Last Page