రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు ఉత్తర్వులను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది. నిమ్మగడ్డకు వ్యతిరేకంగా స్వయంగా ఎన్నికల కమిషన్ కార్యదర్శి పిటిషన్ దాఖలు చేయడం విశేషం. అయితే, గతంలో రాష్ట్రప్రభుత్వం సవాలు చేసినప్పుడు స్టే ఇవ్వడానికి నిరాకరించినట్టే.. ఈ పిటిషన్ పైనా సుప్రీంకోర్టు స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ పైన విచారణకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. తాజా పిటిషన్లను కూడా దాంతో కలిపి విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బాబ్డే నాయకత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

2020-06-18

ఇఎస్ఐ కొనుగోళ్ళ కుంభకోణంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సహా ఆరుగురిని అరెస్టు చేసినట్టు ఎసిబి జాయింట్ డైరెక్టర్ రవికుమార్ చెప్పారు. రాష్ట్రంలో 19 చోట్ల సోదాలు నిర్వహించి సికె రమేష్ కుమార్, డాక్టర్ విజయకుమార్, చింతల కిష్టప్ప, రమేష్ బాబు, డాక్టర్ వి. జనార్ధన్ లను అరెస్టు చేసినట్టు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2014-19 కాలంలో రూ. 988 కోట్ల విలువైన మందులు, ల్యాబ్ కిట్లు, సర్జికల్ పరికరాలు, బయోమెట్రిక్ మెషీన్లు కొనుగోలు చేయగా... అందులో సుమారు రూ. 150 కోట్ల మేరకు అవినీతి జరిగిందని రవికుమార్ చెప్పారు. వివిధ పరికరాలకు 50 నుంచి 130 శాతం వరకు అదనంగా చెల్లించారని పేర్కొన్నారు.

2020-06-12

థాయిలాండ్ లో కస్టమర్లను మోసగించిన ఇద్దరు రెస్టారెంట్ యజమానులకు కోర్టు 723 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. లామ్‌గేట్ ఇన్ఫినిట్ అనే రెస్టారెంట్ యజమానులు అతి తక్కువ ధరలకే నాణ్యమైన సీ ఫుడ్ పెడతామని వోచర్లు అమ్మారు. ప్రమోషన్ ముగిశాక మోసం చేశారు. దీంతో మండిపడ్డ వందలమంది ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యజమానులిద్దరూ గత సెప్టెంబరులో అరెస్టయ్యారు. కొసమెరుపేమంటే.. నిందితులు సుదీర్ఘ శిక్షను అనుభవించే అవకాశం లేదు. థాయ్ కోర్టులు వేర్వేరు ఆరోపణలకు కలిపి విధించే శిక్షలు వందల సంవత్సరాలుగా ఉంటాయి. అయితే, అక్కడి చట్టం ప్రకారం 20 ఏళ్లకు మించి జైలులో ఉంచటానికి వీల్లేదు.

2020-06-12

రిజర్వేషన్ హక్కు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. తమిళనాడులోని వైద్య విద్యా కళాశాలల్లో 50 శాతం సీట్లను ఓబీసీలకు రిజర్వు చేయాలన్న విన్నపంపై.. జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు నాయకత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. రిజర్వేషన్ ప్రయోజనాలను కల్పించడానికి నిరాకరించడాన్ని రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. ఆలిండియా కోటా కింద తమిళనాడు సరెండర్ చేసిన మెడికల్, డెంటల్ సీట్లలో 50 శాతాన్ని కేంద్రం ఒబిసిలకు కేటాయించకపోవడాన్ని పలు రాజకీయ పార్టీలు సవాలు చేశాయి.

2020-06-11

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఇసి) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజ్యాంగబద్ధమైన సంస్థలతో ఆటలాడుకుంటారా అని ఘాటుగా ప్రశ్నించింది. ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన జగన్ ప్రభుత్వం, నిమ్మగడ్డను తొలగిస్తూ జీవో ఇచ్చింది. ఆ ఉత్తర్వులన్నిటినీ హైకోర్టు కొద్ది రోజుల క్రితం కొట్టివేయగా.. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు, సమగ్రంగా విచారణ జరుపుతామంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

2020-06-10

సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను విధుల్లోకి తీసుకోవాలని, సస్పెన్సన్ కాలానికీ జీతభత్యాలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా పని చేసిన ఏబీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఆయనకు సుమారు 8 నెలలపాటు పోస్టింగ్ ఇవ్వలేదు. తర్వాత సస్పెండ్ చేశారు. ఇజ్రాయిల్ కంపెనీ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని, సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని ఏబీపై అభియోగాలు మోపారు.

2020-05-22

‘కరోనా’ నుంచి రక్షణకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్95 మాస్కులు కూడా ఇవ్వలేదని విమర్శించి సస్పెండ్ అయిన డాక్టర్ సుధాకర్ పైన పోలీసుల దాష్ఠీకం సీబీఐ పరిధిలోకి వెళ్లింది. సంబంధిత పోలీసులపై కేసు నమోదు చేయాలని, దర్యాప్తు చేపట్టి 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఏపీ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ నెల 16న విశాఖపట్నంలో నిరసన తెలిపిన సుధాకర్ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. తమను, ముఖ్యమంత్రిని ధూషించారంటూ డాక్టర్ ను కొట్టి కేసు పెట్టి మానసిక వైద్యశాలకు పంపించారు. దీనిపైన తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత లేఖ రాయగా.. హైకోర్టు విచారణ చేపట్టింది. విశాఖ జిల్లా జడ్జి ద్వారా సుధాకర్ వాంగ్మూలం తెప్పించుకుంద

2020-05-22

‘కరోనా’ నుంచి రక్షణ కోసం తమ ఆసుపత్రిలో కనీసం ఎన్95 మాస్కులు కూడా లేవని విమర్శించి సస్పెండ్ అయిన నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ ను శనివారం విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. వీధుల్లో చొక్కా విప్పి నిరసన తెలిపిన డాక్టర్ సుధాకర్ రెక్కలు విరిచి కట్టిన పోలీసులు నడిరోడ్డుపై కొద్దిసేపు పడుకోబెట్టారు. లాఠీతో రెండు దెబ్బలు కొట్టి లాక్కుంటూ వెళ్లారు. అంతకు ముందు.. సుధాకర్ తాగిన మత్తులో పోలీసులను, ముఖ్యమంత్రిని ధూషించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

2020-05-16

దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగాయన్నది తెలుగు నానుడి. ఎస్.బి.ఐ. ఏకంగా నాలుగేళ్లకు నోరు తెరిచింది. సుగంధ ద్రవ్యాల ఎగుమతిదారు ‘రాందేవ్ ఇంటర్నేషనల్’ ఎస్.బి.ఐ. సహా 6 బ్యాంకుల నుంచి రూ. 414 కోట్లు రుణం తీసుకొని ఎగవేసింది. ఎస్.బి.ఐ. రుణం రూ. 173.11 కోట్లను 2016లోనే పారు బకాయిగా వర్గీకరించారు. అప్పటినుంచి ప్రమోటర్లు కనిపించడంలేదన్నది బ్యాంకు మాట. 2018లో ఎన్.సి.ఎల్.టి. ఇచ్చిన ఓ ఉత్తర్వుల ప్రకారం.. ప్రమోటర్లు దుబాయ్ కి పారిపోయారు. ఇప్పటిదాకా నిద్రపోయిన ఎస్.బి.ఐ. ఫిబ్రవరిలో సిబిఐకి ఫిర్యాదు చేయగా ఏప్రిల్ 28న సురేష్ కుమార్, నరేష్ కుమార్, సంగీతలపై కేసు నమోదైంది.

2020-05-09

ప్రభుత్వ కార్యాలయాలకు ‘వైసీపీ రంగులు’ వేయడాన్ని ఏపీ హైకోర్టు మరోసారి తప్పు పట్టింది. ఇంతకు ముందు వైసీపీ జెండాలోని మూడు రంగులను ప్రభుత్వ కార్యాలయాలకు వేయగా తొలగించాలని కోర్టు ఆదేశించింది. అయితే, ప్రభుత్వం ఆ మూడు రంగులకు మట్టి రంగు జోడించాలని అధికారులను ఆదేశిస్తూ జీవో 623ని జారీ చేసింది. ఇప్పుడు హైకోర్టు ఆ జీవోను కూడా నిలిపివేస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

2020-05-05
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 Last Page