యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించినందుకు గాను ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ‘గూగుల్’ పైన అమెరికా కేసు పెట్టబోతోంది. అల్ఫాబెట్ ఇంక్ కంపెనీకి చెందిన గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజన్ గా తన శక్తిని దుర్వినియోగం చేసిందన్నది ఆ కంపెనీపై అభియోగం. ఈమేరకు అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ మంగళవారం కేసు పెట్టనున్నట్టు సమాచారం. అమెరికా ఇంటర్నెట్ సెర్చ్ మార్కెట్లో గూగుల్ వాటా 90 శాతం. ఆ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి గూగుల్ పోటీని అణచివేసిందనే ఆరోపణ ఉంది. అమెరికాలో గత కొన్ని దశాబ్దాలలో ఇదే అతి ముఖ్యమైన గుత్తాధిపత్య కేసు కానుంది.

2020-10-20

సూర్యుడి నుంచి రెండవది, భూమి కంటే ముందున్న గ్రహం వీనస్ పైన సూక్ష్మజీవుల ఆనవాళ్ళు ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వీనస్ ఉపరితలానికి 50 నుంచి 60 కిలోమీటర్ల ఎత్తులోని మేఘాల్లో అరుదైన ఫాస్ఫీన్ గ్యాస్ తక్కువ స్థాయిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమిపైన ఆక్సిజన్ రహిత ప్రాంతాల్లో నివశించే సూక్ష్మజీవులు ఫాస్ఫీన్ అణువులను ఉత్పత్తి చేస్తాయని, కాబట్టి వీనస్ మేఘాల్లో కూడా సూక్ష్మజీవులు ఉండవచ్చని భావిస్తున్నారు. వీనస్ ఉపరితలంపై ఉండే సగటు ఉష్టోగ్రత 464 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఏ జీవీ బతికే అవకాశం లేదు. అయితే, వీనస్ మేఘాల్లో (సుమారు 30 డిగ్రీలు) జీవం మనుగడ సాగించగలదని చెబుతున్నారు.

2020-09-14

చైనాలో రూపొందిన ‘కోవిడ్-19’ టీకా విజయవంతంగా 2 దశల ప్రయోగాలను పూర్తి చేసుకుంది. ఎడి5గా వ్యవహరిస్తున్న ఈ టీకా సురక్షితమైనదని, రోగనిరోధకతను ప్రేరేపిస్తోందని ప్రయోగాల్లో తేలింది. ప్రముఖ మెడికల్ జర్నల్ ‘ద లాన్సెట్’ చైనా టీకాపై కూడా సోమవారం ఓ అధ్యయన పత్రాన్ని ప్రచురించింది. ‘కరోనా’ విస్ఫోటనం ప్రారంభమైన వుహాన్ నగరంలోనే మనుషులపై ప్రయోగాలు జరిగాయి. తొలి దశలో 108 మందిపైన ప్రయోగించగా మే నెలలో ఫలితాలు వెల్లడయ్యాయి. రెండో దశలో 508 మందికి ఇవ్వగా.. అందులో మూడింట రెండు వంతులు 18-44 వయసువారు. పావు వంతు 45-54 వయసువారు. 13 శాతం మంది 55 సంవత్సరాలకు పైన వయసున్నవారు.

2020-07-21

ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా రూపొందించిన ‘కరోనా’ టీకా ‘ఎ.జడ్.డి.1222’ సురక్షితమైనదని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రాథమిక పరీక్షలలో తీవ్రమైన దుష్ప్రభావాలేమీ తలెత్తలేదని.. యాంటీబాడీల, టి-సెల్ రోగనిరోధక స్పందన బాగుందని తేల్చారు. 1,077 మందిపై చేసిన ప్రాథమిక పరీక్షల ఫలితాలు ప్రతిష్ఠాత్మక మెడికల్ జర్నల్ ‘ద లాన్సెట్’లో సోమవారం వెల్లడయ్యాయి. రోగనిరోధక వ్యవస్థ ‘వైరస్’ను గుర్తు పెట్టుకుంటుందని, దానివల్ల ఈ వ్యాక్సిన్ ఎక్కువ కాలం ప్రజలను కాపాడుతుందని ఆక్స్ఫర్డ్ వర్శిటీకి చెందిన ఆండ్రూ పొల్లార్డ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

2020-07-20

కరోనా వైరస్ నిరోధానికి దేశీయంగా రూపొందిన టీకా ‘కోవాక్సీన్’ను మనుషులపై ప్రయోగించడం ప్రారంభమైంది. మూడు దశల ప్రయోగాలలో తొలి దశ సోమవారం ప్రారంభమైనట్లు ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోనే భారత్ బయోటెక్ ‘కోవాక్సీన్’ను రూపొందించింది. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో కూడా సోమవారం ఇద్దరు వాలంటీర్లకు ఈ టీకాను ఇచ్చారు. మొదటి దశ సమాచార విశ్లేషణకోసం పరిశోధకులకు కనీసం 3 నెలల సమయం పడుతుందని గులేరియా చెప్పారు.

2020-07-20

ఆంధ్రప్రదేశ్ లోనూ ‘కరోనా’ వైరస్ విజృంభించింది. మంగళవారం ఒక్క రోజే రాష్ట్రంలో 2432 కేసులు నమోదయ్యాయి. అంటే గంటకు 100కి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 20 మందికి వైరస్ నిర్ధారణ కాగా మిగిలిన 2412 కేసులూ రాష్ట్రంలో విస్తరిస్తున్న మహమ్మారికి దర్పణం పడుతున్నాయి. పాజిటివిటీ రేటు అసాధారణంగా పెరిగింది. గత నెల వరకు 2 శాతం కంటే తక్కువగా ఉండగా.. మంగళవారం నిర్వహించిన 22,197 పరీక్షలలో ఏకంగా 10.87 శాతానికి వైరస్ నిర్ధారణ అయింది.

2020-07-15

‘కోవిడ్ 19’ టీకా ఎక్కువగా అవసరం ఉన్న ప్రజలకు, అవసరం ఉన్న ప్రాంతాలకు కాకుండా ఎక్కువ ఖరీదు కట్టేవారికి మాత్రమే చేరితే... మరింత ప్రాణాంతకమైన సుదీర్ఘమైన మహమ్మారిని చూడవలసి వస్తుందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రపంచ నేతలను హెచ్చరించారు. టీకాలు, మందులను మార్కెట్ ఆధారిత పరిణామాలకు వదిలేయకుండా సమానంగా పంపిణీ చేయడానికి నాయకులు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని గేట్స్ సూచించారు. అంతర్జాతీయ ఎయిడ్స్ సొసైటీ శనివారం నిర్వహించిన ఆన్ లైన్ ‘కోవిడ్’ సదస్సులో ఆయన మాట్లాడారు.

2020-07-12

5జి పేరు చెబితే ప్రపంచం మొత్తానికి గుర్తొచ్చే మొదటి పేరు ‘హువావీ’. ఈ చైనా టెక్నాలజీ దిగ్గజం అనతి కాలంలోనే అసాధారణ ప్రగతిని సాధించింది. దానికి కారణం ఏమిటో తాజాగా వెల్లడైన ఆ కంపెనీ రిపోర్టు ఒకటి చెబుతోంది. 2019 నాటికి ‘హువావీ’ ఉద్యోగుల సంఖ్య 1,94,000 కాగా వారిలో ఏకంగా 49.48% (96,000 మంది) రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సభ్యులేనట! కంపెనీలో 157 దేశాలు, ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు పని చేస్తున్నారని... గత ఏడాది విదేశీ ఉద్యోగుల సంఖ్య 37 వేలు దాటిందని ఆ రిపోర్టులో పేర్కొన్నారు.

2020-07-08

పదేళ్ల సూర్యగమనాన్ని ‘నాసా’ ఓ గంట టైం- లాప్స్ వీడియో రూపంలో విడుదల చేసింది. సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (ఎస్.డి.ఒ) దశాబ్దంపాటు భూమి చుట్టూ తిరుగుతూ తీసిన సూర్యుడి చిత్రాలతో ఈ వీడియో రూపొందింది. ఈ అబ్జర్వేటరీలో ఉన్న మూడు పరికరాలు ప్రతి 0.75 సెకండ్లకు ఒకటి చొప్పున మొత్తం 42.5 కోట్ల హై రిజొల్యూషన్ చిత్రాలను తీశాయి. 2010 జూన్ 2 నుంచి 2020 జూన్1 వరకు 20 మిలియన్ గిగాబైట్ల సమాచారాన్ని పొందుపరిచాయి. ఇది సూర్యుడిపై అధ్యయనంలో కీలక పాత్ర పోషించింది. గంటకు ఒక ఫొటో చొప్పున ఉపయోగించి పదేళ్ళ సూర్యగమనాన్ని 61 నిమిషాల వీడియోగా ‘నాసా’ సంక్షిప్తీకరించింది.

2020-06-28

ఆకాశాన్ని చీల్చుకుంటూ భూమిపైకి ప్రసరించిన ఈ మెరుపు తీగ పొడవును 700 కిలోమీటర్లుగా ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ లెక్కించింది. ఇప్పటిదాకా రికార్డులకెక్కిన మెరుపులలో ఇదే అతి పొడవైనదని గురువారం ప్రకటించింది. 2018 అక్టోబర్ 31న బ్రెజిల్ లో పిడుగు పడినప్పుడు ఇంత పొడవు మెరుపుతీగ కెమేరాకు చిక్కింది. ఈ మెరుపు తీగ నేలపై పరుచుకుంటే.. హైదరాబాద్ నుంచి దాదాపు శ్రీకాకుళం వరకు వస్తుంది. అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రంలో 2007 జూన్ 20న సంభవించిన మెరుపు తీగ (321 కి.మీ) ఇప్పటిదాకా ఓ రికార్డు. దానికి బ్రెజిల్ మెరుపు రెట్టింపు కంటే ఎక్కువ ఉండటం గమనార్హం.

2020-06-26
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 Last Page