బెంగాల్ రాష్ట్రంలోని నందిగ్రాం నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి కలకత్తా హైకోర్టు బుధవారం ఎన్నికల అధికారులకు, ఎమ్మెల్యే సువేందు అధికారికి నోటీసులు జారీ చేసింది. పోలింగ్ పత్రాలను, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను భద్రపరచాలని ఈసీకి స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బెంగాల్ అంతటా హవా చూపిన మమతా బెనర్జీ, తాను పోటీ చేసిన నందిగ్రాంలో మాత్రం పాత మిత్రుడు సువేందు చేతిలో ఓడిపోయారు. అక్రమాలు జరిగాయని ఆరోపించిన మమత, రీకౌంటింగ్ కు డిమాండ్ చేశారు. ఈసీ నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించారు.

2021-07-14

నేపాల్ పార్లమెంటు ప్రతినిధుల సభను పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. నేపాల్ కాంగ్రెస్ నాయకుడు షేర్ బహదూర్ దేవుబాను ప్రధానిగా నియమిస్తూ రెండు రోజుల్లో అమలు కావాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. సభ పునరుద్ధరణకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం ఇది రెండోసారి. కెపి శర్మ ఓలి నేతృత్వంలోని మంత్రివర్గం 2020 డిసెంబర్ 20న తొలిసారి ప్రతినిధుల సభను రద్దు చేసింది. ఆ సభను పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు 2021 ఫిబ్రవరి 22న తీర్పు ఇచ్చింది. ఓలి కేబినెట్ మరోసారి మే 22న సభ రద్దు నిర్ణయం తీసుకుంది.

2021-07-12

ఆర్థిక కార్పొరేషన్ల ఏర్పాటులో కొన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వడంలోని హేతుబద్ధతను కర్నాటక హైకోర్టు ప్రశ్నించింది. నిర్ధిష్ట కులాలు/మతాల ప్రయోజనం కోసం కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం వాదనలు విన్నది. ‘‘ఈ కులాలను మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు? ఈ ప్రాధాన్యతకు ప్రాతిపదిక ఏమిటి? ఓ కులం లేదా మతం ఎంపిక కోసం ఏదైనా విధానం ఉందా’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

2021-07-12

పాఠశాల ఆవరణల్లో గ్రామ సచివాలయాలను నిర్మించవద్దన్న తమ ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై మండిపడింది. పంచాయతీరాజ్, విద్యా శాఖల అధికారులకు నోటీసులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వాటికోసం కొన్నిచోట్ల పాఠశాల స్థలాల్లో భవనాలను నిర్మిస్తోంది. అలా చేయవద్దని గత ఏడాది జూన్ 11న హైకోర్టు స్పష్టం చేసినా నిర్మాణాలు ఆగలేదని నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి పిటిషన్లు దాఖలయ్యాయి.

2021-07-12

గ్రామ పంచాయతీల అధికారాలను హరించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 2ను హైకోర్టు సస్పెండ్ చేసింది. సర్పంచ్, సెక్రటరీ అధికారాలను గ్రామ రెవెన్యూ అధికారి (విఆర్ఒ)కి అప్పగిస్తూ ప్రభుత్వం మార్చి నెలలో ఒక జీవోను జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా తోకలవారిపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పంచాయతీల పాలనలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తగదన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది.

2021-07-12

కొత్తగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణం చేసిన జ్యోతిరాదిత్య సింధియా చేయబోయే మొదటి పని ఏమిటి? విమానాశ్రయాలకు పేర్లు పెట్టడం, ఉన్న పేర్లు మార్చడంపై ఒక జాతీయ విధానాన్ని రూపొందించడం! ఇది ఆయన నిర్దేశించుకున్న లేదా ప్రధాని మోదీ నిర్దేశించిన పని కాదు. శుక్రవారం బాంబే హైకోర్టు ఈమేరకు నిర్దేశించింది. ఇప్పటికే ముసాయిదా రూపొందించే పని జరుగుతుంటే, వెంటనే అది పూర్తి చేయాలని, కొత్త విమాన యాన శాఖ మంత్రికి ఇదే మొదటి పని కావాలని హైకోర్టు స్పష్టం చేసింది.

2021-07-09

నూతన ఐటి నిబంధనలను సవాలు చేస్తూ వివిధ హైకోర్టులలో దాఖలైన పిటిషన్లపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అన్ని కేసులనూ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని జూలై 16వ తేదీకి వాయిదా వేసింది. ఐటి రూల్స్ 2021 రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ ఢిల్లీ, కేరళ, మద్రాస్ హైకోర్టులలో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లలో ద వైర్, ద న్యూస్ మినిట్, లైవ్ లా, ద క్వింట్, ఆల్ట్ న్యూస్ వంటి డిజిటల్ మీడియా సంస్థలు ఉన్నాయి. ఆ పిటిషన్లటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రం ఈ నెల 7న కోరింది.

2021-07-09

ఇండియా తరపున గూఢచర్యం చేసినందుకు తన కుమారుడు యుఎఇలో జైలు పాలయ్యాడన్న కేరళ మహిళ షాహుబనాత్ బీవీ నివేదనపై హైకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటని ప్రశ్నించింది. దీనికి కేంద్ర ప్రభుత్వ కౌన్సెల్ స్పందిస్తూ, ఆమె విన్నపాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. 2015 నుంచి జైలులో ఉన్న తన కుమారుడు తీవ్రమైన చిత్రహింసలకు గురవుతున్నాడని, అక్కడి భారత ఎంబసీ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ కనీస సాయం చేయలేదని పిటిషనర్ ఆరోపించారు.

2021-07-06

కాంగ్రెస్ పార్టీ ‘‘టూల్ కిట్’’పై ఎన్.ఐ.ఎ.తో దర్యాప్తు కోరిన ‘‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’’ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజకీయ ప్రచారంపై ఆర్టికల్ 32 ప్రకారం పిటిషన్ ను ఎలా అనుమతిస్తామని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా పిటిషనర్ ను ప్రశ్నించారు. ‘‘టూల్ కిట్ మీకు నచ్చకపోతే వదిలేయండి’’ అన్న జస్టిస్ చంద్రచూడ్, ‘‘ఇండియా ఒక ప్రజాస్వామ్యం, మీకు తెలుసా’’ అని పిటిషనర్ ను ప్రశ్నించారు. ‘‘పనికిమాలిన పిటిషన్లు’’ సుప్రీంకోర్టు సమయాన్ని వృధా చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

2021-07-05

ఫ్రీలాన్స్ జర్నలిస్టు రాజీవ్ శర్మను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) శనివారం అరెస్టు చేసింది. చైనా కంపెనీలతో శర్మ భారీగా లావాదేవీలు నడిపినట్టు ఇ.డి. ఆరోపించింది. శర్మ వంటి వ్యక్తులకు పారితోషికం చెల్లించడం కోసం చైనా కంపెనీలు ఆ దేశ గూఢచార సంస్థలకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయని పేర్కొంది. శర్మను ప్రత్యేక కోర్టు ఏడు రోజుల ఇ.డి. కస్టడీకి అప్పగించింది. చైనా గూఢచార సంస్థలకు రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నాడనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు ఇదివరకే రాజీవ్ శర్మను అరెస్టు చేశారు.

2021-07-03
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 Last Page