13 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణపై ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పశ్చిమ గోదావరి జిల్లాలో అరెస్టు చేశారు. ఆ విద్యార్ధిని ఓ అథ్లెట్. కొద్ది నెలల క్రితం... తరగతులు ముగిశాక పాఠశాల మైదానంలో ప్రాక్టీసు చేస్తుండగా, ఆమెను గదిలోకి తీసుకెళ్లిన టీచర్ లైంగికంగా దాడి చేసినట్టు కథనం. ఆ తర్వాత అనేకసార్లు ఆ టీచర్ లైంగికంగా వేధించి... ఈ విషయం బయటకు రాకూడదని విద్యార్ధినిని బెదిరించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.
2019-12-17పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ కు ఆ దేశ ప్రత్యేక కోర్టు ఒకటి మరణ శిక్ష విధించింది. 2007లో రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎమర్జెన్సీ ప్రకటించిన ఉదంతానికి సంబంధించి ‘‘రాజద్రోహం’’ కేసులో ముగ్గురు సభ్యుల ధర్మాసనం 2-1 మెజారిటీతో మంగళవారం శిక్షను ప్రకటించింది. పాకిస్తాన్ లో ఒక మిలిటరీ పాలకుడికి మరణ శిక్ష పడటం ఇదే తొలిసారి. శిక్ష వివరాలను మరో 48 గంటల్లో ప్రకటిస్తారు.అయితే, ముషార్రఫ్ ఇప్పుడు పాకిస్తాన్లో లేరు. 2016 మార్చిలో వైద్య చికిత్సకోసం అని దుబాయి వెళ్లిన ఆయన అక్కడే ఉండిపోయారు.
2019-12-17ఉన్నావ్ మానభంగం కేసులో బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ దోషేనని ఢిల్లీ కోర్టు నిర్ధారించింది. అతనికి విధించే శిక్షను ఈ నెల 18న ప్రకటించనుంది. 2017లో ఒక మైనర్ బాలికను అపహరించి రేప్ చేసినట్టుగా ఈ బీజేపీ ఎమ్మెల్యేపై అభియోగాలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ లో బాధితురాలు యుపి సిఎం యోగి ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నం చేసేవరకు నిందితుడిని అరెస్టు చేయలేదు. ఆ తర్వాత జైలు నుంచే బాధితురాలి కుటుంబం మొత్తాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత బీజేపీ ఈ ఎమ్మెల్యేను బహిష్కరించింది.
2019-12-16ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో... అత్యాచారాలకు మరణశిక్ష విధించాలని నిర్దేశిస్తూ ‘‘దిశ’’ బిల్లును ఆమోదించిన రోజే... హైదరాబాద్ హత్యాచార నిందితులను కాల్చి చంపిన పోలీసులను, అందుకు అనుమతించిన కేసీఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదే పదే ప్రశంసిస్తుండగానే... గుంటూరు నగరంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. వాడ పేరు రామిరెడ్డి నగర్.. నిందితుడు లక్షణరెడ్డి.. ఇంటర్ విద్యార్థి. బాలిక అమ్మమ్మ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉల్లిపాయలకోసం వెళ్లి క్యూలో వేచి చూస్తున్న సమయంలో ఈ అత్యాచారం జరగడం గమనార్హం.
2019-12-13అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణం జరగాలని గతంలో తాము ఇచ్చిన తీర్పును సమీక్షించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై దాఖలైన 18 రివ్యూ పిటిషన్లను గురువారం కొట్టివేసింది. వివాదాస్పద స్థలాన్ని రాముడి జన్మస్థలంగా భావిస్తూ కూలిన బాబ్రీ మసీదును మరోచోట నిర్మించడానికి స్థలం ఇవ్వాలని, రామాలయ నిర్మాణానికి ఓ ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచిస్తూ నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
2019-12-12సామూహిక హత్యాచారం నిందితుల కాల్చివేతపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిషన్ సభ్యుల్లో ఇద్దరు మాజీ న్యాయమూర్తులు కాగా ఒకరు సీబీఐ మాజీ డైరెక్టర్. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.ఎస్. సిర్పూర్కర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్లో బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖా సొండూర్ బాల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డి.ఆర్. కార్తికేయన్ ఉన్నారు. ఈ కమిషన్ హైదరాబాద్ నుంచే పని చేయవలసి ఉంది. ఆరు నెలల్లోగా విచారణ నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది.
2019-12-12వెటర్నరీ డాక్టర్ సామూహిక హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు కాల్చి చంపిన ఘటనపై న్యాయ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి వి.ఎస్. సిర్పూర్కర్ నేతృత్వంలోని కమిషన్ విచారణ చేపడుతుందని చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే ప్రకటించారు. నిందితుల కాల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై వాదనలు విన్న ధర్మాసనం ‘‘ఆ ప్రదేశానికి నిందితులను ఆ సమయంలోనే ఎందుకు తీసుకెళ్లారు? నిందితులు పేల్చిన తూటాలు ఎక్కడ?...’’ వంటి అనేక ప్రశ్నలను సంధించింది.
2019-12-12అల్జీరియా కోర్టు ఒకటి మంగళవారం అసాధారణ తీర్పు చెప్పింది. అవినీతి కేసుల్లో ఇద్దరు మాజీ ప్రధానమంత్రులకు సుదీర్ఘ శిక్ష విధించింది. మాజీ ప్రధానుల్లో అహ్మద్ ఓయాహియాకు 15 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 16 వేల డాలర్ల ఫైన్ విధించింది. అబ్దేల్మలెక్ సెల్లాల్ కు 12 సంవత్సరాల జైలు శిక్ష, 8 వేల డాలర్ల ఫైన్ విధించారు. అల్జీరియాను సుదీర్ఘ కాలం ఏలిన మాజీ అధ్యక్షుడు అబ్దేలాజిజ్ బౌటెఫ్లికా కింద ఈ మాజీ ప్రధానులిద్దరూ పని చేశారు. బౌటెఫ్లికా కూడా అవినీతిపై ప్రజాగ్రహంతోనే దిగిపోయారు.
2019-12-10గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రతినిధులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ), ఫారెన్ ఎక్సేంజ్ మేనేజ్ మెంట్ చట్టం (ఫెమా) కింద ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 82 కేసులు నమోదు చేసింది. సీబీఐ 18 మంది ప్రజాప్రతినిధులు, మాజీలపై 14 కేసులు నమోదు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొంది. సీబీఐ కేసుల్లో ఇద్దరు సిటింగ్ ఎంపీలు, 9 మంది మాజీ ఎంపీలు, ఐదుగురు ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
2019-12-09న్యాయం ఎప్పటికీ ప్రతీకారం రూపు దాల్చకూడదని భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణలో నలుగురు రేపిస్టులను పోలీసులు కాల్చి చంపిన నేపథ్యంలో జస్టిస్ బాబ్డే స్పందించారు. శనివారం రాజస్థాన్ హైకోర్టులో నూతన భవనం ప్రారంభం సందర్భంగా జస్టిస్ బాబ్డే మాట్లాడారు. న్యాయవ్యవస్థలో జాప్యంపై ఆత్మ పరిశీలన అవసరమేనని, అయితే న్యాయం ప్రతీకార రూపుదాల్చితే తన స్వభావాన్నే కోల్పోతుందని పేర్కొన్నారు.
2019-12-07