సముద్ర మార్గంలో హెరాయిన్ తెస్తున్న ఐదుగురు పాకిస్తానీయులను ఇండియన్ కోస్టు గార్డు, గుజరాత్ ఎ.టి.ఎస్. పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 35 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ‘‘అల్ జమ్ జమ్’’ పేరిట ఉన్న బోటును గమనించిన కోస్టు గార్డులు, పోలీసులు గుజరాత్ లోని జఖావుకు సమీపంలో దాడి చేశారు. ఈ సంయుక్త ఆపరేషన్ కు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది.

2020-01-06

పాకిస్థాన్ చెరలో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులు విడుదలయ్యారు. 20మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ లాండి జైలు నుంచి విడుదల చేసింది. వాఘా సరిహద్దు వద్ద రేపు భారత అధికారులకు వారిని అప్పగించనుంది. మంత్రి మోపిదేవి మత్స్యకారులను తీసుకొచ్చేందుకు వాఘా బయలు దేరి వెళ్లారు. చేపల వేట కోసం గుజరాత్ వెళ్లిన మత్స్యకారులు 2018 నవంబర్ లో పొరపాటున పాకిస్థాన్ జలాల్లో ప్రవేశించారు. దీంతో పాక్ నౌకాదలం వారిని అదుపులోకి తీసుకుంది.

2020-01-05

పాము విషాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. మాల్దా జిల్లాలో పట్టుకున్న ఈ ముగ్గురి నుంచి స్వాధీనం చేసుకున్న విషం విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. కోటిన్నర ఉంటుందని పోలీసులు శనివారం చెప్పారు. ఆ ముగ్గురూ ఇంగ్లీషు బజార్ లోని ఓ హోటల్ లో ఉండగా శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. ఓ గాజు కంటైనర్లో ఉన్న విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రఫీక్ అలి, ఆశిక్ మండల్, మసూద్ షేక్ గా గుర్తించారు.

2020-01-04

తమను బలవంతంగా తరలించే సమయంలో దౌర్జన్యంగా, అసభ్యంగా ప్రవర్తించారంటూ పోలీసులపై మందడం మహిళా రైతులు ఫిర్యాదు చేశారు. తమను ఈడ్చుకెళ్లి కొట్టారని, అసభ్యంగా తిట్టి గొంతు నులిమారని సుప్రియ, బ్రాహ్మణి శుక్రవారం రాత్రి తుళ్లూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైకోర్టు న్యాయవాది వలేటి లక్ష్మీనారాయణ వారితో పోలీసు స్టేషన్ కు వెళ్లారు. అసభ్య పదజాలంతో మాట్లాడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

2020-01-04

అక్రమ ఆస్తుల కేసులో వచ్చే శుక్రవారం (జనవరి 10న) హాజరు కావాలని హైదరాబాద్ లోని సిబిఐ కోర్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆదేశించింది. జగన్ తండ్రి సిఎంగా ఉన్నప్పుడు ‘క్విడ్ ప్రోకో’ ఒప్పందాలతో ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సీబీఐ కేసులు పెట్టింది. సిఎం కాక ముందు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరైన జగన్, ఆ తర్వాత ఏదో ఒక కారణం చూపి మినహాయింపు కోరుతున్నారు. ఇప్పటికి 10 మినహాయింపులు తీసుకున్నారని కోర్టు శుక్రవారం గుర్తు చేసింది.

2020-01-04

2019లో ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) 243 కేసులు నమోదు చేసింది. వాటిలో 96 ట్రాప్ కేసులు కాగా 23 ఆదాయానికి మించి ఆస్తులు తేలినవి. ప్రభుత్వ శాఖల్లో రెవెన్యూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఆ శాఖకు సంబంధించిన అధికారులపై 36 కేసులు నమోదు కాగా, హోం శాఖకు సంబంధించి 11, మున్సిపల్ శాఖకు సంబంధించి 9 నమోదయ్యాయి. తర్వాత స్థానాల్లో ఇంథనం (7), పంచాయతీరాజ్ (6), జల వనరుల శాఖ (4), విద్యా శాఖ (4) ఉన్నాయి.

2020-01-01

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కార్యాలయాలు, ఇళ్ళలో మంగళవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో రాయపాటికి సంబంధించిన కార్యాలయాల్లోనూ, ఆయన కంపెనీ ‘ట్రాన్స్ ట్రాయ్’కి సిఇఒగా ఉన్న శ్రీధర్ చెరుకూరి నివాసంలోనూ సోదాలు జరిగాయి. ‘ట్రాన్స్ ట్రాయ్’ నిర్మాణ సంస్థ బ్యాంకులకు రూ. 300 కోట్ల మేరకు బకాయి పడగా... బ్యాంకుల కన్సార్షియం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ రంగంలోకి దిగింది.

2019-12-31

హైదరాబాద్ సామూహిక మానభంగం కేసులో కాల్చివేతకు గురైన నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆ మృతదేహాలు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఉన్నాయి. 23వ తేదీ సాయంత్రం లోగా రీ పోస్టుమార్టం చేయాలని, ఆ ప్రక్రియను వీడియో తీసి కోర్టుకు అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ‘‘ఎన్ కౌంటర్’’ జరిగిన రోజే మహబూబ్ నగర్ లో పోస్టుమార్టం జరిగినా సుప్రీంకోర్టు ఆదేశాలతో మృతదేహాలను భద్రపరిచారు.

2019-12-21

ఉన్నావ్ మానభంగం, బాధితురాలి కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసుల్లో నిందితుడైన ఉత్తరప్రదేశ్ బీజేపీ (బహిష్కృత) ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. కిడ్నాప్, రేప్ కేసుల్లో శిక్షతోపాటు... రూ. 25 లక్షల జరిమానా విధించింది. 2017లో సామూహిక అత్యాచారం జరిగితే.. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినందున పోలీసులు చర్యలు తీసుకోలేదు. బాధితురాలు గత ఏడాది యూపీ సిఎం యోగి ఆధిత్యనాథ్ ఇంటి ఎదుట ఆత్మహత్యా ప్రయత్నం చేశాక... నిందితుడిని అరెస్టు చేశారు.

2019-12-20

‘‘నిర్భయ’’ అత్యాచార ఘటనలో దోషి అక్షయ్ కుమార్ సింగ్ ఉరిశిక్షను సమీక్షించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన సామూహిక మానభంగం కేసులో నలుగురు నిందితులు. వారిలో ముగ్గురు ఇదివరకే తమ ‘ఉరిశిక్ష’ను మార్చాలని కోరారు. అప్పుడూ కోర్టు తిరస్కరించింది. పేదవాడు కావడంవల్లనే అక్షయ్ ఉరిశిక్షకు గురయ్యాడని, మీడియా, రాజకీయ ఒత్తిడివల్లనే తీవ్రమైన శిక్ష విధించారని అతని న్యాయవాది వాదించారు. అయితే, ఇదంతా ఇంతకు ముందే వినిపించారని సుప్రీం కొట్టిపారేసింది.

2019-12-18
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 Last Page