ఏపీ ఎన్నికల కమిషన్ మాజీ చీఫ్ రమేష్ కుమార్ రాసినట్టు చెబుతున్న లేఖ ఎస్ఇసి కార్యాలయంలో రూపొందలేదని సిఐడి చీఫ్ సునీల్ కుమార్ స్పష్టం చేశారు. ఎక్కడో తయారైన లేఖను పెన్ డ్రైవ్ ద్వారా తెచ్చి ఎస్ఇసి ల్యాప్ టాప్ లో కాపీ చేశారని, అక్కడ ఎడిట్ చేసినట్టు లింకు ఫైల్స్ మాత్రం ఉన్నాయని సునీల్ కుమార్ మంగళవారం చెప్పారు. ఆ లేఖ ఏ కంప్యూటర్లో పుట్టిందో కచ్చితంగా తేలుతుందని సంశయాత్మకంగా చెప్పడం గమనార్హం. ‘లేఖను కమిషనర్ కేంద్రానికి పంపారా లేదా.. అన్న అంశంతోపాటు ఎక్కడ పుట్టిందో విచారించే పరిధి సిఐడికి ఉందా?’ అన్న ప్రశ్నకు కూడా ఆయన ధీమాగా బదులివ్వలేకపోయారు.

2020-05-05

‘లాక్ డౌన్’ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఐదుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆర్.కె. రోజా, బియ్యపు మధుసూదన్ రెడ్డి, విడదల రజని, సంజీవయ్య, వెంకటగౌడ లకు నోటీసులు జారీ అయ్యాయి. వారిపై ఏ చర్యలు తీసుకున్నారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ‘లాక్ డౌన్’లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ట్రాక్టర్ల ర్యాలీ.. రోజా, రజనీలకు పూల స్వాగతాలు వివాదాస్పదమయ్యాయి. ట్రాక్టర్ల ర్యాలీ తర్వాతే శ్రీకాళహస్తిలో ‘కరోనా’ విజృంభించిందన్న విమర్శా ఉంది.

2020-05-05

మత విద్వేషాన్ని రెచ్చగొట్టారన్న ఆరోపణలతో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్ణబ్ గోస్వామిపై ముంబైలో కేసు నమోదైంది. బాంద్రా స్టేషన్ వద్ద ఏప్రిల్ 14న వలస కార్మికులు చేపట్టిన నిరసనకు ఆర్ణబ్ మతం రంగు పులిమారని ఫిర్యాదుదారు అబుబకర్ షేక్ ఫిర్యాదు చేశారు. ఆ ఘటనతో సంబంధం లేని మసీదును లక్ష్యంగా చేసుకొని ముస్లింలపై ద్వేషాన్ని పెంచడానికి గోస్వామి ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మసీదు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో కార్మికులు గుమికూడితే.. మతానికి ఆపాదించారని విమర్శించారు. కేసు నమోదైందని, ఆ రోజు టీవీ ఫుటేజీని సేకరించామని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

2020-05-03

దేశంలో వందలాది మంది ‘కరోనా’కు బలవుతున్న వేళ కొన్ని కంపెనీలు అసాధారణ లాభాలకు తెగబడ్డాయి. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్టు కిట్లు ఒక్కోదాని విలువ రూ. 245 అయితే, కంపెనీలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)కి విక్రయిస్తున్నది రూ. 600కి! అంటే.. లాభం 145 శాతం!! ఈ రేటుపై ఐసిఎంఆర్ 5 లక్షల టెస్టు కిట్లకు ఆర్డర్ ఇచ్చింది. దిగుమతి చేసుకున్న మ్యాట్రిక్స్ ల్యాబ్ ఒక్కో కిట్ రూ. 400 చొప్పున రేర్ మెటాబోలిక్స్, ఆర్క్ ఫార్మాస్యూటికల్స్ లకు సప్లై చేస్తే.. ఆ కంపెనీలు రూ. 600కు ఐసిఎంఆర్ కు అమ్ముతున్నాయి. కంపెనీల మధ్య పేచీ ఢిల్లీ హైకోర్టుకు చేరడంవల్ల ఈ విషయం వెల్లడైంది. కోర్టు కిట్ల ధరను రూ. 400గా నిర్ణ

2020-04-27

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై నిందారోపణలు, ‘విద్వేషపూరిత వ్యాఖ్యలు’ చేసిన రిపబ్లిక్ టీవీ చీఫ్ ఆర్ణబ్ గోస్వామికి అరెస్టునుంచి మూడు వారాలు రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. విద్వేషవ్యాఖ్యల కేసులో గోస్వామిపై ముంబై పోలీసుల దర్యాప్తునకు అనుమతిస్తూనే... అతనిపై ఎలాంటి బలవంతపు చర్యలూ తీసుకోవద్దని ఆదేశించింది. ఈ మూడు వారాల్లో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసుకోచ్చని కూడా అతనికి సూచించింది. ఈ విషయంలో నాగపూర్ లో నమోదైన కేసును కూడా ముంబైకి బదిలీ చేయాలని, 5 రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ లపై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

2020-04-24

శాసన వ్యవస్థ వద్ద బిల్లులు పెండింగులో ఉండగా.. వాటిపై హైకోర్టులో వ్యాజ్యాలు నడుస్తుండగా.. రాజధానిని ఎలా తరలిస్తారని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజధానిని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం వాదనలు విన్నది. రాజధాని తరలింపునకు ప్రభుత్వం రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వలేదని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ న్యాయమూర్తుల ప్రశ్నకు సమాధానమిచ్చారు. వివరాలతో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జెకె మహేశ్వరి, జస్టిస్ ఎవి శేషసాయి, జస్టిస్ సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

2020-04-24

గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనుకకు తీసుకురావడం ఇప్పుడు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం కేరళ హైకోర్టుకు నివేదించింది. ఈ అంశంపై దాఖలైన మూడు పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణకు చేపట్టింది. మలయాళీలను సొంత ప్రాంతాలకు రప్పించి ‘క్వారంటైన్’లో ఉంచడానికి కేరళ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున.. ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలని పిటిషనర్లు కోరారు. అయితే, ‘కరోనా’ ప్రభావం ఉన్న దేశాలనుంచి భారతీయులను వెనుకకు తీసుకురావద్దని కేంద్రం నిర్ణయించిందని, కేరళకు మాత్రం మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వ కౌన్సిల్ సువిన్ మీనన్ కోర్టులో స్పష్టం చేశారు.

2020-04-17

‘కరోనా’ వ్యాప్తికి, పలువురి మరణానికి కారకులయ్యారంటూ తబ్లిఘి జమాత్ చీఫ్ మౌలానా సాద్ కంధాల్వి, మరో ఆరుగురిపై ‘కల్పబుల్ హోమిసైడ్’ కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితం వారిపై నమోదైన ‘ఎఫ్ఐఆర్’లో.. ఐపిసి సెక్షన్ 304 కింద తాజా అభియోగాన్ని చేర్చారు. ప్రత్యక్షంగా హత్య చేయకపోయినా నేరపూరిత నిర్లక్ష్యం, దుస్సాహసంతో మనుషుల మరణానికి కారణమైతే ‘కల్పబుల్ హోమిసైడ్’ పేరిట హత్యానేరం మోపుతారు. ఈ కేసులోనూ జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది. తబ్లిఘి జమాత్ గత నెలలో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమాలతో కొన్ని వందల మందికి ‘కరోనా’ వ్యాపించింది. అనేక మంది చనిపోయారు.

2020-04-16

ఈ నెల 1న గాంధీ ఆసుపత్రి డాక్టరుపై దాడి చేసిన 23 సంవత్సరాల కరోనా పేషెంట్ ను అరెస్టు చేసినట్టు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు. నిందితుడు ఇంకా చికిత్స తీసుకుంటున్నందున బుధవారం అరెస్టు చేసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోర్టు ఎదుట నిలబెట్టినట్టు ఆయన వెల్లడించారు. నిందితుడికి రిమాండు విధించిన కోర్టు, ఆసుపత్రిలోనే కొత్తగా ఏర్పాటు చేసిన జైలు వార్డులో ఉంచాలని ఆదేశించింది. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత అతన్ని జైలుకు తరలిస్తారు. వైరస్ సోకిన వ్యక్తులు లేదా అనుమానితులు నేరపూరితంగా వ్యవహరిస్తే.. వారిని ఉంచడానికే ఈ జైలు వార్డును ఏర్పాటు చేశారు.

2020-04-16

రాష్ట్రంలోని పాఠశాలల్లో మాతృ భాషా మాధ్యమాన్ని రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి సర్కారుకు హైకోర్టు గట్టి పాఠం చెప్పింది. అన్ని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం మాత్రమే ఉండాలంటూ.. గత నవంబరులో విద్యా శాఖ జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 81, 85 లను హైకోర్టు బుధవారం రద్దు చేసింది. ఏ మాధ్యమంలో చదవాలన్నది పిల్లలు, వారి తల్లిదండ్రుల ఇష్టమని కోర్టు స్పష్టం చేసింది. తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేయవద్దని ఎంతమంది సూచించినా ప్రభుత్వం వినలేదు. పైగా.. పేదల పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదవడానికి వారంతా వ్యతిరేకులని ఎదురుదాడి చేసింది.

2020-04-15
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 Last Page