రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఇసి) స్థానం నుంచి రమేష్ కుమార్ ను తొలగించడంలోని హేతుబద్ధతను వివరిస్తూ ఈ నెల 16లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎస్ఇసి పదవీ కాలాన్ని మూడేళ్ళకు కుదిస్తూ ఆర్డినెన్సును, రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసిందంటూ జీవోలను ఇవ్వడాన్ని ఆయన హైకోర్టులో సవాలు చేశారు. స్థానిక ఎన్నికల వాయిదాకు కారణమైన మెడికల్ ఎమర్జెన్సీలోనే ఆర్డినెన్సు జారీ చేయడం దురుద్దేశంతో కూడుకున్నదని రమేష్ కుమార్ వాదించారు. ఈ అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లను కూడా కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ ఎం. సత్యనారాయణ వాదనలు విన్నారు.
2020-04-13‘కరోనా’ మహమ్మారికి వణుకుతున్న మహారాష్ట్ర ‘లాక్ డౌన్’ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. దిగ్బంధపు నిబంధనలను ఉల్లంఘించి ‘మార్నింగ్ వాక్’ చేస్తున్న 12 మందిని నవీ ముంబైలో పోలీసులు అరెస్టు చేయడం దీనికి నిదర్శనం. బుధవారం నవీ ముంబై లోని వివిధ ప్రాంతాల్లో వాకింగ్ చేస్తూ కనిపించిన ఈ 12 మందినీ అరెస్టు చేసి తర్వాాత బెయిలుపై విడుదల చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు సెక్షన్ 188 కింద ఆ డజను మందిపై కేసు నమోదు చేశారు. ‘కరోనా’ దెబ్బకు కాలినడక కూడా నేరమైపోయింది!.
2020-04-08కరోనా వైరస్ వ్యాప్తి మరింత వేగం పంజుకుంది. మంగళవారం ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా 75 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం కరోనా కేసుల సంఖ్య 8,57,957కు పెరిగింది. సోమవారం వరకు (అమెరికా కాలమానం ప్రకారం) నమోదైన కేసులు 7,82,400. అమెరికా, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. కరోనా సోకినవారి సంఖ్య అమెరికాలో 1,88,547కు, ఇటలీలో 1,05,792కు, స్పెయిన్ లో 95,923కు పెరిగింది. జర్మనీ (71,808 కేసులు) త్వరలో చైనా (82,290)ను మించిపోనుంది. ఫ్రాన్స్ లో కూడా వైరస్ సోకినవారి సంఖ్య 50 వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 75 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.
2020-04-01రాష్ట్ర ప్రభుత్వ తప్పటడుగులపై హైకోర్టు, సుప్రీంకోర్టు ఒకే రోజు చీవాట్లు పెట్టాయి. రాజధానికోసం తీసుకున్న భూముల్లో 1251 ఎకరాలను పేదల ఇళ్ళ స్థలాలకోసం కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సోమవారం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై తాజాగా సుప్రీంకోర్టు కూడా తలంటింది. ఇంతకు ముందే చీవాట్లు పెట్టిన హైకోర్టు, రంగులు తుడిచేయాలని తీర్పు చెప్పింది. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళిన ప్రభుత్వానికి అక్కడా నిరాశ తప్పలేదు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళ స్థలాలను అమ్ముకునే వీలు కల్పించడాన్నీ హైకోర్టు తప్పు పట్టింది.
2020-03-23‘నిర్భయ’ తల్లిదండ్రులు ఆశించినట్టు దేశంలోని మహిళలు ఇక భద్రత ఫీలవుతారా? రోజుకు సగటున 100 మానభంగాలు జరుగుతున్నప్పుడు అది సాధ్యమా? 2018లో దేశంలో 33,356 మానభంగం కేసులు నమోదయ్యాయి. అత్యాచారం లేదా సామూహిక అత్యాచారంతోపాటు బాధితురాలిని చంపిన కేసులు 294 నమోదయ్యాయి. 2017లో 223 కేసులు నమోదైతే మరుసటి ఏడాది 32 శాతం పెరిగాయి. ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు లేదా వారి అండగల వాళ్ళు ‘నిర్భయం’గా హీనమైన నేరాలకు పాల్పడుతున్నారు. బాధితులకు అండగా ఉన్న కుటుంబాలనే నిర్మూలిస్తున్న సమాజంలో ‘భద్రత’ అత్యాశే అవుతుందేమో?!
2020-03-20ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో దోషులు ఉరిశిక్షను ఎలాగైనా తప్పించుకోవాలని, ప్రాణాలు నిలబెట్టుకోవాలని మరణానికి రెండు గంటల ముందు వరకు ప్రయత్నించారు. ఢిల్లీ హైకోర్టులో రివిజన్ పిటిషన్, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఢిల్లీ హైకోర్టు రాత్రి 12 గంటలకు జస్టిస్ మన్మోహన్ నివాసంలో విచారణ జరిపి దోషుల విన్నపాన్ని తిరస్కరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా క్షమాబిక్ష పిటిషన్ ను తిరస్కరించడాన్ని సవాలు చేశారు. జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎఎస్ బోపన్న వేకువజామున 2.45కు విచారణ ప్రారంభించి 3.45కి పిటిషన్ ను కొట్టివేశారు.
2020-03-202012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో దోషులు నలుగురినీ శుక్రవారం ఉదయం తీహార్ జైలులో ఉరి తీశారు. అక్షయ్ ఠాకూర్ (31), వినయ్ శర్మ (26), పవన్ గుప్తా (25), ముఖేష్ సింగ్ (32) లను కోర్టు నిర్దేశించిన ప్రకారం ఉదయం 5.30 గంటలకు ఉరి తీసినట్టు జైలు డైరెక్టర్ సందీప్ గోయల్ నిర్ధారించారు. 23 ఏళ్ల యువతిపై సామూహికంగా అత్యాచారం చేయడమే కాకుండా క్రూరంగా హింసించిన మృగాలు వీళ్ళు. 2015 తర్వాత ఇండియాలో ఉరిశిక్ష అమలు కావడం ఇదే తొలిసారి. ఒకే నేరంపై నలుగురిని ఒకేసారి ఉరి తీయడం తీహార్ జైలులో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు.
2020-03-20మధ్యప్రదేశ్ అసెంబ్లీలో రేపు (మార్చి 20) సాయంత్రం 5 గంటలలోగా బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు గురువారం సాయంత్రం ఆదేశించింది. మెజారిటీ నిరూపణ కార్యక్రమంలో సభ్యులు చేతులు ఎత్తి ఓటింగ్ లో పాల్గొనాలని, ఈ ప్రక్రియను వీడియో తీయాలని, ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆరుగురు మంత్రులు సహా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమలనాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. బిజెపిలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా వ్యూహంలో భాగంగా కమలనాథ్ ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు.
2020-03-192012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులను శుక్రవారం (మార్చి 20) ఉరి తీయడం ఖాయమైంది. నిందితుల్లో ఒకడైన పవన్ గుప్తా వేసిన క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నేరం జరిగినప్పుడు తాను మైనర్ నని నిందితుడు లేవనెత్తిన అభ్యంతరాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో నిందితుల ఉరిపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు నిరాకరించింది. ఇంతకు ముందే ఇచ్చిన డెత్ వారెంట్ ప్రకారం మార్చి 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు నిందితులను తీహార్ జైలులో ఉరి తీయాల్సి ఉంది.
2020-03-19పంగోలిన్ పొలుసులను దొంగ రవాణా చేస్తూ పట్టుబడిన ఓ చైనా మహిళకు ఏడేళ్ళు జైలు శిక్ష పడింది. 2017లో నవంబర్ 26, 2018 మే 18 తేదీల్లో లి అనే మహిళ ఇతరులతో కలసి పంగోలిన్ పొలుసులతో విదేశాల నుంచి షాంగై ప్రయాణించింది. పుడోంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 110.45 కేజీల పొలుసులను స్వాధీనం చేసుకున్నారు. ‘కరోనా వైరస్’ పంగోలిన్ల నుంచి మనుషులకు సంక్రమించి ఉండొచ్చని చైనా పరిశోధకులు ఈ మధ్యనే పేర్కొన్నారు. ఈ స్మగ్లింగ్ సమయానికి ‘కరోనా వైరస్’ అనేది ఉందని తెలియకపోయినా.. శిక్ష విధింపులో మాత్రం ఆ ప్రభావం ఉన్నట్టు భావిస్తున్నారు.
2020-03-19